Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2020లో అంతర్జాతీయంగా 1.34 కోట్ల మంది చిన్నారులు నిర్ధారిత 37 వారాల కంటే ముందుగానే ఈ లోకంలోకి అడుగు పెట్టారు. ఈ జననాలలో 45 శాతం ఐదు దేశాలు... భారత్, పాకిస్తాన్, నైజీరియా, ఇథియోపియా సహ పలు దేశాల్లో సంభవించాయి. అయితే ఇలా ముందుగా జన్మిస్తున్న శిశువులలో ఎక్కువ మంది అనారోగ్యం, ఇతర కారణాలతో మృత్యువాత పడుతున్నారు. ఐక్యరాజ్యసమితి సంస్థలు, వాటి భాగస్వాములు బుధవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేశారు. డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్, పీఎంఎన్సీహెచ్ సంయుక్తంగా దీనిని రూపొందించాయి. 46 దేశాలకు చెందిన 140 మంది వ్యక్తులు దీనిలో భాగస్వాములయ్యారు.
ముందస్తు జననాలు 'నిశ్శబ్ద ఎమర్జెన్సీ'ని తలపిస్తున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది. ముందుగానే పుట్టిన చిన్నారుల ఆరోగ్యం, వారి మనుగడ ప్రమాదంలో పడతాయని తెలిపింది. 2020లో ముందుగానే పుట్టిన నవజాత శిశువులలో సుమారు లక్ష మంది అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అంటే ప్రతి పది మందిలో ఒకరు చనిపోయారన్న మాట. బంగ్లాదేశ్, మాలవి, పాకిస్తాన్, గ్రీస్, అమెరికా దేశాలలో ముందస్తు జననాలు ఎక్కువగా జరిగాయి. గర్భిణులు, శిశువుల ప్రాణాలకు ఘర్షణలు, వాతావరణ మార్పులు, కోవిడ్, జీవన వ్యయం ముప్పు కలిగిస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ సమస్యలను అధిగమించాలంటే ఆయా రంగాలలో మరిన్ని పెట్టుబడులు అవసరమని సూచించింది. ఉదాహరణకు వాయు కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం 60 లక్షల మంది చిన్నారులు ముందుగానే జన్మిస్తున్నారు. వీరిలో 12 లక్షల మంది మరింత ముందుగానే పుట్టడం వల్ల వారిని, వారి తల్లులను కాపాడడం కష్టమవుతోంది. ముందుగా జన్మించిన శిశువులలో ఎక్కువ మంది ఐదేళ్ల వయసు వచ్చే లోగానే మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వాలు, దాతలు, ప్రయివేటు రంగం, పౌర సమాజం, తల్లిదండ్రులు, వైద్య నిపుణులు కలిసికట్టుగా కృషి చేయాలని నివేదిక సూచించింది. ముందస్తు జననాలను నివారించాలంటే ప్రతి మహిళకు గర్భం ధరించడానికి ముందు, ఆ తర్వాత నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని డబ్ల్యూహెచ్ఓ విభాగం డైరెక్టర్ డాక్టర్ అన్షు బెనర్జీ అభిప్రాయపడ్డారు.