Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధనబలం ఉన్న వారికే పార్టీల టికెట్
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీలన్నీ ధనబలం ఉన్న వారినే అభ్యర్థులుగా నిలిపాయి. బెంగళూరు నగరంలోని 28 అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో నిలిచిన 384 మంది అభ్యర్థులలో 157 మంది... అంటే 41 శాతం మంది కోటీశ్వరులేనని ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. బెంగళూరు నగరం నుండి పోటీ పడుతున్న 389 మంది అభ్యర్థులలో 384 మంది అఫిడవిట్లను ఈ సంస్థ పరిశీలించింది. వీరిలో 157 మంది రూ. కోటి, అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్న వారే. 87 మంది అభ్యర్థులు... అంటే 23 శాతం మంది తమకు ఐదు కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. 37 మంది అభ్యర్థులు (10 శాతం) తమకు రెండు నుండి ఐదు కోట్ల వరకూ విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. 76 మంది అభ్యర్థులకు యాభై లక్షల నుండి రెండు కోట్ల రూపాయల వరకూ, 70 మంది అభ్యర్థులకు పది లక్షల నుండి యాభై లక్షల రూపాయల వరకూ విలువైన ఆస్తులు ఉన్నాయి.
బెంగళూరు నగరం నుంచి బరిలో నిలిచిన 114 మంది అభ్యర్థులకు మాత్రం పది లక్షల రూపాయల కంటే తక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి 26 మంది, బీజేపీ నుంచి 27 మంది, జేడీ (ఎస్) నుంచి 21 మంది, ఆప్ నుంచి 25 మంది అభ్యర్థులు తాము కోటీశ్వరులమని డిక్లరేషన్ ఇచ్చారు. బెంగళూరు నగరం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ. 24.48 కోట్లు. చిక్పెట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యూసఫ్ షరీఫ్ ఆస్తుల విలువ అక్షరాలా రూ. 1,633 కోట్లు. గోవిందరాజనగర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రియకృష్ణ రూ. 1,156 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. హెబ్బాల్ నుంచి బరిలో ఉన్న సురేషా రూ. 648 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు.