Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక వార్తా సంస్థల వెల్లడి
- అధికార ప్రకటన చేయని రాష్ట్ర ప్రభుత్వం
- ప్రస్తుతం పరిస్థితి అదుపులో వుందన్న అధికారులు
న్యూఢిల్లీ : గత రెండు రోజులుగా మణిపూర్‌లో చెలరేగుతున్న అల్లర్లు, హింసాత్మక ఘర్షణల కారణంగా 31మంది చనిపోయారని ఆస్పత్రి రికార్డులను ఉటంకిస్తూ ఉక్రుల్ టైమ్స్ పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న అశాంతి, ఘర్షణల వల్ల మరణించిన వారి సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. అయితే స్థానిక వార్తా సంస్థలు మాత్రం ప్రత్యక్ష సాక్షుల కథనాలు, బాధిత కుటుం బాలు పేర్కొన్న వివరాలు, ఆస్పత్రి రికార్డుల ఆధారం గా మృతుల సంఖ్యను పేర్కొంటున్నాయి. గురు వారం నాటికి ఇంఫాల్‌లోని రిమ్స్ శవాగారానికి వచ్చి న మృతుల సంఖ్య 18గా వుండగా, జవహర్లాల్ నెహ్రూ మెడికల్ సైన్స్‌స్‌కు వచ్చిన మృతదేహాల సంఖ్య 13గా వుందని ఉర్కుల్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. అయితే మృతులను గుర్తించారా లేదా అన్న వివరం తెలియరాలేదు. కుకి గిరిజనులు, మీటె కమ్యూనిటీ మధ్య తలెత్తిన జాతుల హింస, ఘర్షణల కారణంగా మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే వుండవచ్చని ఆ కథనం పేర్కొంది.
అంతకుముందు ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబం చెప్పిన వివరాలను బట్టి మృతుల సంఖ్య 13గా ది వైర్ తన కథనంలో పేర్కొంది. కాగా, ఇంఫాల్‌కి చెందిన సాంగై ఎక్స్‌ప్రెస్ మరో 11మంది చనిపోయారని తెలిపింది. 4వ తేది ఉదయం నుండి కొంత ప్రశాంతంగా వుందని పలువురు తెలిపారు. చురాచంద్పూర్కి చెందిన ఢిల్లీలో చదువుకుంటున్న విద్యార్ధి తవ్నా వాల్టె మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో, జిల్లాలో కొన్ని చోట్ల పోలీసులు కవాతు చేశారని, కానీ 3గంటల ప్రాంతంలో ఒక్కసారిగా సమీప గ్రామంలో రెండు కమ్యూనిటీల మధ్య కాల్పులు జరిగిన శబ్దం వినిపించిందని తన కుటుంబం తెలిపినట్లు చెప్పారు. అదే పట్టణానికి చెందిన మునాలిన్ టాన్సింగ్ మాట్లాడుతూ, అనేకమంది గిరిజనులు లోయలో చిక్కుకు పోయారని, రోడ్డు మార్గంలో కొండ ప్రాంతానికి వెళ్ళేందుకు వారు భయపడుతున్నారని, అల్లరి మూకలు తమని చుట్టుముడతాయని వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. 4వ తేది మధ్యాహ్నం కూడా తాను తుపాకీ కాల్పులు విన్నట్లు సైకుల్ పట్టణ వాసి తెలిపారు.
మణిపూర్‌లో మెజారిటీ కమ్యూనిటీ అయిన మీటెలకు ఎస్టి హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు గిరిజన కమ్యూనిటీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 3వ తేదీన హింస చెలరేగింది. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారని, గిరిజనేతరులు ఎక్కువగా వుండే ఇంఫాల్ వెస్ట్‌తో సహా 8జిల్లాల్లో కర్ఫ్యూ విధించారని ది వైర్ పేర్కొంది. కాల్పులతో చెలరేగుతున్న మంటలు, తుపాకీ కాల్పులు, రాళ్ళు విసురుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసాధారణ ప్రశాంతత
మణిపూర్‌లో శుక్రవారం అసాధారణ రీతిలో ప్రశాంతత నెలకొంది. కాగా భారీ బందోబస్తు నేపథ్యంలో రెండు కమ్యూనిటీల మధ్య గత రాత్రి నుండి ఎలాంటి హింస చెలరేగినట్లు వార్తలందలేదు. అయితే వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, కొండ ప్రాంతాల్లోని తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెఇపారు. అన్ని పక్షాల వారూ సమన్వ యంతో తీసుకున్న చర్యల ఫలితంగా ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందని రక్షణ శాఖ పిఆర్ఓ ఒక ప్రకటనలో పేర్కొంది.
అస్సాంలోని రెండు విమానాశ్రయాల నుండి ఐఎఎఫ్ విమానాలు రెండు చక్కర్లు కొడుతునే వున్నాయి. ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌కి చెందిన 55 కాలమ్స్ బలగాలను మోహరించారు. నాగాలాండ్ నుండి మరింతమంది రప్పిస్తున్నారు. ఇంఫాల్ నగరంలో రెండు షాపింగ్ మాల్స్‌ను ధ్వంసం చేసి, తగలబెట్టారు. గురువారం అల్లరి మూక జరిపిన దాడిలో గిరిజన ఎంఎల్ఎ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.