Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు గంటల పాటు కర్య్యూ సడలింపు
- నేడు సుప్రీం విచారణ
ఇంఫాల్ : మణిపూర్‌లో క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఆదివారం కొన్ని గంటల పాటు కర్ఫ్యూ సడలించారు. రాష్ట్రంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు జరగడంతో 54 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. వందల మంది గాయపడగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి కర్వ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకూ మూడు గంటల పాటు కర్వ్యూను సడలించడంతో ఆహారం, మందులు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చారు. 10 గంటలకు కర్వ్యూ సడలింపు ముగిసిన వెంటనే ఆర్మీ, అస్సాం రైఫిల్స్ వంటి భద్రతా సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. శనివారం కూడా సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకూ కర్వ్యూను సడలించినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం మణిపూర్‌లో పది వేలకు పైగా సైన్యం, పారా మిలటరీ, సిఆర్‌పిఎఫ్‌కు చెందిన సైనికులు మోహరించి ఉన్నారు. సాధారణ నిఘాతో పాటు గగనతల నిఘా వ్యవస్థను సైన్యం పెంచినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. 'సైన్యం గగనతల నిఘా వ్యవస్థను పెంచింది. ఇందుకోసం డ్రోన్లను, హెలికాప్టర్లను మోహరించాం' అని చెప్పారు.
రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి శాంతి భద్రతలు పునరుద్దరణ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ శాంతి కమిటీలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకూ 23 వేల మందికి పైగా పౌరులను రక్షించి, సురక్షిత శిబిరాలకు తరలించినట్లు చెప్పారు.మణిపూర్‌లో అల్లర్ల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఢిల్లీకి చెందిన మణిపూర్ గిరిజన ఫోరం వేసిన ఈ పిటీషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణకు షెడ్యూల్ చేసింది. మణిపూర్‌లో పరిస్థితి తీవ్రంగా ఉందని, ఈ దాడులకు రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉందని పిటీషన్లో ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ దాడులు ఢిల్లీకి వ్యాపించాయని, మేఘాలయాలోనూ ఇలాంటి దాడులు జరుగుతున్నాయని తెలిపారు. గిరిజనులపై దాడికి పాల్పడుతున్న సాయుధులు సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో తిరుగుతూ ఇళ్లల్లో లూటీకి పాల్పడుతున్నట్లు కొన్ని వీడియోలు, ఫోటోల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు.