Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీపై ప్రతిపక్షాల మండిపాటు
న్యూఢిల్లీ : కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు సైనికులు మరణించిన ఉదంతం పైన, మణిపూర్ హింసలో సుమారు యాభై మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలపైన ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కర్నాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ప్రధాని 30 ట్వీట్లు చేశారు. వీటిలో ఎక్కువ భాగం కాంగ్రెస్, జెడీ(ఎస్)పై విమర్శలు చేస్తూ సాగినవే. అయితే జమ్మూకాశ్మీర్, మణిపూర్ ఘటనలపై మాత్రం ఆయన పెదవి విప్పలేదు. తమకు అధికారం అప్పగిస్తే బజరంగ్‌దళ్‌పై చర్యలు తీసుకుంటామంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటనను పదేపదే ప్రస్తావిస్తున్నారు. తన ఎన్నికల ప్రచార సభలలో 'జై బజరంగ్ బలి' అని నినాదాలు చేస్తూ మరోసారి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బజరంగ్‌దళ్‌కు, హనుమంతుడికి లంకె పెట్టి ఓట్లు దండుకోవాలని మోడీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడానికి అక్కడి బీజేపీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ తెలిపింది. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని ప్రధాని మోడీ చెబుతుంటారని, అయితే కేంద్రంలోనూ, మణిపూర్‌లోనూ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మత హింస జరిగిందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చెప్పారు. మణిపూర్ ఘటనలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ఆందోళన వ్యక్తం చేశారు.