Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు
- ర్యాలీలతో హోరెత్తిన ప్రపంచ దేశాలు
- దేశంలోనూ భారీ ప్రదర్శనలు
ఇంక్విలాబ్...జిందాబాద్..విశ్వవ్యాప్త కార్మిక రణన్నిన్నాదం మార్మోగింది. హక్కుల్ని హరిస్తే ఖబడ్దార్ అంటూ బిగిసిన పిడికిళ్లు దోపిడీపై యుద్ధాన్ని ప్రకటించాయి. అణచివేతలతో ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తే అగ్ని కణాలై భగ్గుమంటామని హెచ్చరించాయి. శ్రమైకశక్తితోనే సామ్యవాదం, సమసమాజం సాధ్యమని గొంతెత్తి నినదించాయి. చరిత్రలో కొన్ని క్షణాలు వెనకడుగు వేసినంతనే 'ఓడినట్టు' కాదని ఘీంకరించాయి. ప్రపంచ శ్రామికుడా...భవిష్యత్ నీదే అంటూ 'మేడే' స్ఫూర్తిని మహౌజ్వలింపచేశాయి.
ప్రపంచదేశాల్లో కొన్ని చోట్ల మేడే 'ఉత్సవాలు'.. మరికొన్ని చోట్ల పెట్టుబడిదారీ వ్యవస్థపై పెల్లుబికిన కార్మిక నిరసన జ్వాలలు.. రెండింటికీ మనసంతా నిండిన ఎర్రజెండా 'మేడే'నే స్ఫూర్తికేంద్రం!!
సియోల్/న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా మేడే ఉత్సవాలను అత్యంత ఆనందోత్సాహాల మధ్య కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా ఆయా దేశాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అవలంబిస్తున్న వినాశకర ఆర్థిక విధానాలు తమపై చూపుతున్న దుష్ప్రభావాన్ని ఈ సందర్భంగా కార్మికులు ఎత్తిచూపారు. ఆసియా లోని పలు ప్రాంతాలలో అధిక వేతనాలు, మెరుగైన పని పరిస్థితు లను డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. దక్షిణ కొరియాలో దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీలలో లక్ష మందికి పైగా కార్మికులు భాగ స్వాములయ్యారు. పాటలు పాడుతూ, వీధులలో ప్రదర్శనగా సాగారు. పరిశ్రమలలో జరిగే ప్రమాదాలకు బాధ్యులను చేస్తూ యాజమాన్యాలకు విధిస్తున్న శిక్షలను తగ్గించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయన్న కారణంతో కొన్ని కార్మిక సంఘాలపై నిషేధం విధించడాన్ని తప్పుపట్టారు. తమ వేతనాలు తప్ప అన్నింటి ధరలు పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పని గంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.ఉత్తర కొరియాలో కార్మికులు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఇండొనేషియాలోని ప్రధాన నగరాలలోనూ ప్రదర్శనలు జరిగాయి. నూతన ఉద్యోగ కల్పన చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కార్మికులు ప్లకార్డులు చేబూని నిరసన వ్యక్తం చేశారు. జపాన్‌లో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో కార్మికులు ఆనందో త్సాహాల మధ్య మేడే ఉత్సవాన్ని జరుపుకున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సైనిక విస్తరణను, పన్ను పెంపుదలను వ్యతిరేకించారు. ఫ్రాన్స్‌లో పదవీ విరమణ వయసును 62 నుండి 64 సంవత్సరాలకు పెంచాలన్న దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ యోచనను నిరసిస్తూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిపాయి. పెన్షన్ సంస్కరణలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఆ సంఘాలు మండిపడ్డాయి. మహిళలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ జర్మనీలో ర్యాలీలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలలో వేలాది మంది పాల్గొన్నారు. తైవాన్‌లో అమలు చేస్తున్న కార్మిక విధానాలను నిరసిస్తూ రాజధాని తైపై వీధుల్లో వేలాది మంది కదం తొక్కారు.
దేశవ్యాప్తంగా...
దేశవ్యాప్తంగా ఎర్ర జెండా రెపరెపలాడింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కార్మికులు కదంతొక్కారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే)ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సంబురాలు జరిగాయి. ఎర్రజెండాలను చేబూని నినాదాలు ఇచ్చుకుంటూ కార్మికులు ప్రదర్శనలు చేపట్టారు. ఎక్కడిక్కడే జెండాలు ఆవిష్కరించారు. మేడే అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలపై గర్జించారు. జాతాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, మోటర్ సైకిల్, ఆటో ర్యాలీలు జరిగాయి. రాష్ట్రాల్లో తమ తమ సాంస్కృతిక కళారూపాలు ప్రదర్శించారు. ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, గోవాతో పాటు ఈశాన్య అస్సాం, మణిపూర్, సిక్కిం, మేఘాలయా, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో మేడే వేడుకలు భారీగా జరిగాయి.
కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ముకాశ్మీర్, పుదుచ్చేరి, అండమాన్ నికోబర్ దీవుల్లో కూడా మేడే కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. కార్మికులకు రైతు, విద్యార్థి, యువజన, మహిళ, సమాజిక సంఘాలతో పాటు ఇతర ప్రజా సంఘాలు మద్దతుగా ర్యాలీలు చేపట్టాయి. త్రిపురలోని అగర్తలలో జరిగిన ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ పాల్గొన్నారు. తమిళనాడులో సీపీఐ(ఎం) కార్యాలయం వద్ద సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణన్ జెండా ఆవిష్కరించారు. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ర్యాలీలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్ తరిగామి పాల్గొన్నారు.