Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొచ్చి : 'ది కేరళ స్టోరీ' పేరిట రాబోతున్న సినిమా ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని సంఘ్ పరివార్ ప్రచారం మాత్రమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శిం చారు. లవ్ జిహాద్ అంశాన్ని లేవనెత్తడం ద్వారా తమ రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించేందుకు ఈ ప్రచారాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. లవ్ జిహాద్ అనేది హిందూత్వ సంస్థలు ప్రవచించిన కుట్ర సిద్ధాంతమని చెప్పారు. 'హిందూ మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు ముస్లింలు కుట్ర పన్నారంటూ ప్రచారం చేశారు. దీనిని న్యాయస్థానాలు, విచారణ సంస్థలు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చాయి' అని విజయన్ వివరించారు.
'ది కేరళ స్టోరీ' చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. కేరళకు చెందిన 32 వేల మంది మహిళలను ఇస్లాంలోకి మార్చారని, ఆ తర్వాత వారిని ఇస్లామిక్ స్టేట్ అనే ఉగ్రవాద సంస్థ నియమించుకుందని ఆ చిత్రంలో చూపారు. ఈ చిత్రం ఐదవ తేదీన విడుదల అవుతుంది. కాగా కేరళపై విద్వేష భావాన్ని కలిగించేందుకే ఈ చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్మించారని విజయన్ తన ఫేస్బుక్ పోస్ట్‌లో విమర్శించారు.
'కేరళలో రాజకీయ ప్రయోజనాన్ని పొందేందుకు సంఫ్‌ు పరివార్ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఇలాంటి ప్రచార చిత్రాలను, ముస్లింలను సమాజం నుండి వేరు చేసే వాటి ప్రయత్నాలను మనం చూడాల్సి ఉంది' అని విజయన్ అన్నారు. అయితే ఇలాంటి ఎత్తుగడలు కేరళలో ఫలించబోవని, అందుకే ఆ సంస్థలు బూటకపు కథనాల ఆధారంగా తీసిన సినిమాల ద్వారా విచ్ఛిన్నకర రాజకీయాలను వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో దేశంలో విభజనను, మతోన్మాదాన్ని సృష్టించేందుకు సినిమాలను ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది దేశంలో మతోన్మాదాన్ని పెంచేందుకు, అబద్ధాలను వ్యాపింపచేసేందుకు, ప్రజలను విభజించేందుకు ఉద్దేశించింది కాదని విజయన్ తన ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు.