Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యను సరుకుగా మార్చే సాధనంగా నూతన విధానం
- ప్రత్యామ్నాయ ప్రజానుకూల విద్యా విధానానికి రాష్ట్రాలు మద్దతివ్వాలి : నేషనల్ ఎడ్యుకేషన్ అసెంబ్లీలో కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్. బిందు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి ప్రత్యామ్నాయ ప్రజానుకూల విద్యా విధానం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని నేషనల్ ఎడ్యుకేషన్ అసెంబ్లీ పిలుపునిచ్చింది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ విద్య, ఆధునిక, సాంస్కృతికంగా విభిన్నమైన, సమానమైన, స్వావలంబన కలిగిన ఆర్థిక వ్యవస్థను, సమాజంలో ప్రజల సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నదని పేర్కొంది. ఎన్ఈపీ పేద, దళిత, గిరిజన, మైనార్టీ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు విద్యాను దూరం చేస్తోందని, దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. 'సేవ్ ఎడ్యుకేషన్, సేవ్ నేషన్' నినాదంతో హరికిషన్ సింగ్ సూర్జిత్ (హెచ్‌కేఎస్) భవన్లో ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (ఏఐపీఎస్ఎన్), భారత్ జ్ఞాన్ విజ్ఞాన సమితి (బీజీవీఎస్)లు సంయుక్తంగా నేషనల్ ఎడ్యుకేషన్ అసెంబ్లీ నిర్వహించాయి. ఎస్ఎఫ్ఐ, ఎస్టీఎఫ్ఐ, ఐద్వా, ఏఐడీఎస్ఓ, ఎఐఎఫ్యూసీటీఓ, డీటీఎఫ్, ఎఫ్ఈడీసీయూటీఏ, జేఎన్‌యూటీఏ, ఏఐఎఫ్ఎడబ్ల్యుహెచ్, ఎఐఎస్ఈసీ, ఎఐఎఫ్ఆర్టీఈ, జేఏసీ, జెఎఫ్ఎంఈ, ఆర్టీఈ ఫోరం తదితర సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈ సమావేశం ఎన్ఈపీ, దాని అవాంఛనీయ లక్షణాలను తిప్పికొట్టడానికి, ప్రగతిశీల, ప్రజా అనుకూల ప్రభుత్వ విద్యా వ్యవస్థ కోసం పని చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, మద్దతును కోరింది.
విద్యను సరుకుగా మార్చే వాహనంగా ఎన్ఈపి:
ఆర్. బిందు
ఈ అసెంబ్లీని ప్రారంభిస్తూ విద్యను వర్గీకరించడానికి, సరుకుగా మార్చడానికి ఒక వాహనంగా ఎన్ఈపీ పని చేస్తుందని కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్.బిందు విమర్శించారు. కార్పొరేట్ శక్తులతో, మతోన్మాద శక్తులు చేతులు కలుపుతున్న ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్ఈపీని చూడాలని అన్నారు. దేశంలోని సమాఖ్య సూత్రాలను నిరాకరిస్తూ కేంద్రీకరణను విధించాలని ఎన్ఈపీ స్పష్టం చేస్తున్నదన్నారు. ఎన్ఈపీని పార్లమెంటరీ పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. ''ఒక విద్యా విధానం గత విధానం డాక్యుమెంట్ల ప్రభావాలు, మెరిట్‌లు, లోపాలను పరిశీలించాలి. కానీ ఎన్ఈపీ గత విధానం డాక్యుమెంట్ల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు''అని బిందు విమర్శించారు. రాష్ట్రం, దాని ప్రజల నిర్దిష్ట అవసరాలకు సరిపోయే ఉన్నత విద్యా నమూనాతో ఎన్ఈపీని నిరోధించడం కేరళలో చేస్తున్నామని బిందు చెప్పారు. యుజిసి మాజీ చైర్మన్, ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. సమానత్వం, అందరికీ విద్యాపై నూతన విద్యా వ్యవస్థలో ఎటువంటి ప్రతిపాదనలు లేవని అన్నారు. ఢిల్లీ యూనివర్శిటీ మాజీ డీన్, ప్రొఫెసర్ అనిత రాంపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యను దూరం చేసే విధానమే ఎన్ఈపి అని పేర్కొన్నారు. ఎన్యుఈపిఎ మాజీ వైస్ చాన్సలర్ ఎన్వి వర్గేశ్ మాట్లాడుతూ ఉన్నత విద్యా వ్యవస్థను మార్కెట్‌గా, విద్యను సరుకుగా ఎన్ఈపీ చూస్తోందని విమర్శించారు. కార్పొరేట్లకు అనుసంధానం చేసే వ్యవస్థను ఇప్పుడు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్ తరిగామి మాట్లాడుతూ దేశ ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విద్యా విధానం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్ఎన్ ప్రధాన కార్యదర్శులు సత్యజిత్ రాత్, ఆశా మిశ్రా, ఏఐపీఎస్ఎన్ కోశాధికారి ఎస్ఆర్ ఆజాద్, శాస్త్రవేత్త డి. రఘునందన్, బీజీవీఎస్ ప్రధాన కార్యదర్శి కాశ్‌నాథ్ ఛటర్జీ ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, జేఎన్‌యూటీఏ అవినాష్ మిశ్రా, జేఎఫ్ఎంఈ చైర్ పర్సన్ నందితా నారాయన్, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్, సహాయ కార్యదర్శులు డినిత్ డెంటా, నితీష్ నారాయణ్ మాట్లాడారు. వివిధ సాంస్కృతిక బృందాలు నృత్య ప్రదర్శన చేయగా, మరికొన్ని బృందాలు గీతాలాపన చేశాయి. నూతన విద్యా విధానంపై షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలను ప్రదర్శించారు.