Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో 1.6 కోట్ల కుటుంబాలు తగ్గుముఖం
- అంతకు ముందు ఏడాది 30 లక్షల కుటుంబాలు ఉపాధికి దూరం
- తగ్గుతున్న సగటు ఉపాధి రోజులు
- ఒక్కో కుటుంబానికి 47.84 రోజుల మాత్రమే పని
- కోవిడ్ ముందు కంటే ఇప్పుడే తక్కువ
- వంద రోజుల ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య ఐదేళ్లలో కనిష్టం
- ఎన్ఎంఎంఎస్, ఏబీఎస్పై కేంద్రం చర్చలు
- రిలయన్స్, స్వదేశ్ ఫౌండేషన్లు వంటి వాటికి ఆహ్వానం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో పని కోరుకునే కుటుంబాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఒక్కో కుటుంబానికి అందించే సగటు ఉపాధి రోజులు కూడా తగ్గుతున్నాయి. ఈ మేరకు కేంద్రగ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020-21లో 7.55 కోట్ల కుటుంబాలు ఉపాధి పొందగా, 2021-22లో 7.25 కోట్ల కుటుంబాలు ఉపాధి పొందాయి. 2022-23లో 6.19 కోట్ల కుటుంబాలు ఉపాధి పొందాయి. అంటే 2020-21తో పోలిస్తే, 2021-22లో 30 లక్షల కుటుంబాలు ఉపాధికి దూరం అయ్యాయి. 2021-22తో పోలిస్తే, 2022-23లో 1.6 కోట్ల కుటుంబాలకు ఉపాధికి దూరం అయ్యాయి.
కోవిడ్ ముందు కంటే ఇప్పుడే తక్కువ
ఎన్ఆర్ఈజీఎస్ ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల వేతన ఉపాధి హామీ ఇస్తుంది. కాని ఏడాదికి ఒక్కో కుటుంబానికి అందించిన సగటు ఉపాధి రోజులు 2020-21లో 51.52 రోజులు కాగా, 2021-22లో 50.07 రోజులకు తగ్గాయి. 2022-23లో అదికాస్తా 47.84 రోజులకు తగ్గాయని డేటా వెల్లడిస్తోంది. 2022-23లో ప్రతి కుటుంబానికి అందించిన ఉపాధి సగటు రోజులు కోవిడ్‌కు ముందు సమయంలో 2019-20లో నమోదైన 48.4 రోజుల సంఖ్య కంటే తక్కువగా ఉంది.
వంద రోజుల ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య ఐదేండ్లలో కనిష్టానికి...
ఎన్ఆర్ఈజీఎస్ కింద 100 రోజుల వేతనంతో ఉపాధిని పొందిన కుటుంబాలు సంఖ్య 2022-23లో కేవలం 36.01 లక్షలు మాత్రమే. ఇది గత ఐదేళ్లలో కనిష్టంగా ఉంది. 2021-22లో 59.14 లక్షలు, 2020-21లో 71.97 లక్షలు, 2019-20లో 40.60 లక్షలు, 2018-19లో 52.59 లక్షల కుటుంబాలు మాత్రమే వంద రోజుల వేతనంతో ఉపాధిని పొందారు.
నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎం ఎంఎస్) యాప్, ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఎబిప ిఎస్)తో తప్పనిసరి హాజరును ప్రవేశపెట్టడం, బడ్జెట్లో ఉపాధి హామీకి నిధులు కోత విధించడం వల్ల ఉపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య తగ్గడానికి కారణమని సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. 2023-24 బడ్జెట్లో గ్రామీణ ఉపాధి పథకానికి రూ. 29,400 కోట్ల తగ్గింపుపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ''ఈ పథకం గ్రామీణ ప్రజలలో పని చేయడానికి ఇష్టపడే అణగారిన వర్గాలకు 'పని చేసే హక్కు'ని అంది స్తుంది. ఆయా కుటుంబ సభ్యులకు ఆహారం ఇవ్వడానికి ఇతర మార్గాలు లేని నిరుద్యోగ వర్గానికి ఇది చివరి అస్త్రమని కమిటీ సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఉపాధి హామీ పథకం 2006-07లో దేశంలో అత్యంత వెనుక బడిన 200 గ్రామీణ జిల్లాల్లో ప్రారంభించారు. 2007-08లో అదనంగా మరో 130 జిల్లాలకు విస్తరించారు. 2008-09లో దేశం మొత్తం అమలు చేశారు.
ఎన్ఎంఎంఎస్, ఏబీపీఎస్పై కేంద్రం చర్చలు
ఉపాధి హామీలో ఇటీవలి ప్రవేశపెట్టిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) యాప్, ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఎబిపిఎస్)పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం, ఆ రెండు అంశాలపై చర్చలను ప్రారం భించింది. జనవరి 1 నుంచి హాజరు కోసం ఎన్ఎం ఎంఎస్ యాప్‌ను తప్పనిసరి చేయ డం, జనవరి 30 నుంచి వేతనాల కోసం ఎబిపిఎస్ను అమలు చేయడం వంటి రెండు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో కేంద్రగ్రామీణాభివృద్ధి కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్ అధ్యక్షతన ఈ చర్చలు జరిగాయి. చర్చలకు రిలయన్స్ ఫౌండేషన్, స్వదేశ్ ఫౌండేషన్, థన్ ఫౌండేషన్, స్వయం శిక్షన్ ప్రయోగ్, ట్రాన్స్ ఫార్మింగ్ రూరల్ ఇండియా ఫౌండేషన్, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (ఎంకె ఎస్ఎస్) సంస్థలను ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ సంయుక్త కార్యదర్శి అమిత్ కటారియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యుఐడిఎఐ, ఎన్ఐసి, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. బీహార్, గుజరాత్, హర్యానా, తమిళనాడు కమిషనర్లు కూడా హాజరయ్యరు. ఎంకెఎస్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడు నిఖిల్ డే, లిబ్టెక్ సహ వ్యవస్థాపకుడు రాజేంద్రన్ నారాయణన్, సోషల్ అకౌంటబిలిటీ ఫోరమ్ ఫర్ యాక్షన్ అండ్ రీసెర్చ్ (సఫర్)కి చెందిన రక్షిత స్వామి సమావేశానికి హాజరైన తమ అభిప్రారయాలు చెప్పారు. ఈ సమావేశానికి ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ లిఖితపూర్వక సమర్పణను పంపినట్లు తెలిసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్రం ''త్రిశూల్'' దాడికి పాల్పడిందని డ్రేజ్ ఆరోపించారు.
ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర :బి.వెంకట్
ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ విమర్శించారు. వలసను తగ్గించడం, వ్యవసాయంలో తగ్గిన ఉపాధిని పూడ్చడమే ఉపాధి హామీ లక్ష్యం. బడ్జెట్ కోతలు, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానాల వల్లే ఉపాధి హామీలో పని దినాలు, పని చేసే కుటుంబాల సంఖ్య తగ్గుతుంది. గత యుపిఎ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో 4 శాతం నిధులు కేటాయిస్తే, ప్రస్తుత మోడీ సర్కార్ కేవలం 1.37 శాతానికి తగ్గించింది. అలాగే ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఆన్లైన్ హాజరు వంటివి విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉపాధి హామీని నిర్వీర్యం చేయడంలో భాగమే ఈ చర్యలను తీసుకొచ్చింది. రెండు పూట హాజరు రద్దు చేయాలి. వంద రోజుల పని కల్పించాలి. రోజుకు వేతనం రూ.600 ఇవ్వాలి'' అని అన్నారు.