Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీనియర్ సిటిజన్లకు అందజేస్తున్న రాయితీలు రద్దు చేయడంతో 2022-23లో రైల్వేలకు రూ. 2,242 కోట్ల అదనపు ఆదాయం లభించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ ఈ వివరాలు తెలియజేసింది. కోవిడ్ మహమ్మారిని సాకుగా చూపి భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్ల రాయితీలకు మంగళం పాడిన విషయం తెలిసిందే. కోవిడ్ ఉధృతి తగ్గి జనజీవనం సాధారణ స్థితికి చేరినప్పటికీ ఆ రాయితీలను మాత్రం పునరుద్ధరించలేదు. 2022 ఏప్రిల్ 1, 2023 మార్చి 31 మధ్యకాలంలో ఎనిమిది కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారని రైల్వే శాఖ తెలిపింది. ఈ కాలంలో వారి నుండి రూ. 5.062 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇందులో రాయితీల రద్దు ద్వారా చేకూరిన రూ. 2,242 కోట్లు కూడా ఉన్నాయని వివరించింది. 2020 మార్చి 20, 2022 మార్చి 31 మధ్య 7.31 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల కు రైల్వేలు రాయితీలు ఇవ్వలేదు. సీనియర్లకు ఇస్తున్న రాయితీలను పున రుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవలే తోసిపుచ్చింది.