Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే నుంచి నవంబర్ వరకు కార్యక్రమాలు
- సెప్టెంబరు నుంచి నవంబర్ వరకు భారీ అఖిల భారత జాతాలు
- రెజ్లర్లకు సంపూర్ణ మద్దతు :ఎస్‌కెఎం జాతీయ సమావేశం నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్త ఆందోళనకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కెఎం) పిలుపు ఇచ్చింది. ఆదివారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్ లో సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రైతు సంఘాల నుంచి 200 మందికి పైగా రైతు నాయకులు హాజరయ్యారు. వివరణాత్మక చర్చల తరువాత, జాతీయ సమావేశం భవిష్యత్తు కార్యక్రమాలను నిర్ణయించింది. అనంతరం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పిసిఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ కెఎం నేతలు అశోక్ దావలే, హన్నన్ మొల్లా, దర్శన్ పాల్, అవిక్ షా మాట్లాడుతూ సమావేశం నిర్ణయాలను వెల్లడించారు. ''కనీస మద్దతు ధర చట్టం, రుణ మాఫీ, రైతు, వ్యవసాయ కార్మికుల పెన్షన్, సమగ్ర పంటల బీమా పథకం, రైతు హంతకుడు కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా అరెస్ట్, రైతులపై తప్పుడు కేసుల ఉపసంహరణ, ఉద్యమంలో అసువులు బాసిన అమరవీర రైతు కుటుంబాలకు పరిహారం వంటి ప్రధాన సమస్యలపై మే 26 నుండి 31వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పార్లమెంటు సభ్యులు, ముఖ్య రాజకీయ నాయకుల సొంత నియోజకవర్గాల్లో కార్యాలయాలు, నివాసాలకు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించి, వారికి మెమోరాండం సమర్పిస్తాం. రైతుల డిమాండ్లన్నింటినీ వెంటనే పరిష్కరించాలని హెచ్చరిస్తూ, విఫలమైతే వారు తదుపరి నిరసనలను ఎదుర్కోవలసి ఉంటుంది'' అని హెచ్చరించారు.
''మే, జూన్, జూలై నెలల్లో దేశంలోని ప్రతి రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కార్మికులతో రాష్ట్ర, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తాం'' అని అన్నారు. ''రైతులు, కార్మికుల ప్రయోజనాలను కార్పొరేట్లకు విక్రయించడాన్ని నిలిపివేయాలని ఆగస్టు 1 నుండి 15 వరకు కార్మిక సంఘాలు, సంఘాల సమన్వయంతో సామూహిక నిరసనలు నిర్వహిస్తాం'' అని తెలిపారు.
''సెప్టెంబరు నుండి నవంబర్ మధ్య దేశవ్యాప్తంగా భారీ అఖిల భారత జాతాలు నిర్వహిస్తాం. దీనికి ఎస్ కెఎం జాతీయ నాయకులు నాయకత్వం వహిస్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మొదలైన అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై జాతాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి'' అని పేర్కొన్నారు. లఖింపూర్ ఖేరీలో బిజెపి నాయకులు రైతులను హత్య చేసిన అక్టోబర్ 3న, అఖిల భారత షహీదీ దివస్ నిర్వహిస్తామని అన్నారు. ''నవంబర్ 26న రైతుల చారిత్రాత్మక ఢిల్లీ చలో మార్చ్ ఢిల్లీ సరిహద్దులకు చేరిన రోజున, అఖిల భారత విజరు దివస్ అన్ని రాష్ట్ర రాజధానులలో కనీసం మూడు రోజుల పాటు పగలు-రాత్రి ధర్నా నిర్వహిస్తామని అన్నారు.
ఎస్ కెఎం జాతీయ సమావేశం తీర్మానాలు
ఎస్ కెఎం జాతీయ సమావేశం మూడు తీర్మానాలను ఆమోదించిందని తెలిపారు. ''బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో కూర్చున్న భారత మహిళా రెజ్లర్ల నిరసనకు ఎస్ కెఎం సంపూర్ణ మద్దతు ఇస్తుంది. క్రీడాకారులకు ఎస్ కెఎం సంఘీభావం తెలియజేస్తుంది. బిజెపి ఎంపిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఎస్ కెఎం నాయకుల ప్రతినిధి బృందం నిరసన స్థలాన్ని సందర్శించి, క్రీడాకారులను కలుసుకుని, వారికి మద్దతును తెలియజేశారు'' అని తెలిపారు.
''రైతుల ఉద్యమానికి, ఎస్ కెఎంకి స్థిరమైన మద్దతుదారుగా ఉన్న మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై బిజెపి ప్రభుత్వం సిబిఐ వంటి సెంట్రల్ ఏజెన్సీలతో దాడి చేయడాన్ని ఎస్ కెఎం ఖండిస్తుంది. పుల్వామాలో మన సైనికుల అనవసరమైన ప్రాణనష్టం, అత్యున్నత స్థాయిలో బిజెపి నాయకత్వం అవినీతి మొదలైన వాటికి సంబంధించి మాలిక్ బిజెపి ప్రభుత్వం దుశ్చర్యలను బహిర్గతం చేస్తున్నారు. మాలిక్ ధైర్యాన్ని ఎస్ కెఎం కొనియాడింది.
మాలిక్‌ను కించపరిచేందుకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించే చర్యలకు ఎస్ కెఎం మద్దతు ఇస్తుంది'' అని అన్నారు.
''చారిత్రాత్మక ఢిల్లీ రైతాంగ పోరాటానికి ఈ సంఘాలు మద్దతిచ్చి కొంత నిధులను విరాళంగా అందించినందున, దేశంలోని తపాలా ఉద్యోగుల సంఘాలు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్, ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ లను ప్రభుత్వం గుర్తింపు రద్దు చేయడాన్ని ఎస్ కెఎం ఖండించింది. ఆయా సంఘాలకు సంఘీభావం తెలియజేసింది. గుర్తింపు రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక, రైతు ఐక్యతను పెంచడానికి మద్దతుగా ఉంటుంది'' అని అన్నారు.