Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటం
- అధికారం నిలుపుకునేందుకు బీజేపీ తంటాలు
- మోడీ పైనే కమలనాథుల ఆశలు
బెంగళూరు : కర్నాటకలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. నేటితో ప్రచారానికి తెర పడుతుంది. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి పూర్వవైభవం సంపాదించాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తుంటే అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తంటాలు పడుతోంది. చివరి నిమిషంలో అందివచ్చే ఏ అవకాశాన్నీ ప్రధాన పార్టీలు వదులుకోవడం లేదు. గతంలో కంటే ఇప్పుడు తన విజయావకాశాలు మెరుగుపడ్డాయని బీజేపీ భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి నేతల ప్రచారం తమకు ఓట్లను కురిపిస్తుందని ఆ పార్టీ ఆశిస్తోంది. ముఖ్యంగా మోడీ పైనే కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు. బెంగళూరులో శనివారం మోడీ 26 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. ఆదివారం కూడా ఇది కొనసాగింది. 28 అసెంబ్లీ స్థానాలున్న బెంగళూరు నగరంలో మెజారిటీ సీట్లను సొంతం చేసుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. 2018 ఎన్నికలలో బెంగళూరులో ఆ పార్టీ పనితీరు నిరాశాజనకంగానే ఉంది. అందుకే మోడీ ఈ నగరంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆయన నగరంలో మొత్తం 18 సభలలో ప్రసంగించారు. మరోవైపు కాంగ్రెస్, జేడీ (ఎస్) కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అగ్రనేతలందరూ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కర్నాటకకు చెందిన వాడు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన ప్రచార సారధిగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.