Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ చర్య దిగ్భ్రాంతి కలిగించింది..
- ఇది చరిత్రలో కనీ వినీ ఎరుగనిది : సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర హౌం మంత్రి అమిత్ షాను విమర్శిస్తూ ఆర్టికల్ రాసినందుకు సీపీఐ(ఎం )ఎంపీ జాన్ బ్రిట్టాస్ కి రాజ్యసభ చైర్మెన్ జగ్దీప్ ధన్కర్ సమన్లు ఇచ్చారు. కేంద్ర హౌంమంత్రి అమిత్ షా కేరళను చిన్నచూపు చూశారని రాసిన వార్తాపత్రిక కథనానికి వివరణ ఇవ్వాలని కోరారు. రాజ్య సభ చైర్మెన్ చర్య ''దిగ్భ్రాంతికి గురిచేసింది'' అని జాన్ బ్రిట్టాస్ అన్నారు. ఎంపీ బ్రిట్టాస్ మాట్లాడుతూ, ''ఉపరాష్ట్రపతి కూడా అయిన ధన్కర్ను కలవాల్సిందిగా రాజ్యసభ సెక్రెటేరియట్ మొదట నాకు నోటీసు పంపింది.
గత వారం ధన్కర్ను కలిసి, ఈ విషయం గురించి మౌఖికంగా ''బ్రీఫ్'' చేసాను. ఆ తరువాత రాతపూర్వక వివరణ ఇవ్వవలసిందిగా అడిగారు'' అని తెలిపారు. ఈ చర్య ''దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగనిది'' అని బ్రిట్టాస్ అన్నారు. అటువంటి సమావేశం జరిగినట్టు ధ్రువీకరించడానికి, తిరస్కరిం చడానికి రాజ్యసభ వర్గాలు నిరాకరించాయి. ''అన్ని సమావేశాలకు అధికారులను పిలవరు'' అని రాజ్యసభ సెక్రెటేరియట్ అధికారి తెలిపారు.
బ్రిట్టాస్ దేశద్రోహానికి పాల్పడ్డారని కేరళ బీజేపీ ప్రధాన కార్యదర్శి పి.సుధీర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ధన్కర్ ఈ చర్య తీసుకున్నట్టు భావిస్తున్నారు. ''అధికార బీజేపీ రాజ్యసభ చైర్మెన్‌కు ఫిర్యాదు చేయడం. అధికార పక్షం నుంచి వచ్చిన ఫిర్యాదుపై చర్చించడానికి ఛైర్మన్ నన్ను అధికారికంగా సమావేశానికి పిలిచినందుకు నేను విస్తుపోయాను'' అని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 20న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించబడిన ''ప్రచారానికి సంబంధించిన ప్రమాదాలు'' అనే శీర్షికతో బ్రిట్టాస్ తన అభిప్రాయాన్ని రాశారు. కర్నాటక పర్యటనలో షా ''తన పార్టీ మాత్రమే కర్నాటకను సు రక్షితంగా ఉంచగలదని'' చెప్పినట్టు రాశారు. కర్నాటకలో కేరళ గురించి ''...మీ దగ్గర కేరళ ఉంది. దాని గురించి నేను పెద్దగా చెప్పదలచుకోలేదు'' అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వ్యాసం రాశారు. ''నేను (కథనంలో) హౌం మంత్రి చేసిన ఆరోపణలపై ఇప్పుడే స్పందించాను. అందులో తప్పేమీ లేదు. చాలా పేరున్న వార్తాపత్రిక ప్రచురించింది. ఇది వాక్ స్వాతంత్య్రం. భావప్రకటనా స్వేచ్ఛ. నా ప్రాథమిక హక్కు'' అని అన్నారు. ''నేను దీని గురించి చైర్మన్‌కి తగినంతగా వివరించాను. అయితే అధికార పార్టీ కార్యకర్త ఒకరు అలాంటి ఫిర్యాదును దాఖలు చేయడం, రాజ్యసభ సెక్రెటేరియట్, చైర్మెన్ దానిని గుర్తించడం పట్ల నేను ఆశ్చర్యపోయాను. ఈ మొత్తం ప్రక్రియ నన్ను పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేసింది'' అని బ్రిట్టాస్ అన్నారు.
''కేరళను లక్ష్యంగా చేసుకుని షా చేసే ప్రకటనలు ఆయన నిరాశకు నిదర్శనం. అలాగే దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతితో ఈ దేశాన్ని గతానికి రివైండ్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నానికి నిదర్శనం. కేరళ ఆయన పార్టీ డిజైన్లను అవిశ్రాంతంగా ప్రతిఘటించింది'' అని రాశారు.
'యాధృచ్ఛికంగా, కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని అమిత్ షా గతంలో బెదిరించారు. భౌగోళిక ప్రాముఖ్యత కంటే, కేరళ ఆలోచనే బీజేపీని కలవరపెడుతోంది. వాస్తవానికి, షా ప్రకటనలు కొంతవరకు ప్రాణాంతకమైనవి, ఎందుకంటే కేరళ మతపరమైన స్నేహానికి అభేద్యమైన కోట. అందువల్ల తన పరిధికి మించినదని షా గ్రహించారు. అంటే కేరళను కించపరచడం ద్వారా రాజకీయంగా ఏమీ కోల్పోలేదని కూడా షా భావిస్తారు'' అని రాశారు. ''కేరళను చిన్నచూపు చూడడానికి షా కారణాన్ని వేరే చోట ఓట్లు లాగే ప్రయత్నంగా చూడాలి. దేశంలో భాగమైన రాష్ట్రం గురించి కేంద్ర హౌంమంత్రి ఇంత పరుషంగా మాట్లాడటం దుర్మార్గం'' అని రాశారు.