Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పెరుగుతున్న వ్యయం
న్యూఢిల్లీ: దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులలో సగానికి పైగా నత్తనడక నడుస్తున్నాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మార్చి నాటికి కేంద్ర ప్రాజెక్టులలో 56.7 శాతం ప్రాజెక్టుల నిర్మాణం బాగా ఆలస్యమైంది. గడచిన రెండు దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ జాప్యం ఇప్పుడే అధికంగా ఉంది. ఈ సమాచారాన్ని మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ విభాగం ప్రచురించింది. దీని ప్రకారం దేశంలో రూ. 150 కోట్ల కంటే ఎక్కువ వ్యయమయ్యే 1,449 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం సగటున మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఆలస్యమవుతోంది.
ఈ జాప్యం కారణంగా ప్రాజెక్టుల ఖర్చు అంచనా వ్యయం కంటే 22.02 శాతం పెరిగింది. ఉదాహరణకు కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ వ్యయాన్ని 3,550 కోట్లుగా అంచనా వేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి వ్యయం 120 రెట్లు పెరిగిపోయింది. నిర్మాణంలో బాగా ఆలస్యమ వుతున్న ప్రాజెక్టులలో భారతీయ రైల్వేలకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. అంచనా వ్యయంతో పోలిస్తే ఈ ప్రాజెక్టుల ఖర్చు రూ. 2.5 ట్రిలియన్లు పెరిగింది. ఆ తర్వాతి స్థానం విద్యుత్ రంగానిది. ఈ రంగంలోని ప్రాజెక్టుల వ్యయం రూ. 0.6 ట్రిలియన్లు పెరిగింది. అలాగే జల వనరుల ప్రాజెక్టుల వ్యయం కూడా రూ. 0.5 ట్రిలియన్లు పెరిగింది. 2018లో కేంద్ర ప్రాజెక్టులలో కేవలం 19.3 శాతం ప్రాజెక్టుల నిర్మాణం మాత్రమే ఆలస్యమైంది. గడచిన ఐదేళ్ల కాలంలో ఈ జాప్యం బాగా పెరిగింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వ కాలంలోనే ప్రాజెక్టులు ఎక్కువగా నత్తనడక నడుస్తున్నాయి.