Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతిక్ అహ్మద్, సోదరుడి హత్యలపై యూపీ సర్కార్‌ని ప్రశ్నించిన సుప్రీం
- మూడు వారాల్లోగా సమగ్ర అఫిడవిట్ అందచేయాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : పోలీసు కస్టడీలో వుంటుండగా, గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్య జరిగిన తర్వాత తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు శుక్రవారం యూపీ ప్రభుత్వాన్ని కోరింది. వారిద్దరిని అంబులెన్సులో నేరుగా ఆస్పత్రి గేటు వద్దకు తీసుకెళ్ళకుండా మీడియా ముందు ఎందుకు ప్రదర్శించారో చెప్పాల్సిందిగా యుపి ప్రభుత్వ అటార్నీని కోరింది. ఈ నెల 15న రొటీన్ మెడికల్ చెకప్ కోసం ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ డివిజనల్ ఆస్పత్రికి రాత్రి 10.30గంటల సమయంలో పోలీసులు తీసుకువస్తుండగా, ఆ రాత్రి సమయంలో మీడియా సమావేశం సందర్భంగా జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిద్దరిని కాల్చి చంపారు. ''వారిని ఆస్పత్రి ఎంట్రన్స్ వరకు నేరుగా తీసుకెళ్ళకుండా మధ్యలో ఎందుకు పరేడ్ చేశారు? మేం వీడియో చూశామని జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగిని ప్రశ్నించింది. పైగా ఆ సమయంలో వారిని మెడికల్ చెకప్ కోసం తీసుకెళుతున్నట్లు ఆ దుండగులకు ఎలా తెలిసిందని ప్రశ్నించింది. పైగా ఏ ఆస్పత్రికి తీసుకెళుతున్నారో కూడా ఎలా తెలిసిందని వారు అడిగారు. దానిపై రోహ్తగి స్పందిస్తూ, ప్రతి రెండు రోజులకోసారి వారిని వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువస్తామని, అందుకు పోలీసు కస్టడీ అవసరమవుతుందని, తమకు తెలిసినంతవరకు ఆ దుండగులు వరుసగా మూడు రోజుల నుండి వస్తున్నారని చెప్పారు. వారిద్దరు పోలీసు కస్టడీలో వుంటుండగా హత్యకు గురి కావడాన్ని రోహ్తగి సమర్ధించుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ అతిక్, ఆయన సోదరుడు, కుమారుడు, మరో సహచరుడు హత్యలకు గురి కావడంపైతీసుకున్న చర్యల వివరాలను తెలియచేస్తూ మూడు వారాల్లోగా సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీం బెంచ్ ఆదేశించింది.