Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బీజేపీని ఒంటరి చేసి, ఓడించడమే దేశం ముందు, ప్రజల ముందు ఉన్న ప్రధాన కర్తవ్యమని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు లౌకిక , ప్రతిపక్ష పార్టీలతో సీపీఐ(ఎం) కలసి పనిచేస్తుందని, సహకరిస్తుందని పార్టీ కేంద్రకమిటీ పునరుద్ఘాటించింది. అలాగే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేసింది. అదానీ అవినీతి బాగోతంపై జేపీసీని వెంటనే ఏర్పాటు చేయాలని కోరింది. ఈ నెల 27-29 తేదీల్లో ఇక్కడ జరిగిన సీపీఐ(ఎ కేంద్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆదివారం నాడు ఒక ప్రకటన రూపంలో పార్టీ విడుదలజేసింది. ఆ ప్రకటన ఇలా పేర్కొంది.
ఆర్థిక పరిస్థితి గడ్డుగానే ఉంది
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశ జిడిపి వృద్ధి అత్యంత వేగంగా జరుగుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. మోడీ ప్రభుత్వం దీనినే మరింత అతిశయంగా ప్రచారం చేస్తూ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.1శాతం వుండగా, 2020లో అది -5.8గా వుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం కావాలనే విస్మరిస్తోంది. సాధారణ, కోవిడ్ ముందు సంవత్సరమైన 2019లో సమ్మిళిత వార్షిక వృద్ధిరేటును పరిగణనలోకి తీసుకుంటే, భారతదేశ వార్షిక వృద్ధి రేటు 3.8శాతం మాత్రమే. 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో భారత్ 350బిలియన్ల డాలర్లను తన ఆర్థిక వ్యవస్థకు జోడించింది. అదే సమయంలో అమెరికా 1390 డాలర్లను, చైనా 1274 డాలర్లను వాటి ఆర్థిక వ్యవస్థకు జోడించాయి. పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలతో పోలిస్తే భారత్ తలసరి ఆదాయం చాలా తక్కువ. తలసరి ఆదాయం దృష్ట్యా చూసినట్లైతే, అమెరికా మన కన్నా 31రెట్లు , చైనా ఐదు రెట్లు, బ్రెజిల్ 4 రెట్లు, బ్రిటన్ 18రెట్లు, జర్మనీ 20రెట్లు అధికంగా కలిగి వున్నాయి. ఆ రకంగా చూసినట్లైతే, ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద జిడిపితో వున్నప్పటికీ మన తలసరి ఆదాయం అంగోలా, ఐవరీ కోస్ట్ల కన్నా తక్కువగా వుంది.తయారీ రంగం, పారిశ్రామిక రంగాలు క్షీణించకపోయినా, స్తంభించిపోయాయి. 8 కోట్ల మౌలిక సదుపాయాల రంగాల వృద్ధి ఫిబ్రవరిలో 7.2శాతం వుండగా, మార్చిలో సగానికి సగం అంటే 3.6శాతానికి పడిపోయింది. దీని పర్యవసానంగా నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలో పెరిగి 8శాతం వద్ద కొనసాగుతోంది. ఉద్యోగుల సంఖ్య దాదాపు స్తంభించిపోయింది. కరోనా మహమ్మారి తలెత్తడానికి ముందు 2020 జనవరిలో ఉద్యోగుల సంఖ్య 41.1కోట్లుగా వుండగా, 2023 జనవరిలో 40.9కోట్లుగా వుంది. గత ఎనిమిదేళ్ళుగా గ్రామీణ వేతనాలు పూర్తిగా స్తంభించిపోయాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఇజిఎస్) అత్యంత అవసరంగా వున్న సమయంలో, బడ్జెట్ కేటాయింపుల్లో మూడో వంతు కోత విధించారు. చెల్లించాల్సిన వేతనాలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పన పథకాలపై మరింతగా ఖర్చు పెట్టాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కూడా పెరుగుతుంది.
అదానీ అవినీతిపై జేపీసీని వెంటనే వేయాలి
అదానీ గ్రూపుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టడానికి ప్రభుత్వం మొండిగా తిరస్కరించడం, దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు ఇవ్వడానికి మే 2తో పూర్తవుతున్న గడువును, మరో ఆరు మాసాల పాటు పొడిగించాలని కోరుతూ సెబి పిటిషన్ వేసింది. ఈ అవినీతి ఆరోపణలపై నిజాలు నిగ్గు తేలాలంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
రెజ్లర్ల నిరసన
లైంగిక వేధింపుల ఆరోపణలకు వ్యతిరేకంగా న్యాయం చేయాలని కోరుతూ పతక విజేతలైన రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు కేంద్ర కమిటీ పూర్తి మద్దతు ఇస్తున్నది. తొలుత విముఖత చూపినప్పటికీ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్య్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది. డబ్ల్య్యూఎఫ్ఐ అధ్యక్షుడిని ఆ పదవి నుండి తొలగించాల్సిందేనని కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆ ఎఫ్ఐఆర్పై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టి, కరినంగా శిక్షించాలని కోరింది.
జమ్మూ కాశ్మీర్
2018 నుండి జమ్మూ కాశ్మీర్‌కు ఎన్నికైన అసెంబ్లీ లేదు. ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం మూడు షరతులను విధించింది. పునర్విభజనా క్రమాన్ని పూర్తి చేయడం, ఓటర్ల జాబితాను ఆధునీకరించడం, ఎన్నికల నిర్వహణకు శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయడం - ఈ మూడు షరతులు నెరవేరాలని పేర్కొంది. ఆ మూడు నెరవేరాయని ప్రభుత్వమే అంగీకరించింది. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణకు తిరస్కరించడం చూస్తుంటే, అక్కడ తనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలననే నమ్మకం పాలక పక్షానికి లేదని ఇది స్పష్టంగా రుజవుచేస్తోంది. ప్రజల మౌలిక రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్య హక్కులను ఇది దారుణంగా ఉల్లంఘించడమే. జమ్మూ కాశ్మీర్లో వెంటనే ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తోంది.
అటవీ సంరక్షణ చట్ట సవరణ
వృధా అయిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితుల మధ్య ప్రవేశపెట్టిన అటవీ సంరక్షణ చట్టం సవరణ ఓ వినాశకరమైన చర్య. వాతావరణ మార్పుల సవాళ్ళను మరింత అధ్వానంగా మార్చే చర్య. ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రభావం దేశంలో వివిధ ప్రాంతాలపై చూపుతోంది. తమ ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు అయినా చేపట్టడానికి ముందు అనుమతినివ్వడానికి లేదా నిలుపుచేయడానికి గ్రామ సభలకు గల రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులను ఈ సవరణలు తొలగిస్తున్నాయి. అలాగే అటవీ భూముల మళ్లింపునకు సంబంధించిన నిబంధనల సరళీకరణ, అడవుల ప్రైవేటీకరణను ప్రోత్సహించడం, అటవీ పాలనపై రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలను ఇవ్వడం వంటి చర్యలు ఆదివాసీల, సాంప్రదాయ అటవీవాసుల హక్కులపై మరింతగా దాడిచేయడమే, ప్రస్తుతమున్న అటవీ హక్కుల చట్టాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే. ఈ సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.
త్రిపుర
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పాలక బీజేపీ చేపట్టిన హింస కొనసాగడాన్ని కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. భౌతిక దాడులతో పాటూ పెద్ద ఎత్తున బలవంతపు వసూళ్ళకు పాల్పడడం కూడా జరుగుతోంది. డిమాండ్ చేసిన డబ్బు గనక చెల్లించకపోతే వారి ఆస్తులను, దుకాణాలను, ఆటో రిక్షాలు వంటి జీవనోపాధులను ధ్వంసం చేస్తామంటూ ప్రజలను బెదిరిస్తున్నారు. ఇది లక్షలాదిమంది ప్రజల జీవితాలను, వారి జీవనోపాధులను దెబ్బతీస్తోంది. తక్షణమే ఈ హింసను ఆపాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. రాజ్యాంగ నిబంధనలకు గట్టిగా కట్టుబడాలని కోరుతోంది. దోషులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది.
ప్రతిపక్షాల ఎత్తుగడలు
బిజెపిని ఏకాకిని చేసి, ఓడించాలన్నదే దేశం ముందు, ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యమని కేంద్ర కమిటీ పునరుద్ఘాటించింది.ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, సీపీఐ(ఎం), ఇతర లౌకిక ప్రతిపక్ష పార్టీలకు సహకరిస్తూ, వాటితో కలిసి పనిచేస్తుంది. మత విభజన రాజకీయాలకు మరింత పదును పెట్టడం, ద్వేషం, హింస వంటి వాటితో కూడిన విషపూరిత ప్రచారం, ఆదానీ కుంభకోణం, కేంద్ర సంస్థల దుర్వినియోగం, కులాలవారీ జనగణనకు తిరస్కరించడం, సమాఖ్యవాదంపై దాడి వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను ప్రముఖంగా ఎత్తిచూపడానికి లౌకిక ప్రతిపక్ష పార్టీల మధ్య గరిష్ట ఐక్యత వుండాలి. అలాగే ప్రజల జీవనోపాధులపై దాడులకు వ్యతిరేకంగా నిరసన చర్యలు చేపట్టేందుకు అన్ని లౌకిక ప్రతిపక్ష శక్తుల మధ్య ఐక్యత అవసరం, ప్రతి రాష్ట్రంలోనూ అక్కడ వున్న నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా ఎన్నికల్లో బిజెపి వ్యతిరేక ఓట్లను గరిష్టంగా సమీకరించేందుకు లౌకిక ప్రతిపక్షం ఎత్తుగడలను రూపొందించేందుకు కసరత్తు చేయాలి. రాష్ట్రం నుండి రాష్ట్రానికి పరిస్థితులు మారుతుండడంతో ఈ ఏర్పాట్లన్నీ కచ్చితంగా రాష్ట్ర అవసరాలు, పరిస్థితులకు తగ్గట్లుగా వుండాలి.
కేంద్ర కమిటీ పిలుపు
దేశం, ప్రజల జీవనోపాధులపై తక్షణం ప్రభావం చూపే అంశాలపై దేశవ్యాప్తంగా సమైక్య కార్యాచరణ చేపట్టేందుకు వామపక్షాలను సంప్రదించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. ప్రజా కార్యాచరణ, వ్యక్తీకరణల ద్వారా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను లేవనెత్తడానికి ఇతర లౌకిక ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరపాలి.
నిర్మాణపరమైన అంశం
వ్యవసాయ కార్మికోద్యమ నేత విక్రమ సింగ్‌ను కేంద్ర కమిటీ సభ్యులుగా తీసుకోవడం ద్వారా కేంద్ర కమిటీలో ఖాళీని భర్తీ చేయాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది.