Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్త ఆందోళనకు డీవైఎఫ్ఐ పిలుపు
- 17వ రోజుకు చేరిన మల్లయోధుల ఆందోళన
న్యూఢిల్లీ : బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలనీ, బాధిత రెజ్లర్లకు న్యాయం చేయాలని రోడ్డెక్కిన రెజ్లర్లు... మంగళవారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. గత 17 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతున్నది. పోరాడుతున్న మల్ల యోధులకు డీవైఎఫ్ఐ మద్దతు ప్రకటించింది. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. మే 15 నుంచి 20 వరకు ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. అన్ని రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు రెజ్లర్ల సమావేశం అనంతరం డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీం మీడియాకు తెలిపారు. 21న దేశవ్యాప్తంగా ఈ-మెయిల్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మెయిల్స్ పంపి నిరసన తెలుపుతామన్నారు. దీనికి ముందు హర్యానా డీవైఎఫ్ఐ నాయకత్వం ఆదివారం నిరసన స్థలానికి చేరుకుని రెజ్లర్లకు సంఘీభావం తెలుపుతుందని రహీం చెప్పారు. మోడీ ప్రభుత్వం ఆటగాళ్ళు వెంట కాకుండా, వేటగాళ్ల వెంటే ఉందని రహీం విమర్శించారు. డీవైఎఫ్ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమగరాజ్ భట్టాచార్య, సెంట్రల్ సెక్రటేరియట్ సభ్యుడు జైక్ సి థామస్ కూడా రహీంతో పాటు నిరసన స్థలానికి వచ్చారు. ఉమ్మడి ట్రేడ్ యూనియన్ ప్రతినిధి బృందం బుధవారం కూడా క్రీడాకారులతో సమావేశం కానున్నది. సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీ యూసీ, టీయూసీసీ, యూసీసీ, సేవా, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీ యూసీ సంఘాల ప్రతినిధులు హాజరవుతారు. రెజ్లర్లతో కలిసి మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు.