Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు సైనికులు మృతి
- మరొకరికి తీవ్రగాయాలు
జమ్ము: జమ్ముకాశ్మీర్‌లోని రాజౌరిలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరి సెక్టార్ కండి ఫారెస్ట్‌లో పీర్ పంజల్ వాలీలో శుక్రవారం ఉదయం తనిఖీలు జరుపుతున్న సైనిక బృందం లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. ఒక గుహలో దాక్కొని ఉన్న ఉగ్రవాదులను సైనిక బృందం గుర్తించినప్పుడు వారు ఈ దాడి చేశారు. ఉదయం 7:30 గంటలకు జరిగిన ఘటనలో అక్కడిక్కడే ఇద్దరు సైనికులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి వెంటనే ఉధంపూర్‌లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరిలో మగ్గురు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రవాదుల్లోనూ కొంతమంది మరణించారని సైనిక అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎ ఒక్క ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకోలేదు. కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే స్పష్టమైన సమాచారంతోనే సైన్యం ఈ గాలింపు చర్యలు ప్రారంభించింది.
దాడి చేసిన ఉగ్రవాదుల గురించి గాలింపు చర్యలు కొనసాగు తున్నాయని, ఈ ప్రాంతం అంతా రాళ్లు, కొండలు, వృక్ష సంపద ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలు కష్టంగా ఉన్నాయని సైనిక అధికారులు చెబుతున్నారు. ఈ దాడి ఘటనతో రాజౌరిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
రాజౌరీ జిల్లాలోనే సుమారు రెండు వారాల క్రితం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు మృతి చెందిన విషయం తెలిపిందే. ఏప్రిల్ 20న సైనిక వాహనంపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేయడంతో ఐదుగురు సైనికులు సజీవ దహనమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అంతకు ముందు జనవరి 1, రాజౌరీలోని థంగీ ప్రాంతంలోని ఒక గ్రామంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఏడుగురు పౌరులు మరణించారు. జి20 సమావేశాల్లో భాగంగా ఈ నెల 22న శ్రీనగర్‌లో టూరిజంపై వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడులు జరుగుతున్నాయని సైనిక అధికారులు భావిస్తున్నారు.