Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ తీరు ఆమోదయోగ్యంకాదు : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లుకు వాటర్, కరెంట్ కట్ చేశారు. ఢిల్లీ పోలీసులు వడిగట్టిన ఈ అప్రజాస్వామ్య చర్యలపై రెజ్లర్లు మండిపడుతున్నారు. మరోవైపు రెజ్లర్ల ఆందోళనకు మరింత మద్దతు, సంఘీభావం వెల్లువెత్తుతున్నది. రాజకీయ నేతలతోపాటు క్రీడాకారులు, సినీ ప్రముఖులు, మహిళా సంఘాల నాయకులు ఆందోళనకు మద్దతు, సంఘీభావం తెలుపుతున్నారు.
ఆందోళన ఆపేయాలని తమపై ఒత్తిడి : బజరంగ్ పూనియా
బజరంగ్ పూనియా మాట్లాడుతూ 'మాకు ఆహారం అందకుండా. నీటి సరఫరా లేకుండా చేస్తున్నారు. పవర్ కట్ చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకాగానే మా నిరసన ఆపివేయాలని మాపై ఒత్తిడి తెచ్చారు.నిరసన వేదిక వద్దకు ఆహారం తీసుకువచ్చే వారిని కొట్టి, పారిపోయేలా చేస్తున్నారు. మీరు ఏమైనా చేసుకోండి.. లోపలికి ఆహారం, నీరు అనుమతించమని ఏసిపి మాతో అన్నారు. పోలీసులు మమ్మల్ని ఎంతగా హింసించినా.. మాకు న్యాయం జరిగేవరకు మేం పోరాటం సాగిస్తాం' అని పేర్కొన్నారు.
కేంద్రం తీరు ఆమోదయోగ్యం కాదు సీతారాం ఏచూరి
రెజ్లర్ల ఆందోళనపై ప్రభుత్వ దుశ్చర్యలను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. రెజ్లర్లు దేశానికి గొప్ప గౌరవ ప్రతిష్టలు తెచ్చిపెట్టారని, దాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. వారంతా ప్రపంచ స్థాయి క్రీడాకారులని, వారి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు ఆమోదయోగ్యం కాదని అన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా ఆలస్యం చేశారని తెలిపారు. క్రీడాకారులకు న్యాయం జరగాలని స్పష్టం చేశారు. ఐద్వా జాతీయ అధ్యక్షురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు శ్రీమతి టీచర్ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ కేంద్ర కమిటీ ఈ ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ తీర్మానం ఆమోదించిందని అన్నారు.