Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి, అధిక ధరలు, నిరుద్యోగంతో ఏటికి ఎదురీత
- రైతులు, కూలీల పరిస్థితీ అంతంత మాత్రమే
- కుల-మత రాజకీయాలనే నమ్ముకున్న బీజేపీ
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. కుల, మత సమీకరణల ఆధారంగా ఏ పార్టీ విజయం సాధిస్తుందనే విషయంపై ప్రధాన మీడియా అంచనాలు వేస్తోంది. రాష్ట్రంలో ప్రధానంగా లింగాయతులు, ఒక్కలిగుల ఓటు బ్యాంకుల పైనే ప్రధాన పార్టీలన్నీ ఆధారపడుతున్నాయి. ఈ రెండూ అక్కడ ప్రధాన కులాలు. ఇప్పటివరకూ బీజేపీకి అండగా ఉంటున్న లింగాయతులు ఈసారి ఏం చేస్తారన్న దానిపై చర్చ నడుస్తోంది. ఎందుకంటే కొందరు లింగాయత్ నేతలు ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. మరోవైపు ఒక్కలిగులు జనతాదళ్ (ఎస్)కు మద్దతుగా ఉంటున్నారు. వీరి ఓట్లను చీల్చి లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కుల సమీకరణలకు తోడు కర్నాటకలో ప్రాంతీయ వైవిధ్యాలు ఎక్కువగా కన్పిస్తుంటాయి.
బెంగళూరు:కర్నాటక ఎన్నికల ఫలితాలపై కులం, మతం, భాష, ప్రాంతం...ఇవే కాకుండా ఎన్నికలను ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయి.
వాటిని పరిశీలించే ముందు 2013, 2018 ఎన్నికలలో ప్రధాన పార్టీలు పొందిన ఓట్ల శాతాన్ని పరిశీలిద్దాం. 2018లో కాంగ్రెస్ 38 శాతం ఓట్లు పొందగా బీజేపీ 36.2 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే సీట్ల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్‌కు 78 స్థానాలు మాత్రమే లభించగా బీజేపీకి 104 సీట్లు వచ్చాయి. 37 సీట్లు సాధించిన జేడీ (ఎస్) కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్, జేడీ (ఎస్)కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు ఫిరాయించడంతో బీఎస్ బొమ్మై నేతృత్వంలో కాషాయ ప్రభుత్వం ఏర్పడింది.
అంతకుముందు 2013లో జరిగిన ఎన్నికలు కూడా ఆసక్తికరంగానే సాగాయి. బీజేపీలో కీలక నేతగా ఉన్న బీఎస్ యడియూరప్ప పార్టీకి గుడ్‌బై చెప్పారు. కర్ణాటక జనతా పక్ష (కేజెపీ) పేరిట వేరు కుంపటి పెట్టారు. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్ చీలిపోయింది. ఆ పార్టీకి కేవలం 19.9 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. 36.6 శాతం ఓట్లతో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. అయితే 2014లో యడియూరప్ప తిరిగి సొంత పార్టీ గూటికి చేరారు. 2013 వరకూ బలమైన లింగాయత్ ఓటర్లు బీజేపీ పక్షానే ఉన్నారు. లింగాయత్ కులానికి చెందిన యడియూరప్ప రాజీనామాతో 2013లో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
మరోవైపు కర్నాటకలో ఒక్కలిగులు మాత్రం స్థిరమైన వైఖరితోనే ఉంటున్నారు. వారి బలమంతా పాత మైసూరు ప్రాంతానికే పరిమితమైంది. వారు మొదటి నుండీ జేడీ (ఎస్)కే మద్దతు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ గెలుపును కోరుకుంటున్న కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఒక్కలిగ ఓటర్లలో చీలిక వస్తుందని, అది బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నాయి. 2018 ఎన్నికలలో కోస్తా ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాలు బీజేపీకి మంచి ఆధిక్యాన్ని తెచ్చిపెట్టాయి. ఆ ప్రాంతంలోని మొత్తం 19 స్థానాలలోనూ 16 స్థానాలు బీజేపీకే లభించాయి. అక్కడ ఆ పార్టీకి 52 శాతం ఓట్లు వచ్చాయి. మధ్య-మల్నాడ్ ప్రాంతంలోనూ బీజేపీ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. ఆ ప్రాంతంలో బీజేపీ 43 శాతం ఓట్లు, 23 సీట్లు (మొత్తం సీట్లు 28) తెచ్చుకుంది. అన్ని కులాలు, మతాల వారూ నివసించే ప్రాంతాలలో బలపడిన హిందూత్వ నినాదం కాషాయ పార్టీకి లబ్ది చేకూర్చింది. అలా కొన్ని ప్రాంతాలలో అధిక ఓట్లు సాధించినా, లింగాయతుల మద్దతు లభించినా, మోడీ మేజిక్ పనిచేసినా... బీజేపీ 2018 ఎన్నికలలో పరాజయం చవిచూసింది. ఫిరాయింపులతో అధికారంలోకి రావడం వేరే విషయం. దీనిని బట్టి అర్థమయ్యే విషయమేమంటే ప్రజల మద్దతుతో కాకుండా ఫిరాయింపులను ప్రోత్సహించిన కారణంగానే బీజేపీ అధికారంలోకి రాగలిగింది.
అవినీతి ఊబిలో...
కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. గత సంవత్సరం ఆగస్ట్‌లో 13 వేల ప్రయివేటు పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తూ బొమ్మై ప్రభుత్వం లంచాలను సంస్థాగతం చేసిందని విమర్శించాయి. ఏ పనికైనా ప్రభుత్వ శాఖలు ముడుపులు డిమాండ్ చేయడం మొదలెట్టాయని, సాక్షాత్తూ ఆ శాఖ మంత్రే లంచాలు పుచ్చుకుంటున్నారని ప్రధాని దృష్టికి తెచ్చాయి. రాష్ట్రంలో పాతిక వేల కోట్ల విలువైన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని జనవరిలో కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం ఆరోపించింది. బిల్లులను ఆమోదించాలంటే 40 శాతం ముడుపులు అడుగుతున్నారని వాపోయింది. కాంట్రాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడిని బీజేపీ ఎమ్మెల్యే జీహెచ్. తిప్పారెడ్డి లంచం అడుగుతున్న ఆడియో టేపును కూడా వారు విడుదల చేశారు. ముడుపులు అడిగారన్న కారణంతో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడడంతో 2022 ఏప్రిల్‌లో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. రాబోయే ఎన్నికలలో బీజేపీ నాయకత్వం ఆయనకు టికెట్ నిరాకరించింది. కానీ ప్రధాని మోడీ ఆయనకు ఫోన్ చేసి పార్టీకి ఈశ్వరప్ప చేసిన సేవను మెచ్చుకున్నారు.
గత నెలలో బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్ను లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు (కేఎస్డీఎల్) ముడి పదార్థాలు సరఫరా చేసే కంపెనీ నుంచి లంచం అడిగినందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడి నుంచి పోలీసులు రూ. 8.1 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం నేపథ్యంలో కేఎస్డీఎల్ ఛైర్మన్ పదవికి విరూపాక్షప్ప రాజీనామా చేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నప్పటికీ బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం బొమ్మై నాయకత్వం పైనే విశ్వాసం ఉంచింది. 'సుపరిపాలన' అందిస్తున్నారంటూ బొమ్మైని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందిస్తున్నారు కూడా.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కూడా...
ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ఎడినా అనే కన్నడ మీడియా సంస్థ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. అవినీతితో పాటు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యలు కూడా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. సర్వేలో పాల్గొన్న 68 శాతం మంది ఓటర్లు అవినీతిని ప్రస్తావించగా 47 శాతం మంది అధిక ధరలు, 34 శాతం మంది నిరుద్యోగం సమస్యలను ప్రస్తావించారు. పేదలకు మాత్రం అధిక ధరలే ప్రధాన సమస్యగా కన్పిస్తోంది. ధరాభారంతో ఇబ్బందులు పడుతున్నామని 51 శాతం మంది తెలిపారు. నిత్యావసరాలు, వంటగ్యాస్ ధరలు కూడా ఓటర్లపై ప్రభావం చూపబోతున్నాయి. ఈ ధరలు కుటుంబ బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. మరోవైపు గత రెండు మూడేండ్లుగా వేతనాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా సరిగా పనిచేయడం లేదు. ఉచితంగా ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఇచ్చే పథకాన్ని ఎత్తేశారు. వంట నూనెలు, వంట గ్యాస్ ధరలు ఆకాశంతో పోటీ పడి పెరుగుతున్నాయి. ఉజ్వల సబ్సిడీని తొలగించిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన కూడా ఆశాజనకంగా లేదు. మంచి వేతనాలు లభించే ఉద్యోగాలు లభించకపోవ డంతో నిరుద్యోగులు తక్కువ వేతనం వచ్చే ఉద్యోగాలతోనే సరిపెట్టుకుంటున్నారు. వాటికి కూడా భద్రత లేకుండా పోతోంది. పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే వ్యవసాయ కూలి రేట్లు కూడా తక్కువగానే ఉంటున్నాయి. మరోవైపు ఐటి రంగంలో అంతర్జాతీయంగా నెలకొన్న మాంద్యం ప్రభావం బెంగళూరు పైన కూడా పడింది. వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.
కర్నాటకలో రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీలను ప్రభుత్వం రద్దు చేస్తోంది. ప్రభుత్వ సేకరణ విధానం లోపభూయిష్టంగా మారింది. పంటలకు నీటి లభ్యత కూడా తక్కువగానే ఉంది. బొమ్మై ప్రభుత్వం వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు సేకరించే ప్రక్రియను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులు అభద్రతాభావానికి లోనవుతున్నారు.
కులం, మతం వంటి అంశాల కంటే పైన తెలిపిన సమస్యలే ఓటర్లపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. బీజేపీ మాత్రం మత రాజకీయాల పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అందులో భాగంగానే హిజాబ్, లవ్ జిహాద్, ఉమ్మడి పౌరస్మృతి వంటి విచ్ఛిన్నకర అంశాలను ముందుకు తెస్తోంది. అయితే ఇవేవీ ఓటర్లపై ప్రభావం చూపబోవన్నది సుస్పష్టం. మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఈసారి గట్టి పోటీ ఎదురవుతోందనడంలో సందేహం లేదు.