Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
- అండగా ఉంటా : సీఎం విజయన్
తిరువంతపురం : కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 22కు పెరిగింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఆ కుటుంబాలకు ఇది ఓదార్పునిచ్చేది కాదని, ఆ కుటుంబాలకు తాను అండగా ఉంటానని విజయన్ హామీ ఇచ్చారు. ప్రమాద ప్రాంతాన్ని సోమవారం ఉదయం ముఖ్యమంత్రి విజయన్ పరిశీలించారు. సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. జిల్లాలోని తనూర్ ప్రాంతంలోని తూవల్ తీరంలో డబుల్ డెక్కర్ బోటు ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బోల్తా పడి మునిగిపోయిన సంగతి తెలిసిందే. 22 మంది మరణించగా, ఇద్దరు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. ఆసుపత్రిలో చేరిన 10 మందిలో ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి, మరణించిన వారి బంధువులకు ఆరోగ్యశాఖ మానసికంగా అండగా ఉంటుందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. గాయపడిన వారిని ఆమె పరామర్శించారు. ప్రమాదానికి గురైన పడవ యాజమాని నాజర్ను కొజికొడ్లోని బీచ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని, ముందుగా మలప్పురం తీసుకొస్తామని పోలీసులు చెప్పారు. ఆదివారమే నాజర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తానూరులో మంత్రివర్గ, అఖిలపక్ష సమావేశాలు ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి, నివాళులర్పించారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం సీఎం విజయన్ తానూరులో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నేతలతోనూ సమావేశమయ్యారు. దుర్ఘటనపై న్యాయ విచారణ జరపాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. సాంకేతిక నిపుణులతోసహా న్యాయవిచారణ జరిపిస్తుందని, జిల్లా పోలీసు చీఫ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను నిర్వహిస్తుందని సీఎం తెలిపారు.