Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణిపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటనకు ముందే ఘటన
- అడవుల్ని నాశనం చేస్తున్నారంటూ గిరిజనుల ఆగ్రహం
- అదుపు తప్పిన పరిస్థితి.. ఆంక్షలు విధింపు
- ఇంటర్నెట్ సస్పెండ్.. 144 సెక్షన్ అమలు
- బీరెన్ సింగ్ కార్యక్రమం వాయిదా
ఇంఫాల్ : మణిపూర్‌లో ఆ రాష్ట్ర సీఎం పాల్గొనాల్సిన ఒక కార్యక్రమానికి సంబంధించిన వేదికకు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ షెడ్యూల్ ప్రకారం చురాచంద్పూర్లో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నది. అలాగే, జిమ్ మరియు క్రీడా సౌకర్యాన్ని ప్రారంభించాల్సి ఉన్నది. అయితే, ముఖ్యమంత్రి రాకకు ముందే ఆయన పాల్గొనాల్సిన వేదికను కొందరు ధ్వంసం చేసి నిప్పంటించారు. వేదిక లోపల ఉన్న కుర్చీలు, ఇతర ఆస్థులను దుండగులు ధ్వంసం చేశారు. కొత్తగా నిర్మిస్తున్న జిమ్‌కు సంబంధించిన క్రీడా పరికరాలకు సైతం ఆందోళనకారులు నిప్పంటించారు.వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అప్పటికే వేదిక లోపల ఉన్న వందలాది కుర్చీలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, పరిస్థితి అదుపు తప్పటంతో చురాచంద్పూర్ యంత్రాంగం జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ అక్కడ టెన్షన్ వాతవరణమే నెలకొన్నది. అయితే, ఇండీజినియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ నేతృత్వంలోనే ఈ దాడి ఘటన చోటు చేసుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్వహించే రిజర్వ్ మరియు రక్షిత అటవీ , చిత్తడి నేలల సర్వేను ఈ ఫోరమ్ వ్యతిరేకిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చర్చిలనూ కూలగొట్టిందని ఫోరమ్ ఆరోపించింది. సాక్షాత్తూ సీఎం పాల్గొనాల్సి ఉన్న వేదికకే దుండగులు నిప్పు పెట్టడం, హింస చెలరేగడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. చురాచంద్పూర్లో ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. 144 సెక్షన్‌ను విధించారు. ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో సీఎం పర్యటన వాయిదాపడింది.