Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
- దూరమవుతున్న సాంప్రదాయ ఓట్ బ్యాంక్
న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కెతోంది. అయితే ప్రస్తుతం ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలకు ఆయా పార్టీల సాంప్రదాయ ఓట్ బ్యాంక్ దూరమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వీరి మద్దతును మళ్లీ ఎలా పొందాలో అనే విషయంపై పార్టీలు ప్రణాళికలు వేస్తున్నాయి.
సాధారణంగా కర్ణాటకలో బీజేపీకి లింగాయత్‌లు, కాంగ్రెస్‌కు వక్కలిగలు, అహిందలు, జనతాదళ్ (ఎస్)కు హస్సన్, మండ్యాలను సాంప్రదాయ ఓట్ బ్యాంక్‌కు భావిస్తుంటారు. అయితే తాజా ఎన్నికల్లో ఈ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ దూరమవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు ఆ పార్టీలు చేసిన తప్పిదాలే కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ముందుగా ప్రస్తుతం అధికారంలో బీజేపీ విషయానికి వస్తే ఈ పార్టీ గుజరాత్లో అనుసరించిన విధానాన్ని కర్ణాటకలో కూడా అమలు చేయాలని ప్రయత్నం చేసి తీవ్రంగా భంగపడింది. టిక్కెట్ల కేటాయింపులో ఒక తరానికి చెందిన ప్రముఖ నాయకులను పూర్తిగా పక్కన పెట్టింది. అయితే వీరిలో ఎక్కువ మంది లింగాయత్‌లు చెందిన నాయకులే ఉన్నారు. దీంతో తమకు టిక్కెట్లు రాకపోవడంతో లింగాయత్‌లకు చెందిన సీనియర్ నాయకులు జగదీశ్ షెట్టర్, లక్ష్మణ్ సవాదీ వంటి నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో బిజెపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం లింగాయత్ ఓటర్లే బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో కష్టాలు తప్పవని భావిస్తున్నారు. జగదీశ్ షెట్టర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఆ పార్టీకి ఎంతో లాభం చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డానే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. అయితే లింగాయత్‌లు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటం కొత్త కాదు. 1991కు ముందు వారు కాంగ్రెస్ వైపునే ఉండేవారు. తరువాత నుంచి బీజేపీకి దగ్గరగా మారారు. కాగా, లింగాయత్‌లు మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గర కావడం ఆ పార్టీకి మేలు చేస్తుందా..లేదా అనేది ఎన్నికల ఫలితాల ద్వారానే వెల్లడవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే లింగాయత్‌లు కాంగ్రెస్‌కు దగ్గర కావడం వల్లన వక్కలిగలు, అహిందలు వంటి వారు ఆ పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు జేడీ(ఎస్) పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. బీజేపీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి 28 స్థానాల్లో టిక్కెట్లు ఇచ్చింది. సొంత నేతలను కాదని ఇంత మందికి టిక్కెట్లు కేటాయించడంపై సొంత క్యాడేర్, ఓటు బ్యాంక్‌లో అసంతృప్తి నెలకుంది. అలాగే దేవగౌడ కుటుంబంలోని గొడవలు కూడా జేడీ(ఎస్)కు ఇబ్బందులు సృష్టిస్తాయని భావిస్తున్నారు. హసన్ నియోజకవర్గం టిక్కెట్టు కోసం దేవగౌడ కుమారులు కుమార స్వామి, హెచ్డి రెవన్న భార్య భవానీ రెవన్న పట్టుపట్టారు. చివరికి ఈ స్థానాన్ని వేరే వారికి కేటాయించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులతోనే 90 ఏళ్ల వయస్సులో కూడా దేవగౌడ ప్రచారం నిర్వహించాల్సి వస్తోంది. ఏదీ ఏమైనా ఈ సారి కర్ణాటక ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అమిత్‌షా, యోగీలపై నిషేధం విధించండి : ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ప్రసుత్త ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాధ్పై నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఈ ఇద్దరు నాయకులు మైనార్టీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అభిషేక్ సింఘ్వి, పవన్ కుమార్ బన్సాల్, ముకుల్ వాస్నిక్‌లతో కూడిన కాంగ్రెస్ నాయకుల ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లును కలిసింది. అమిత్ షా, అదిత్యనాథ్లు ఈ ఎన్నికల్లో లబ్ది పొందడానికి నకిలీ, పక్షపాతం, మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపింది. ఈ నాయకులపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని ఎన్నికల కార్యాలయం వెలుపుల మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.