Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిజ్‌భూషణ్‌ను జైలుకు పంపే వరకు పోరాటం
- నిరసన దీక్ష కొనసాగించిన మల్లయోధులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారతీయ జనతా పార్టీ (బిజెపి)ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు మా లక్ష్యం కాదు. లైంగిక వేధింపులకు పాల్పడి, బెదిరింపులకు దిగుతున్న బిజెపి ఎంపీని జైలు పాలు చేయటమే మా లక్ష్యం. బ్రిజ్‌భూషణ్ జైలుకు వెళ్లే వరకు పోరాటం ఆగదు' అని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ క్రీడాకారులు ప్రకటించారు. శుక్రవారం సుప్రీంకోర్టులో రెజ్లర్ల పిటిషను విచారణకు రాగా బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు ఢిల్లీ పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల అనంతరం జంతర్ మంతర్ వద్ద దీక్షా స్థలిలో రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియాలు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులపై (ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్ర హోం శాఖ ఆధీనంలో పని చేస్తుంది) విశ్వాసం కోల్పోయామని వ్యాఖ్యానించారు.
'ఢిల్లీ పోలీసులపై మాకు నమ్మకం లేదు. జంతర్ మంతర్ వద్ద ఆరు రోజులుగా కూర్చున్నాం. అయినా, బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అంత సులువుగా ఢిల్లీ పోలీసులను విశ్వసించం. బిజెపి ఎంపీని జైలుకు పంపించాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం. క్రీడా సంఘాల్లోనే కాదు పార్లమెంట్ సహా ఇతర పదవుల నుంచి బ్రిజ్‌భూషణ్‌ను తొలగించాలని ప్రధాని మోడిని కోరుతున్నాం. అధికార దుర్వినియోగానికి బ్రిజ్‌భూషణ్ పరాకాష్ఠ. సుప్రీంకోర్టుపై పూర్తి విశ్వాసం ఉంచాం. ఇక నుంచి లైంగిక వేధింపుల అంశంలో ఆధారాలను నేరుగా సుప్రీంకోర్టుకే అందజేస్తాం. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు అనుకూలంగా, బలహీనంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సైతం ఢిల్లీ పోలీసులు వెనుకాడరనే సందేహం ఉందని' మీడియాతో మల్లయోధులు తెలిపారు.
మల్లయోధులకు మద్దతు
జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన క్రమశిక్షణ ఉల్లంఘన, దేశ ప్రతిష్టకు భంగకరమని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పి.టి ఉష తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. మరోవైపు క్రీడా సమాజం నుంచి మల్లయోధులకు మద్దతు వెల్లువెత్తింది. బిజెపి ఎంపీకి అనుకూల వ్యాఖ్యలతో పి.టి ఉష స్థాయికి తగ్గించుకోగా.. న్యాయ పోరాటం చేస్తున్న మల్లయోధులకు మద్దతు ఇచ్చిన ఇతర క్రీడాకారులు బాధ్యతను చాటుకున్నారు. భారత స్టార్ అథ్లెట్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా రెజ్లర్లకు మద్దతుగా సోషల్ మీడియాలో స్పందించాడు. 'అథ్లెట్లు రోడ్డు మీదకు వచ్చి న్యాయం కోసం పోరాటం చేయటం బాధగా ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించటం కోసం, దేశం గర్వపడే ప్రదర్శన చేయటం కోసం అథ్లెట్లు ఎంతగానో కష్టపడతారు. అటువంటి అథ్లెట్లను కాపాడుకోవటం మన అందరి గౌరవం, బాధ్యత. రెజ్లర్లకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు' అని నీరజ్ చోప్రా అన్నాడు. బీజింగ్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా సైతం రెజ్లర్లకు మద్దతు పలికాడు. టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా, క్రికెట్ దిగ్గజాలు కపిల్‌దేవ్, వీరెందర్ సెహ్వాగ్, హార్బజన్ సింగ్, బాక్సింగ్ స్టార్ నిఖత్ జరీన్, హాకీ స్టార్ రాణి రాంపాల్, మాజీ క్రికెటర్, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు సహా పలువురు క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా రెజ్లర్లకు మద్దతు పలికారు.