Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 నుంచి 18 వరకు దేశవ్యాప్త నిరసనలకు ఎస్కేఎం పిలుపు
- మహిళా సంఘాలు సంతకాలు సేకరణ
- రెజ్లర్ల నిరసనపై బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్
న్యూఢిల్లీ : బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలనీ, న్యాయం చేయాలని రోడ్డెక్కిన రెజ్లర్లు శనివారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. గత 14 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళన రోజు రోజుకూ ఉఉధృతమవుతున్నది. రెజ్లర్లు, పోలీసుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ గురించి హౌం మంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసుల నుంచి వివరణ కోరింది. దానిపై ఢిల్లీ పోలీసులు హౌం మంత్రిత్వ శాఖకు వివరించారు. మరోవైపు మైనర్ సహా ఐదుగురు రెజ్లర్ల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు.
రెజ్లర్ల నిరసనపై బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ స్పందించారు. 'మొదట వారు ఈ దేశ పౌరులు. అవసరమైన సహాయం చేయాలి' అన్నారు. బాలీవుడ్ నటీ నటులు పూజా భట్, సోనూసూద్, గౌహర్ ఖాన్ స్వర భాస్కర్ తరువాత నటుడు విద్యుత్ జమ్వాల్ రెజ్లర్ల నిరసన గురించి మాట్లాడారు.
రెజ్లర్లకు హర్యానా హౌం మంత్రి మద్దతు
ఆందోళన చేస్తున్న మల్లయోధులకు హర్యానా హోం, ఆరోగ్య మంత్రి శాఖ అనిల్ విజ్ తన మద్దతు ను ప్రకటించారు. 'ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు అత్యున్నత స్థాయిలో చర్చనీయాంశమైంది. నేను క్రీడా మంత్రిగా కూడా పనిచేశాను. కాబట్టి, ఆందో ళన చేస్తున్న రెజ్లర్లకు నా సానుభూతి, మద్దతు ఉంది. నేను మధ్యవర్తిత్వం వహించి ప్రభుత్వంతో మాట్లాడా లని వారు కోరుకుంటే, నేను అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను'' అని అనిల్ విజ్ అన్నారు.
'ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు?'
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం దాల్చడాన్ని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రశ్నించారు. ''ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు బ్రిజ్ భూషణ్ చాలా ముఖ్యం కనుక ఆయనను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించమని భావిస్తున్నారు. మరి మీ నినాదం 'బేటీ బచావో' ఏమైంది. ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు?' అని ఆయన ప్రశ్నించారు.
దేశవ్యాప్త ఆందోళనలకు ఎస్కేఎం పిలుపు
మహిళా రెజ్లర్లు ఆందోళనకు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలకు ఎస్కేఎం పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఎస్కేఎం ఒక ప్రకటన విడుదల చేసింది. మోడీ ప్రభుత్వం జనవరిలో క్రీడాకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని పేర్కొంది. ఈ నెల 7 (నేడు) పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు, వందలాది మంది రైతులతో మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆందోళనను సందర్శించి, మల్లయోధులకు పూర్తి మద్దతునిస్తారని తెలిపింది. మే 11 నుంచి 18 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర రాజధానులు, జిల్లా ప్రధాన కార్యాలయం, తాలూకా ప్రధాన కార్యాలయంలో ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపింది. బహిరంగ సభలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఆయనకు మద్దతుగా ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేస్తామని పేర్కొంది.
మహిళ సంఘాలు సంతకాలు సేకరణ
బ్రిజ్ భూషణ్‌ను తక్షణమే అరెస్టు చేయాలంటూ జాతీయ మహిళా సంఘాలు ఉమ్మడి నిరసనలు, సంతకాల ప్రచారం నిర్వహించాయి. ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, పీఓడబ్ల్యూ, పీఎంఎస్, ఐజేఎం కోఆర్డినేషన్, ఏఐఎంఎస్ఎస్, ఏఐఏఎంఎస్ తదితర జాతీయ మహిళా సంఘాలు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉమ్మడి నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. గ్రామాలు, బస్తీల్లో మహిళలు సమావేశాలు నిర్వహించి బీజేపీ మహిళా వ్యతిరేకతను బయటపెడతామని తెలిపాయి. లక్షల సంతకాలను సేకరించి జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రధానికి పంపనున్నట్టు పేర్కొన్నాయి.