Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రానున్న రెండు రోజుల్లో జంతర్ మంతర్‌కు రైతులు, ఖాప్ పంచాయతీలు
- కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు చేస్తున్న ఆందోళన నేటికీ (శనివారం) రెండు వారాలు కావస్తుంది. న్యాయం కోసం రోడ్డెక్కిన రెజ్లర్లు శుక్రవారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. గత 13 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళన రోజు రోజుకు ఉద్యమంగా మారుతున్నది. రెజ్లర్లకు పౌర సమాజం మద్దతు పెరగడంతో ఉద్యమంలోకి అన్ని వర్గాలు చేరుతున్నాయి. హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఖాప్ పంచాయతీలు నుంచి వందలాది మంది రేపు (ఆదివారం) జంతర్ మంతర్‌కు చేరుకుంటారు. ఈ మేరకు ఖాప్ పంచాయతీలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి మహిళా రైతులు ఢిల్లీకి చేరుకుని మూడు రోజుల పాటు రెజ్లర్లకు మద్దతుగా ఆందోళనలో పాల్గొననున్నారు.ఢిల్లీకి సమీప రాష్ట్రాల నుంచి విద్యార్థులు, మహిళలు, రైతులు, యువత జంతర్ మంతర్‌కు చేరుకుంటున్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ నుంచి వచ్చిన అనేక రైతు సంఘాలు ''జై కిసాన్ జై జవాన్, కిసాన్ ఏక్తా జిందాబాద్'' అని నినాదాలు చేశాయి. మల్లయోధులకు న్యాయం జరిగే వరకు ఆందోళన ప్రాంగణాన్ని విడిచిపెట్టబోమని ప్రతిజ్ఞ చేశారు. శుక్రవారం రెజ్లర్లకు హర్యానా కాంగ్రెస్ నేత కుమారి సెల్జా, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అనిల్ చౌదరి, ఐద్వా నేతలు జగ్వతి సంఘ్వాన్, ఎస్.పుణ్యవతి, ఆశా శర్మ, ఎన్ఎఫ్ఐడబ్ల్యు నేత అనీరాజా, ఏఐటీయూసీ నేత అమర్జీత్ కౌర్, రైతు నేతలు మద్దతు తెలిపారు. రెజ్లర్లకు హర్యానాలోని ప్రతిపక్ష పార్టీలు, ఖాప్ పంచాయితీల మద్దతు లభించడంతో అధికార బీజేపీ, జేజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. రెజ్లర్లకు హర్యానా ముఖ్యమంత్రి, బిజెపి నేత మనోహర్ లాల్ ఖట్టర్ మద్దతు ఇవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తున్నాయి.
న్యాయం జరగకపోతే పతకాలు తిరిగి ఇస్తా : మహావీర్ ఫోగట్
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, న్యాయం జరగకపోతే తన పతకాలను తిరిగి ఇచ్చేస్తానని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, కోచ్ మహావీర్ సింగ్ ఫోగట్ ప్రకటించారు. మూడేండ్ల క్రితం ఆయన బీజేపీలో చేరటం గమనార్హం.
దేశ ప్రజలకు బజరంగ్ పునియా భావోద్వేగ పిలుపు
ఆందోళనలో తమ మద్దతు కోరుతూ స్టార్ ఇండియన్ రెజ్లర్ బజరంగ్ పునియా శుక్రవారం దేశ ప్రజలకు భావోద్వేగ పిలుపునిచ్చారు. తోటి రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్‌లతో కలిసి 'మేం మన దేశం గర్వపడేలా పోరాడాం. ఈ రోజు మేం మీ ఛాంపియన్ల భద్రత, గౌరవం కోసం పోరాడుతున్నాం. దయచేసి మాకు మద్దతు ఇవ్వండి' అన్నారు.