Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెజ్లర్లకు రైతు నేతల మద్దతు
- సుప్రీం మాజీ న్యాయమూర్తితో ఉన్నత స్థాయి విచారణ జరపాలి : హన్నన్ మొల్లా
- టిక్రీ సరిహద్దు వద్ద రైతులను అడ్డుకున్న పోలీసులు
- బారికేడ్లను నెట్టుకొని జంతర్ మంతర్‌కు చేరుకున్న మహిళా రైతులు
నవతెలంగాణ ..న్యూఢిల్లీ బ్యూరో
లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను 15 రోజుల్లోగా అరెస్టు చేయాలి. లేకపోతే తాము దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని రైతు నేతలు హెచ్చరించారు. మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు సంయుక్త కిసాన్ మార్చ్(ఎస్కేఎం) ఆధ్వర్యంలో రైతు సంఘాలు మద్దతు పలికాయి. ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించిన భారీ పోలీసు బలగాలను దాటుకుని ఎస్కేఎం నేతలు రాకేశ్ తికాయత్, దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, జోగేంద్ర సింగ్ ఉగ్రహాన్, అరబ్ సింగ్ అహ్లావత్ తదితర నేతలు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లను కలిశారు.
పంజాబ్, హర్యానా, ఉత్తర ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వేలాది మంది రైతులు, మహిళా రైతులతో కలిసి రైతు నేతలు మహిళా రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించారు. హర్యానాలోని వివిధ 'ఖాప్‌ల' ప్రతినిధులు కూడా మహిళా రెజ్లర్లకు తమ మద్దతు తెలిపారు.
కొనసాగుతున్న ఆందోళన..
బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలనీ, బాధిత రెజ్లర్లకు న్యాయం చేయాలని రోడ్డెక్కిన రెజ్లర్లు, ఆదివారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. గత 15 రోజులుగా జరుగు తున్న ఈ ఆందోళన రోజు రోజుకూ ఉధృతమవు తోంది. ఆదివారం రైతులు వచ్చి మద్దతు తెలిపి, అండగా ఉంటా మని హామీ ఇవ్వడంతో రెజ్లర్లలో ఆత్మ విశ్వాసం మరింత పెరిగింది. రైతుల రావడంతో జంతర్ మంతర్ వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు మోహరించాయి. హర్యానా, పంజాబ్ నుంచి వచ్చిన రైతులను ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా టిక్రీ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను నెట్టుకుంటూ రైతులు, మహిళ రైతులు ఢిల్లీలోకి ప్రవేశించారు. ఢిల్లీ పోలీసులు కొంతమంది ఖాప్ నాయకులను వారి ప్రయివేట్ వాహనాల్లో ఢిల్లీ
సరిహద్దుల నుంచి జంతర్ మంతర్ వరకు ప్రయాణించడానికి అనుమతించారు. అయితే, ఖాప్ నేతలను ట్రాక్టర్లపై దేశ రాజధానిలోకి అనుమతించలేదు. ఖాప్ పంచాయతీ అధ్యక్షుడు పాలం చౌదరి సురేందర్ సోలంకి మాట్లాడుతూ మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమాలను ఏ విధంగా మరింత ముందుకు తీసుకెళ్లాలో త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. ఖాప్ అధ్యక్షుడు బల్వంత్ ఫోగట్ మాట్లాడుతూ న్యాయం కోసం పోరాటంలో మల్లయోధులకు మద్దతు ఇవ్వడానికి వివిధ ఖాప్‌ల నాయకులు నిరసన ప్రదేశంలో సమావేశమయ్యామని అన్నారు. ''ఈ ముఖ్యమైన విషయంలో మా తదుపరి చర్యల గురించి చర్చించడానికి మేం సమావేశాన్ని నిర్వహిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.
ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులను, పారామిలటరీ సిబ్బందిని సింఘూ సరిహద్దులో మోహరించారు. ఔటర్ ఢిల్లీలో 200 మంది పోలీసులను మోహరించారు. బహదూర్‌ఘర్ (హర్యానా)కి అనుసంధానించే టిక్రీ సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని వాహనాలను ఫరీదాబాద్-ఢిల్లీ సరిహద్దు, ఘజియాబాద్-ఢిల్లీ సరిహద్దు వద్ద కూడా నిలిపివేశారు. ఢిల్లీ పోలీసులు ట్రాక్టర్, ట్రాలీలు సరిహద్దు నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. పోలీసులు అనేక వరుసల బారికేడ్లను ఏర్పాటు చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)కి అనుబంధంగా ఉన్న హర్యానా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ (హెచ్ఏడబ్ల్యూఏ) ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నందుకు ఝజ్జర్, హిసార్, మేవాత్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున సస్పెండ్ చేసింది. ఝజ్జర్‌లో వీరేందర్ సింగ్ దలాల్, హిసార్‌లో సంజరు సింగ్ మాలిక్ , మేవాత్‌లో జై భగవాన్ అనే ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేస్తూ హెచ్ఏడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు రోహతాస్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన కమిటీ నివేదికను బయటపెట్టడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ డబ్ల్యూఎఫ్ఐ తన కార్యకలాపాలను పున్ణప్రారంభించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీం మాజీ న్యాయమూర్తితో
ఉన్నత స్థాయి విచారణ జరపాలి : ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు హన్నన్ మొల్లా
బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేసి, జైలుకు పంపాలని ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు హన్నన్ మొల్లా డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు జంతర్ మంతర్ వద్ద మల్లయోధుల ఉద్యమానికి మద్దతు తెలిపారని ఎస్కేఎం తెలిపింది. ఎస్కేఎం నాయకులు దర్శన్పాల్, హన్నన్ మొల్లా, యుధ్బీర్ సింగ్, రాకేశ్ తికాయిత్, ఉగ్రహాన్, ఆశిస్ మిట్టల్, ప్రేమ్‌సింగ్, ఇంద్రజీత్ సింగ్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారని పేర్కొంది. ఈ మేరకు ఎస్కేఎం ప్రకటన విడుదల చేసింది. రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మెన్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మా సోదరీమణులు, సోదరులకు తమ పూర్తి మద్దతును ప్రకటించారని తెలిపింది. ఖాఫ్ పంచాయతీలు కూడా పెద్ద సంఖ్యలో రెజ్లర్లకు మద్దతుగా నిలిచాయని పేర్కొంది. ఈ సందర్భంగా ఎస్కేఎం తరపున హన్నన్ మొల్లా మల్లయోధులకు మద్దతు ప్రకటించారు. నేరస్థుడైన ఎంపీని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.
డబ్ల్యూఎఫ్ఐ చైర్మెన్ పదవి నుంచి ఆయనను తొలగించాలని అన్నారు.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్ నేరగాళ్ల వల్ల రెజ్లర్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున వారికి ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాలని కోరారు. బ్రిజ్ భూషణ్, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు పిలుపు ఇచ్చామని అన్నారు. నేరస్తులకు శిక్ష పడే వరకు తాము రెజ్లర్లకు అండగా ఉంటామని ప్రకటించారు.