Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు మీద నమాజ్ చేసినందుకు 1800 మందిపై కేసులు
- రంజాన్ రోజు కాన్పూర్‌లో పోలీసుల తీరు
- యోగి ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం
లక్నో : 2017లో యూపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలను లక్ష్యంగా చేసుకొని యోగి సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. బుల్డోజర్ల కూల్చివేతలు.. ఎన్కౌంటర్ పేరుతో కాల్చివేతలు ఆ వర్గం ప్రజలే టార్గెట్‌గా కొనసాగాయని నిపుణులు, విశ్లేషకులు తెలిపారు. యూపీలో రెండో సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రమైందన్నారు. యోగి సర్కారు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఇది ముస్లింలలో మరింత భయాన్ని కలుగజేస్తున్నదని తెలిపారు. ఇందుకు యూపీలోని కాన్పూర్‌లో తాజాగా చోటు చేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. రంజాన్ రోజు ఎలాంటి అనుమతి లేకుండానే రోడ్డు మీదే ప్రార్థనలు (నమాజ్) చేస్తున్నారని 1800 మందిపై యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాన్పూర్‌లోని మూడు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఈ కేసులు నమోదు కావడం గమనార్హం.
ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. యోగి సర్కారు తీరును ప్రతిపక్ష పార్టీ నాయకులు, సామాజిక వేత్తలు తీవ్రంగా విమర్శించారు. మత సామరస్యాన్ని కాపాడాల్సింది పోయి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పోలీసు కేసులతో వారిలో భయాన్ని పెంపొందించడం దేనికి సంకేతమని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, మతం పేరుతో తాము అవసరంగా టార్గెట్ అవుతున్నామని స్థానికులు ఆరోపించారు. రోడ్ల మీద నమాజ్ చేయడానికి అనుమతుండదన్న విషయం తెలియని కొందరు.. ఈద్గా ప్రాంతాల్లో స్థలం సరిపోకపోవడంతో రోడ్డు మీదకు వచ్చి ప్రార్థనలు చేశారని తెలిపారు. ఇది దురదృష్టకరమైన విషయమనీ ఎపిడెమిక్ యాక్ట్‌లోని సెక్షన్ 2 కింద కేసులు నమోదు చేశారనీ, ఇది ప్రభుత్వ ఆలోచనా తీరును తెలియజేస్తున్నదని అన్నారు. మొరాదాబాద్‌లో తమ ఇండ్లల్లో ప్రార్థనలు చేసుకుంటున్నవారిపై కేసులు నమోదయ్యాయనీ, కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు ఇది నిదర్శనమని స్థానిక ముస్లిం స్కాలర్ ఒకరు తెలిపారు. అమాయకపు ముస్లింలను విచారణ కోసం పోలీసులు తీసుకెళ్తారని కొందరు స్థానికులు భయాందోళనను వ్యక్తం చేశారు.
దేశంలోని ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉన్నదనీ, అయితే యూపీలోని యోగి సర్కారు మాత్రం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వ్యవహరిస్తున్నదని ఇక్కడి ప్రజలు తెలిపారు. యోగి సర్కారు ఆదేశాలతో పని చేస్తున్న పోలీసులు, హిందూత్వ శక్తుల తీరుతో తాము బాధితులుగా మిగులుతున్నామని అన్నారు. అలీగర్, బాఫ్ుపట్లలోనూ ఇలాంటి కేసులే నమోదయ్యాయి. రోడ్లపై నమాజ్ చేస్తున్నారని పలువురిపై ఇలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం.