Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాకీల అమానుషంపై రెజ్లర్ల తీవ్ర ఆవేదన
- ఆందోళన ప్రాంగణం వద్ద అర్థరాత్రి ఢిల్లీ పోలీసుల దాడి
- మద్యం తాగి అసభ్య ప్రవర్తన
- కన్నీటిపర్యంతమైన మహిళా మల్లయోధులు
- సిగ్గుచేటు : దాడికి పలువురి ఖండన
- మద్దతు ఇచ్చేందుకు వచ్చిన వారిని ఎక్కడిక్కడే అరెస్టు
దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేందుకు అంతర్జాతీయ వేదికలపై పోరాడిన మహిళ రెజ్లర్లపై అర్థరాత్రి సమయంలో ఢిల్లీ పోలీసులు దాడికి దిగారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ప్రాంగణం వద్ద అర్ధరాత్రి భయానక వాతావరణం సృష్టించారు. ఉన్నతస్థాయి పోలీసు అధికారులు కూడా వారిని దుర్భాషలాడారు. పోలీసుల అసభ్య ప్రవర్తనతో రెజ్లర్లు కన్నీటి పర్యంతమయ్యారు. మమ్మల్ని చంపాలనుకుంటే.. చంపేయండి.. కానీ మాకు న్యాయం చేయండంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. న్యాయం కావాలని నిరసన వ్యక్తం చేస్తుంటే.. అవమానాలకు గురిచేస్తున్నారనీ మల్లయోధులు వాపోయారు. పోలీసుల దాడిలో రెజ్లర్ దుష్యంత్ తల పగిలింది. మరో రెజ్లర్ రాకేష్ యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో వీరిద్దరిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.
న్యూఢిల్లీ : ఢిల్లీలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడటంతో జంతర్ మంతర్‌లో నడిరోడ్డుపైనే ఆందోళన కొనసాగిస్తున్న రెజ్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి కూడా వారు అక్కడే బస చేస్తున్నారు. బుధవారం భారీ వర్షం పడటంతో రెజ్లర్లు బస చేసే ప్రాంతంలో నీరు చేరింది. అలాగే వారు బస చేసే సామాగ్రి పూర్తిగా తడిచిపోయింది. దీంతో రెజ్లర్లు బస చేసేందుకు మడత మంచాలు (ఫోల్డబుల్ మంచాలు) తెచ్చుకుంటుండగా.. పోలీసులు గందరగోళ వాతావరణం సృష్టించారు. ఆ సమయంలోనే ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి రావడంతో మరింత రెచ్చిపోయిన పోలీసులు దాడికి తెగబడ్డారు. ముందుగానే వందలాది పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు రెచ్చిపోయి ఆందోళనకారులను, మీడియా ప్రతినిధులను ఈడ్చిపారేశారు. మూకుమ్మడిగా పోలీసులు దాడికి యత్నించారు. ఉన్నతాధికారులతో సహా పోలీసులు అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో అసలేం జరుగుతుందో కూడా మల్లయోధులకు అర్థం కాలేదు. ఈ విషయం తెలుసుకొని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మాలివల్ జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తాను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌నని, బాధిత మహిళాలకు మద్దతు ఇవ్వడం తన బాధ్యతని స్వాతి మాలివల్ అన్నారు. ఆమె పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. స్వాతి మాలివల్, హర్యానా కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిలను పోలీసులు అరెస్టు చేశారు. దీపేందర్ హుడాను వసంత్ విహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే మహిళ మీడియా ప్రతినిధులను, రైతు సంఘాల నేతలను అరెస్టు చేశారు.
మరోవైపు జంతర్ మంతర్ వద్ద గురువారం భారీ స్థాయిల్లో పోలీసులను దించారు. బారికేడ్లనూ పెంచి ఆందోళన వద్ద అనేక ఆంక్షలను పెట్టారు. రెజ్లర్లకు మద్దతుగా జంతర్ మంతర్‌కు చేరుకున్న వారిని ఎక్కడిక్కడే అరెస్టు చేశారు. రెజ్లర్ గీతా ఫోగట్‌ను కర్నాల్ బైపాస్‌పై ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో ఢిల్లీలోకి ప్రవేశించకుండా తనను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సింఘూ సరిహద్దు వద్ద రైతులను అరెస్టు చేసి బవానా సెక్టార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెజ్లర్లకు బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ మద్దతు తెలిపారు.
ఢిల్లీ పోలీసులు మద్యం తాగి అసభ్య ప్రవర్తన
ఢిల్లీ పోలీసులు పీకలదాకా మద్యం తాగి తమను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని మహిళా రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇలాంటి రోజులు చూడ్డానికేనా.. మేం పతకాలు సాధించింది?' అని రెజ్లర్ వినేష్ ఫోగట్ విరుచుకుపడ్డారు. ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేతలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. 'నన్ను మగ పోలీసులు దుర్భాషలాడి నెట్టేశారు. మీరు మమ్మల్ని చంపాలనుకుంటే, చంపండి. మేం తిండి కూడా తినలేదు. మహిళలను దుర్భాషలాడే హక్కు ప్రతి పురుషుడికీ ఉందా? ఈ పోలీసులు తుపాకులు పట్టుకున్నారు. వారు మమ్మల్ని చంపగలరు'' అని వినేష్ ఫోగట్ అన్నారు. ''వర్షం కారణంగా పరుపులు తడిసిపోయాయి. దీంతో మేం నిద్రించడానికి మడత మంచాలు తీసుకువస్తున్నాం, దీనికి పోలీసులు అనుమతించలేదు. మద్యం మత్తులో ఉన్న పోలీసు ధర్మేంద్ర రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను దుర్భాషలాడాడు. మాతో గొడవకు దిగాడు'' అని మాజీ రెజ్లర్ రాజ్వీర్ తెలిపారు.
సిగ్గుచేటు : దాడికి పలువురి ఖండన
అంతర్జాతీయ వేదికలపై దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన రెజ్లర్లపై రాత్రిపూట ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరును యావత్తు దేశం ఖండించింది. రాజకీయ పార్టీలు, నేతలతో పాటు దేశంలోని వివిధ రంగాలకు చెందిన వారు ఖండించారు. జాతీయ క్రీడాకారిణుల పట్ల వ్యవహరించిన తీరు సిగ్గు చేటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల దాడిని ఖండించారు. మన దేశ క్రీడాకారులతో ఇటువంటి ప్రవర్తన సిగ్గు చేటు అని తెలిపారు. 'ఆడ పిల్లలను కాపాడండి' అని ఇస్తున్న నినాదం నయవంచన అని ఆరోపించారు. మన దేశ ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడటంలో బీజేపీ ఏమాత్రం వెనుకాడటం లేదన్నారు. ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు మద్దతుగా మార్చ్ చేపట్టిన ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న యువతుల పట్ల ఢిల్లీ పోలీసులు అన్యాయంగా ప్రవర్తించిన తీరు బాధాకరం, కలవరం కలిగిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవర్ పేర్కొన్నారు. ''మన ఆడ బిడ్డల గౌరవ, మర్యాదలను ఈ విధంగా మంటగలపడం సిగ్గు చేటు'' అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెజ్లర్ల పిటిషన్‌పై ముగిసిన సుప్రీం విచారణ
మహిళా రెజ్లర్ల ఫిర్యాదులపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు గురువారం విచారణను ముగించింది. తదుపరి ఉపశమనం కోసం ఫిర్యాదుదారులు జ్యూరిడిక్షనల్ మేజిస్ట్రేట్, లేదా ఢిల్లీ హైకోర్టును సంప్రదించవచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. విచారణను పర్యవేక్షించాలని ఫిర్యాదుదారుల తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. కానీ అందుకు ధర్మాసనం నిరాకరించింది. 'అధికార మేజిస్ట్రేట్ కోర్టు లేదా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడానికి మేం మీకు స్వేచ్ఛ ఇచ్చాం' అని పేర్కొంది.
మా పతకాలు, అవార్డులు వెనక్కి ఇస్తాం : రెజ్లర్లు
ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రెజ్లర్లు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పోలీసుల నీచమైన ప్రవర్తనతో బాధపడి నిరసనకు దిగిన రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా గురువారం తమ పతకాలు, అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. న్యాయం కావాలని నిరసన వ్యక్తం చేస్తుంటే, తమను అవమానాలకు గురిచేస్తున్నారనీ, ఈ గౌరవం తమకెందుకని రెజ్లర్లు ప్రశ్నించారు. 'మా పట్ల ఇలాగే వ్యవహరిస్తే, మేం అన్ని పతకాలు, అవార్డులను తిరిగి ఇస్తాం' అని ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా అన్నారు. బ్రిజ్ భూషణ్‌ను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మహిళలను దుర్భాషలాడే హక్కు పురుషులకు ఉందా? అని ఖేల్ రత్న అవార్డు గ్రహీత వినేష్ ప్రశ్నించారు. ''తాము పతకాలన్నింటినీ తిరిగి ఇస్తాం, మా ప్రాణాలను కూడా ఇస్తాం. అయితే కనీసం మాకు న్యాయం చేయండి'' అంటూ వేడుకున్నారు.
బేటీ బచావో ఇదేనా?: సీపీఐ(ఎం)
రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల చర్యలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. నిరసనకారులను వేధించే బదులు నేరుగా హౌంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు బీజేపీ, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని హితవు పలికింది. బేటీ బచావో అంటే ఇదేనా? అని ప్రశ్నించింది. దేశంలోని రెజ్లర్లు, రైతులు, జర్నలిస్టులు, యువతను అరెస్టు చేయడం దేశంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతుందని రైతు నేత రాకేష్ టికాయిత్ అన్నారు. అరెస్టు చేసిన వారిని ఢిల్లీ పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెజ్లర్లపై క్రూరమైన దాడి వారి నిరసనను విధ్వంసం చేసే కుట్రకు పరాకాష్ట అని డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఎఎ రహీం అన్నారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ, ఆలస్యం చేయకుండా బ్రిజ్ భూషణ్‌ను కటకటాల వెనక్కి నెట్టాలని డిమాండ్ చేశారు.