Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లలో రూ. 535 కోట్లు
న్యూఢిల్లీ : పీఎం కేర్స్‌కు గత మూడేండ్ల కాలంలో విదేశాల నుంచి రూ. 535 కోట్ల విరాళం అందింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అత్యవసర పరిస్థితులలో పౌరులకు సాయం అందించేందుకు పీఎం కేర్స్ పేరిట మోడీ ప్రభుత్వం 2020లో నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధికి సంబంధించిన వసూళ్లు, చెల్లింపుల ఖాతాల ప్రకారం విదేశాల నుంచి 2019-20లో రూ. 0.40 కోట్లు, 2020-21లో రూ. 494.92 కోట్లు, 2021-22లో రూ. 40.12 కోట్ల మేర విరాళాలు లభించాయి.
ఈ మూడు ఆర్థిక సంవత్సరాలలో విదేశీ విరాళాల నుంచి రూ. 24.85 కోట్ల వడ్డీ ఆదాయం కూడా లభించింది. కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉన్న 2020-21లో విదేశాల నుంచి అధికంగా విరాళాలు వచ్చాయి. రెండో దశ కోవిడ్ ప్రబలిన 2021-22లో మాత్రం విరాళాల జోరు తగ్గింది. 2021-22లో విదేశీ విరాళాలతో పాటు స్వచ్ఛంద విరాళాలు కూడా తగ్గిపోయాయి. 2020-21లో రూ. 7,183.77 కోట్ల మేర స్వచ్ఛంద విరాళాలు లభించగా 2021-22లో రూ. 1,896.76 కోట్లు మాత్రమే వచ్చాయి. 2019-20లో స్వచ్ఛంద విరాళాల రూపంలో రూ.3,075.85 కోట్లు వచ్చాయి. విదేశీ, స్వచ్ఛంద విరాళాలు కలిసి ఈ మూడేండ్ల కాలంలో రూ. 12,691.82 కోట్లు లభించాయి. పీఎం కేర్స్‌కు వచ్చే విరాళాలను ఆదాయపన్ను, ఎఫ్సీఆర్ఏ నుంచి మినహాయించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో వెంటిలేటర్లు, వలసవాదుల సంక్షేమం, రెండు కోవిడ్ ఆస్పత్రుల ఏర్పాటు, ఆక్సిజన్ ప్లాంట్లు, వాక్సిన్ సేకరణ, ఇతర కోవిడ్ సంబంధ సరఫరాల కోసం ఈ నిధి నుండి చెల్లింపులు జరిపినట్లు ఖాతాలో చూపారు. అయితే ఈ నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు ఇవ్వటానికి ఆర్టీఐ నుంచి మినహాయింపు ఇవ్వటం గమనార్హం.