Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీకి బీజేపీ వినతి
న్యూఢిల్లీ : కర్నాటక సార్వభౌమాధికారానికి మద్దతు తెలిపినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆమెకు గుణపాఠం చెప్పే విధంగా చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. కర్నాటక పేరుప్రతిష్టలకు, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే దానిని కాంగ్రెస్ సహించబోదంటూ సోనియా ఈ నెల హుబ్బల్లిలో జరిగిన సభలో చెప్పారంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది. దీని ఆధారంగా సోనియాపై బీజేపీ ఫిర్యాదు చేసింది. అయితే సోనియా ప్రసంగానికి సంబంధించిన ప్రతిని పరిశీలిస్తే సార్వభౌమత్వం అనే పదాన్నే ఆమె ఉపయోగించలేదని తేలింది. అయినప్పటికీ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ను కలిసి ఆమెపై ఫిర్యాదు చేసింది. సోనియా ఉద్దేశపూర్వకంగానే ఆ పదాన్ని ఉపయోగించారని, అది 'తుక్డే తుక్డే గ్యాంగ్' అజెండా అని బీజేపీ ప్రతినిధి బృందం విమర్శించింది. దేశ ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా ఆమె ఆ పదాలు వాడారని తెలిపింది. కాంగ్రెస్ గుర్తింపును రద్దు చేయాలని బీజేపీ నాయకుడు తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. సోనియా వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయని, అవి ఆమోదయోగ్యం కావని కేంద్ర మంత్రి శోభా కరండ్లజే అన్నారు. సోనియా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించిన మర్నాడే బీజేపీ బృందం ఆమెపై ఫిర్యాదు చేయడం గమనార్హం.