Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో ముస్లిం రిజర్వేషన్ల గురించి అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కర్నాటకలో ముస్లిం రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేసిన కేంద్ర హౌం మంత్రి అమిత్ షాపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై విచారణ జరుగుతున్న సమయంలో దీన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికింది. గౌరవ, మర్యాదలను పాటించాలని స్పష్టం చేసింది. ముస్లింలకు కల్పిస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి, లింగాయత్, వొక్కళిగ సామాజిక వర్గాలకు చెరొక రెండు శాతం చొప్పున కేటాయిస్తూ కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. తదుపరి విచారణ జులై 25న జరగనున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ముస్లింలకు కల్పిస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ, లింగాయత్, వొక్కళిగ సామాజిక వర్గాలకు చెరొక రెండు శాతం చొప్పున కేటాయిస్తూ కర్నాటక ప్రభుత్వం మార్చిలో తీసుకున్న నిర్ణయాన్ని ఎల్ గులాం రసూల్ తదితరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించిన సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయ అమలును తాత్కాలికంగా నిలిపేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్ కెఎం జోసఫ్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరుపుతోంది. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా కర్నాటకలో మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారన్నారు. దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ, ఈ అంశం కోర్టు విచారణలో ఉన్నదని, అందువల్ల రాజకీయ ప్రకటనలను అనుమతించేది లేదని అన్నారు. కర్నాటక ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారో, లేదో తనకు తెలియదన్నారు. అయితే ఎన్నికల ప్రణాళికలో అటువంటి హామీ ఇవ్వవచ్చని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, దీనిపై బహిరంగ ప్రకటనలు చేయరాదని, తమకు రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొంది. అమిత్ షా వ్యాఖ్యలను సాక్ష్యాధారాలతో కోర్టు ముందు ఉంచుతానని సీనియర్ అడ్వకేట్ దవే చెప్పారు. ముస్లింల రిజర్వేషన్ల రద్దుపై తదుపరి చర్యలు తీసుకోబోమని కర్నాటక ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ముస్లింలు సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన స్థితిలో ఉన్నట్టు ఓ కేసులో సుప్రీంకోర్టు అంగీకరించిందని పిటిషనర్లు ధర్మాసనానికి తెలిపారు. ఆర్థిక బలహీన వర్గాల వర్గంలోకి ముస్లింలను కలపడం అన్యాయమని తెలిపారు.