Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 224 స్థానాల్లో 2,615 మంది పోటీ
- ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకూ ఓటింగ్
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుంది. మొత్తం 224 నియోజకవర్గాల్లో 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరిగే ఓటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్, జెడి(ఎస్) ప్రధాన పార్టీలుగా పోటీ చేస్తున్నాయి. సిపిఎం నాలుగు స్థానాల్లో బరిలో ఉంది. మొత్తంగా 2,615 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఓటర్లల్లో 2,67,28,053 మంది పురుషులు కాగా, 2,64,00,074 మంది మహిళలు, 4,927 మంది ఇతరులు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 72.44 శాతం ఓటింగ్ నమోదయింది. రాజధాని బెంగళూరులో కేవలం 55 శాతం మాత్రమే నమోదయింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి బృహత్ బెంగళూరు మహనగర పాలిక (బిబిఎంపి)లో 264 థీమ్ బేస్డ్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆరోగ్యం, యువజన, సాంస్కృతికం, పింక్, ట్రాన్స్‌జెండర్, చిరుధాన్యాలు, గో గ్రీన్, వికలాంగులు, పర్యావరణం, శాస్త్ర-సాంకేతికత, క్రీడలు, సైన్యం వంటి థీమ్స్‌తో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కాగా, దేశంలో తొలిసారిగానే ఈ ఎన్నికల్లో 'ఓట్ ఫ్రమ్ హోం' అనే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. దీని ద్వారా వికలాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయింది.