Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యున్నత కమిటీలో అతి పిన్న వయస్కుడు
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడిగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ ఎన్నిక అయ్యారు. దీంతో సీపీఐ(ఎం) అత్యున్నత కమిటీలో అతి పిన్న వయస్కుడిగా ఆయన నిలిచారు. ఢిల్లీలోని హరి కిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో మూడు రోజుల పాటు జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావే శాలు శనివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో కేంద్ర కమిటీ సభ్యులంతా విక్రమ్ సింగ్‌ను కేంద్ర కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 43 ఏళ్ల విక్రమ్ సింగ్ 1980 అక్టోబర్ 1న హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లా, ఇండోరా మండలం, భాపు గ్రామంలో జన్మించారు. తండ్రి హన్స్ రాజ్ వ్యవసాయ కార్మికుడు. ఆయన ఇండియన్ ఆర్మీలో కూడా సేవలందించారు. తల్లి రామ్‌ప్యారీ కుటుంబ బాధ్యతలు నిర్వహి స్తున్నారు. 2000లో విక్రమ్ సింగ్ బిఎస్సి చదువుతున్నప్పుడు ఎస్ఎఫ్ఐలో చేరారు. ఆ ఏడాదే సీపీఐ(ఎం) సభ్యత్వం తీసుకున్నారు. 2003లో హిమాచల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ జూవాలజీలో చేరారు. 2004లో యూనివర్శిటీ కమిటీ కార్యదర్శి గా ఎన్నికయ్యారు. 2005లో హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం (హెచ్పీయూఎస్యూ) ఎన్నికల్లో అధ్యక్షునిగా ఘన విజయం సాధించారు. 2009లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 2011లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా, 2013లో జాతీయ సహాయ కార్యదర్శిగా, 2016లో ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. హెచ్‌పీయూలో ఎంఎస్సీ పూర్తి చేసిన తరువాత, జూవాలజీలో ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. 2016లో యుజిసి అందించిన అత్యున్నత ఫెలోషిప్ పీడీఎఫ్‌ను సొంతం చేసుకున్నారు. 2018లో ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యి, వ్యవసాయ కార్మిక సంఘంలో పని చేశారు. 2019లో ఏఐఏడబ్ల్యూయూ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, ఆ తరువాత 2020లో ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.