Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా, కార్మిక అనుకూల విధానాల కోసం పోరాటం
- సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు కె.హేమలత
న్యూఢిల్లీ : మేడే సందర్భంగా హక్కుల కోసం, ప్రజా, కార్మిక అనుకూల విధానాల కోసం పోరాటాలు ఉధృతం చేసేందుకు ప్రతినబూనాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు కె.హేమలత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా సోమవారం నాడిక్కడ సీఐటీయూ కేంద్ర కార్యాలయం (బీటీఆర్ భవన్)లో ఆ సంఘం అఖిల భారత అధ్యక్షురాలు కె. హేమలత సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పి.రామమూర్తి భవన్లో అఖిల భారత రోడ్డు ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ సీఐటీయూ తరపున దేశంలోని కార్మికులకు, అంతర్జాతీయ కార్మిక వర్గానికి, శ్రమ జీవులకు శుభాకాంక్షులు తెలిపారు. మేడే అంటే ఎనిమిది గంటల పని విధానానికి ఒక దిక్సూచీ అని, కార్మిక వర్గం సుదీర్ఘ పోరాటం, త్యాగాలతో ఎనిమిది గంటల పని విధానం వచ్చిందని అన్నారు. 1886 కంటే ముందే ఎనిమిది గంటల పని విధానం ఉండేదనీ, కానీ దేశంతో పాటు ప్రపంచంలో ఇప్పుడు కార్మిక వర్గం దాడికి గురవుతుందని తెలిపారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ పని గంటలు పెంచుతూ 2020లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను ఆమోదించిందనీ, దీనికి అనుగుణంగా రాష్ట్రాలు చట్టాలు చేస్తున్నాయని విమర్శించారు. పని గంటలు మాత్రమే కాకుండా, సంఘం పెట్టుకొనే హక్కు వంటి అన్ని కార్మిక హక్కులు దాడికి గురవుతున్నాయని తెలిపారు. తమ లాభాలను రక్షించుకునేందుకు, సంక్షోభాల నుండి బయటపడేందుకు కార్మిక హక్కులపై దాడి తప్ప మరొక మార్గం లేదని పెట్టుబడిదారీ వర్గం భావిస్తోందని అన్నారు. యూరప్, లాటిన్ అమెరికా, యూఎస్ఏ, పారిస్, ఫ్రాన్స్, ఆఫ్రికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటాలు చేస్తోందని పేర్కొన్నారు. మన దేశంలో కూడా కార్మికులు పోరాట బాట పట్టారని, కార్మికులే కాకుండా రైతులు కూడా ఉద్యమిస్తున్నారని తెలిపారు. హక్కుల పరిరక్షణ, ఎనిమిది గంటల పని వంటి డిమాండ్లపై పోరాటాలు బలోపేతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ పోరాటాలు కేవలం డిమాండ్ల సాధన కోసమే కాదని, పెట్టుబడిదారీ వ్యవస్థ విధానాల మార్పు కోసమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు ఉపాధ్యక్షులు జెఎస్ మజుందర్, అమితవ్ గుహ, ఆర్.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.