Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1988 తర్వాత 42 మంది ఎంపీలపై చర్య
- 14వ లోక్‌సభలో అత్యధికంగా 19 మంది తొలగింపు
న్యూఢిల్లీ : 1988 తర్వాత ఇప్పటి వరకూ పార్లమెంటులో 42 మంది ఎంపీలు అనర్హత వేటుకు గురై సభ్యత్వాలు కోల్పోయారు. 14వ లోక్‌సభ అత్యధికంగా 19 మందిపై వేటు వేసింది. ప్రశ్నలు అడిగినందుకు ముడుపులు తీసుకున్న ఉదంతం, క్రాస్ ఓటింగ్ వంటి కారణాలతో ఎక్కువ మంది సభ్యుల సభ్యత్వాలు రద్దయ్యాయి.
పార్టీ ఫిరాయింపులు, సభలో ప్రవర్తన, రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలుశిక్ష పడడం వంటి కారణాలతో ఎంపీల సభ్యత్వాలను రద్దు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్, బీఎస్పీ నాయకుడు అఫ్జల్ అన్సారీలకు న్యాయస్థానాలు జైలు శిక్ష విధించడంతో వారి సభ్యత్వాలు రద్దయ్యాయి. వీరిలో ఫైజల్ కోర్టు నుంచి స్టే పొందారు. 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ సభ్యుడు లాల్డుహోమాపై వేటు పడింది. తొమ్మిదవ లోక్‌సభలో జనతాదళ్ నేత విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 9 మంది సభ్యులపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు పడింది.
2005లో ముడుపులు తీసుకొని ప్రశ్నలు అడిగినందుకు ఉభయసభలకు చెందిన 11 మందిని, 2008 జూలైలో ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష సందర్భంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు 9 మంది లోక్‌సభ సభ్యులను అనర్హులుగా ప్రకటించారు. 10వ లోక్‌సభలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించిన నలుగురిపై వేటు పడింది. రాజ్యసభ కూడా 1989 నుండి ఇప్పటివరకూ నలుగురిపై వేటు వేసింది. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ లాభాలు ఆర్జించే వేరే పదవిని నిర్వహించినందుకు 2001లో జేఎంఎం నేత శిబూ సొరేన్, 2006లో సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు జయాబచ్చన్లపై అనర్హత వేటు వేశారు. అవినీతి కేసులో శిక్ష పడిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్, దాణా కుంభకోణం కేసులో శిక్ష పడిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీ (యు) సభ్యుడు జగదీష్ శర్మ కూడా అనర్హతకు గురయ్యారు.