Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంపెనీల ప్రయోజనాల కోసం రాష్ట్రాల వెంపర్లాట
- రోజుకు 8 పని గంటల కోసం పెరుగుతున్న డిమాండ్
రోజుకు 12 పని గంటలను అనుమతిస్తూ దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు చట్టసభలు ఫ్యాక్టరీల చట్టానికి సవరణలు ఆమోదించాయి.ఆ తర్వాత తమిళనాడు వెనక్కి తగ్గినా..అంతర్జాతీయ ఐఫోన్ సంస్థ ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు కర్నాటక ముందుకు వెళుతోంది. ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తిని పెంచుకునేందుకు వీలుగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కార్మిక చట్టాలలో ఈ మార్పుల పై కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి.
న్యూఢిల్లీ : చైనాతో పోటీ పడి ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోనే మేటిగా నిలవాలంటే పని గంటలు పెంచకతప్పదని చెబుతున్నాయి. అంతేకాదు...వారానికి 48 పని గంటల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని నమ్మబలుకుతున్నాయి. వారానికి నాలుగైదు రోజులు పని చేస్తే చాలునని కార్మికులు, ఉద్యోగులను మభ్యపెడుతున్నాయి.వాస్తవానికి ఈ నూతన చట్టాలు కార్మికులను చక్రబంధంలో ఇరికిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం విమర్శలకు తలొగ్గి చట్ట సవరణను వెనక్కి తీసుకుంది. కర్ణాటక మాత్రం తాను ఫాక్స్‌కాన్ సంస్థ ప్రయోజనాల కోసమే చట్ట సవరణ తెచ్చానని నిస్సిగ్గుగా చెబుతోంది. చైనా, వియత్నాం, తైవాన్‌తో పోటీ పడాలంటే ఈ మార్పులు తప్పవని అంటోంది. రోజుకు ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ రెండు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు సరిగా అంచనా వేయడం లేదు. బ్రిటన్‌లో 18వ శతాబ్దపు పారిశ్రామిక విప్లవం నూతన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను సృష్టించింది. దీని ప్రకారం కార్మికులు కట్టుబానిసలుగా యంత్రాలపై రోజుకు 12 నుండి 16 గంటలు పని చేయాల్సి వచ్చేది. చిన్నారులు కూడా పనికి వెళ్లక తప్పని పరిస్థితి. ఈ ఆటవిక చట్టాన్ని నిరసిస్తూ సోషలిస్టు నాయకుడు రాబర్ట్ ఒవెన్ 1810లో తొలిసారిగా గళం విప్పారు. రోజుకు 10 పని గంటలు మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు. 'ఎనిమిది గంటల పని...ఎనిమిది గంటల వినోదం...ఎనిమిది గంటల విశ్రాంతి' అనే నినాదంతో కార్మిక సంఘాలు ముందుకు సాగాయి. 1869లో బ్రిటన్‌లో బెక్టన్ ఈస్ట్ లండన్ గ్యాస్ కంపెనీ కార్మికులు సుదీర్ఘ కాలం సమ్మె చేసి 18 పని గంటలకు బదులుగా షిప్టుకు 8 పని గంటలు మాత్రమే ఉండేలా యాజమాన్యాన్ని ఒప్పించడంలో విజయం సాధించారు. 1917 అక్టోబర్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ మొదటిసారిగా 8 పని గంటల విధానాన్ని అమలు చేసింది. భారత్‌లో బ్రిటన్ పాలకులు కూడా ఇదే డిమాండ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1942లో వైస్రారు కౌన్సిల్లో సామాజిక సంస్కరణవాది బీఆర్ అంబేద్కర్ 8 పని గంటల డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. చివరికి అది చట్టరూపం దాల్చింది. 1948వ సంవత్సరపు పరిశ్రమల చట్టంలోని సెక్షన్ 54 తొమ్మిది పని గంటలను చట్టబద్ధం చేసింది. మధ్యలో కార్మికుల విశ్రాంతి కోసం అరగంట సమయం కేటాయించారు. చట్టంలోని సెక్షన్ 51 వారానికి 48 పని గంటలను నిర్దేశించింది. అయితే ఈ చట్టం పలు సందర్భాలలో ఉల్లంఘనలకు దారితీస్తోంది. నిర్దేశిత సమయం కంటే పని గంటలు ఎక్కువగానే ఉంటున్నాయి. దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు నీరుకారిపోతున్నాయి. కార్మిక చట్టాలకు రక్షణ లేకుండా పోతోంది. ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు అధిక ఉత్పత్తి, సుదీర్ఘ పనిగంటలు, తప్పనిసరి ఓవర్‌టైమ్ వంటి డిమాండ్లను ముందుకు తెస్తున్నాయి. మన దేశంలో కార్మికులు గౌరవప్రదమైన జీవనం సాగించాలంటే వారికి రోజుకు 8 పని గంటలు మాత్రమే కల్పించాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి, వినోదం కూడా అందించాలి. ప్రభుత్వాలు ఆ దిశగా చట్టాలు రూపొందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఫాక్స్‌కాన్ కథ ఇది...
చైనాకు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ చరిత్ర ఘనమైనదేమీ కాదు. 2010లో షెంఝెన్ నగరంలోని ఫాక్స్‌కాన్ సిటీ పారిశ్రామిక పార్కులో ఆటవికమైన పని పరిస్థితులు, అరకొర వేతనాల కారణంగా కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు మానసిక అనారోగ్యానికి గురయ్యారు. కిక్కిరిసిన డార్మెటరీలలో ఉండే కార్మికులు ఊపిరాడక స్పృహ కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. చివరికి ప్రజాగ్రహంతో కంపెనీ దిగివచ్చింది. వేతనాలను కొంతమేర పెంచింది. అయితే కోవిడ్ మహమ్మారి సమయంలో ఐఫోన్ 14 ప్రో ఉత్పత్తిని పెంచే పేరుతో కంపెనీ మరోసారి అరాచక పరిస్థితులను ముందుకు తెచ్చింది. కార్మికులకు వేధింపులు పెరిగాయి. హెనన్, హుబై, సిచువన్ రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన కంపెనీ యూనిట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కార్మికులకు ఎలాంటి విశ్రాంతి, విరామం ఇవ్వకుండా లక్ష్యాలు నిర్దేశించారు. కనీసం మరుగుదొడ్డికి వెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు. ఉత్పత్తిని పెంచడమే ప్రధాన లక్ష్యంగా మారింది. కోవిడ్ సమయంలో కార్మికులు కంపెనీ క్యాంపస్‌లలోనే ఉండాల్సి వచ్చింది. పలువురు కార్మికులు వేధింపులు తాళలేక కాపలా వారి కన్నుగప్పి, ఫెన్సింగ్ దూకి పారిపోయారు. 'ఐఫోన్లు నరకంలో తయారయ్యాయి' అని ఓ కార్మికుడు చెప్పిన మాట అక్కడి దుర్భర పరిస్థితిని కళ్లకు కట్టింది.