Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లర్ల ఆందోళనలో పాల్గొనడానికి రైతుల సమూహం బారికేడ్లను నెట్టుకుంటూ...ముందుకు కదంతొక్కింది. రెజ్లర్ల నిరసన ప్రాంగణానికి సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు ఛేదించారు. రైతులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మల్లయోధుల నిరసన వేదిక వద్ద సోమవారం కూడా పెద్ద సంఖ్యలో రైతులు, మహిళ రైతులు కూర్చున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలుపుతున్న మల్లయోధులకు మద్దతుగా వివిధ రాష్ట్రాల నుంచి రైతులు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని, బాధిత రెజ్లర్లకు న్యాయం చేయాలని రోడ్డెక్కిన రెజ్లర్లు, సోమవారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. గత 16 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళన రోజు రోజుకూ ఉధృతమవుతోంది. బజరంగ్ పునియా మాట్లాడుతూ ''మేం రాజకీయాలు చేసేందుకు రాలేదు. న్యాయం కోసం వచ్చాం. నిరసనలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నవారికి స్వాగతం. ఎవరూ నిరసనను హైజాక్ చేయలేదు. బదులుగా మేము నిరసన కోసం పోరాడుతున్నాం'' అని అన్నారు. ''మాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్న వారికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ నిరసన కేవలం మల్లయోధులకు మాత్రమే పరిమితం కాదు. ఇది దేశం కోసం కూడా పోరాటం. భారతదేశపు ఆడబిడ్డల కోసం పోరాటం'' అని బజరంగ్ పునియా అన్నారు. ''పోరాడుతాం. దేవుడు మాకు ముందు అవకాశం ఇస్తే, మేం కచ్చితంగా ఆడతాం.. మేం ఇప్పటికీ నిరసనల సమయంలోనూ వీలైనంత ఎక్కువ శిక్షణ కోసం ప్రయత్నిస్తున్నాం. సమయాన్ని వెతకడానికి, మా శిక్షణా షెడ్యూల్‌ని ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం'' అని వినేష్ ఫోగట్ అన్నారు.
మల్లయోధులకు కేంద్ర కార్మిక సంఘాల మద్దతు
మల్లయోధుల ఆందోళనకు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూ టీయూసీ,టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ,ఎల్పీఎఫ్, యూటీయూసీ సంఘాలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి.
రెండు ఎఫ్ఐఆర్లు నమోదైన ఇండియన్ రెజ్లర్స్ ఫెడరేషన్ చైర్పర్సన్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్న యువతి రెజ్లర్ల న్యాయమైన డిమాండ్‌కు కార్మిక సంఘాలు హృదయపూర్వక మద్దతును తెలియజేస్తోన్నాయని పేర్కొన్నాయి. బ్రిజ్ భూషణ్ నుంచి వచ్చే ఒత్తిళ్లు విచారణను ప్రభావితం చేయకుండా విచారణ కొనసాగించాలని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. రెజ్లర్లపై పోలీసులు దాడి చేయడం చాలా ఘోరమని పేర్కొన్నాయి. ఈ క్రమంలో బట్టలు చిరిగిపోయిన మహిళా జర్నలిస్టు సాక్షి జోషిపై పోలీసులు దాడి చేశారని విమర్శించాయి. కార్మిక సంఘాలు తమ డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నాయని, తక్షణమే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని పేర్కొన్నాయి.
నాడు రైతులు..నేడు రెజ్లర్లు
- అపుడు రోడ్లపై మేకులు.. ఇపుడు బారికేడ్లకు వెల్డింగ్
- మోడీ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు
రెజ్లర్ల ఆందోళనలు చేస్తున్నా..బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్య తీసుకోవటానికి మోడీ ప్రభుత్వం వెనకడుగువేస్తున్నది. రెజ్లర్లకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతోంది.. బారికేడ్లను పెట్టి ఆపలేకపోతున్నది. గతంలో రైతులు దీక్ష చేసినపుడు రోడ్లపై కీలలు కొట్టించిన విషయం విదితమే. ఇపుడు రెజ్లర్ల దీక్షాస్థలి వద్ద బారికేడ్లను తోసుకుని వెళ్లకుండా ..వెల్డింగ్ పనులకు ఉపక్రమించింది. దీనిపై దేశప్రజలు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.