Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణిపూర్ వ్యాప్తంగా సెక్యూరిటీ కట్టుదిట్టం
- భారీ ఎత్తున మోహరించిన భద్రతా బలగాలు
నవతెలంగాణ-ఇంపాల్ : బీజేపీ పాలిత రాష్ట్రం మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక అల్లర్లలో 54 మంది మృతి చెందారు. ఈ సమాచారాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్యపై శుక్రవారం వరకూ అధికారికంగా ఎలాంటి సమాచారమూ అందకపోవడంతో వివిధ వార్త సంస్థల్లో వచ్చిన కథనాలు, బాధితులు, ఆస్పత్రుల రికార్డుల మీదే ఆధారపడాల్సి వచ్చింది. మృతుల సంఖ్యపై ఈ గందరగోళం నేపథ్యంలో అధికారిక సమాచారం వెల్లడైంది. అయితే, ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నదని ఒక అంచనా. ఇటు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు. ఆర్మీ, పారామిలిటరీ, రిజర్వ్ పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. శుక్రవారం కూడా సాయుధ గుంపు మణిపూర్‌లో హింసాత్మక ఘటనలకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 355ను కేంద్రం ప్రయోగించింది. దీంతో రాష్ట్ర భద్రత బాధ్యతను కేంద్రం తీసుకున్నది.
చనిపోయినవారిలో 16 మృతదేహాలు చురాచాంద్‌పూర్ జిల్లా ఆస్పత్రి, 15 మృతదేహాలను ఇంఫాల్ తూర్పు జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో, 23 శవాలను ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో భద్రపరిచారు. కాగా, ఇంఫాల్‌లో ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్‌తో సచివాలయంలో సమావేశమనంతరం వస్తున్న క్రమంలో నిరసనకారుల దాడికి గురైన బీజేపీ ఎమ్మెల్యే వుంగ్జాగిన్ వాల్టే ఢిల్లీకి పారిపోయినట్టు తెలిసింది. హింసను అణచివేయడానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అశుతోశ్ సిన్హాను రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషనల్ కమాండర్‌గా నియమించింది. కాగా, అల్లర్లతో ప్రభావితమైన ప్రాంతాల నుంచి సుమారు 13 వేల మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో గత మూడు రోజులుగా తీవ్ర హింసాత్మక అల్లర్లతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన విషయం తెలసిందే. అయితే, ఈ అలర్లను కట్టడి చేయడంలో రాష్ట్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైందని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు, రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడ్డారు.