Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య సేవలందిస్తుండగా ఉన్మాది ఘాతుకం
- వైద్యురాలి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం విజయన్
- సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ
కొచ్చి : విధి నిర్వహణలో ఉన్న మహిళా డాక్టర్‌ను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలోని కొట్టారక్కర తాలూకా ఆసుపత్రిలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఇద్దరు పోలీసులు, నిందితుడి బంధువు కత్తిపోట్లకు గురయ్యారు. ఎడిజిపి ఎంఆర్ అజిత్‌కుమార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మద్యానికి బానిసైన ఉపాధ్యాయుడు సందీప్ తనను స్థానికులు కొడుతున్నారంటూ పోలీసు ఎమర్జెన్సీ నెంబరుకు ఫోన్ చేశాడు.
సందీప్ శరీరంపై గాయాలుండటంతో పోలీసులు అతని సమీప బంధువు, స్థానికుడితో కలిసి తాలూకా ఆసుపత్రికి తీసుకొచ్చారు. క్యాజువాలిటీలో పరిశీలించిన వైద్యులు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. డ్రైస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లగా, సందీప్ ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయాడు. సమీపంలోని రెండు కత్తెరలు తీసుకుని హోంగార్డును పొడిచాడు. అక్కడికి పరిగెత్తుకు వచ్చిన ఎఎస్ఐ, అతని బంధువును పొడిచాడు. దీంతో, డాక్టర్లు, సిబ్బంది పక్కగదిలోకి పరుగులు తీశారు. అక్కడ చిక్కుకుపోయిన డాక్టర్ వందనా దాస్‌ను కత్తెరతో పొడవడంతో, ఆమె తీవ్రంగా గాయపడి మరణించారు.
సమగ్ర విచారణ జరిపిస్తాం : సిఎం
ఈ ఘటన గురించి తెలుసుకున్న సిఎం విజయన్ ఆసుపత్రికి చేరుకుని డాక్టర్ వందనాదాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. 'డాక్టర్ వందనా దాస్ విధి నిర్వహణలో హత్యకు గురికావడం దిగ్భ్రాంతికరం. అత్యంత బాధాకరం. వైద్యం కోసం తీసుకొచ్చిన వ్యక్తి వైద్యురాలిపై దాడి చేయడం, అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు, ఇతరులపై దాడి చేయడం ఘోరం. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తాం' అని సిఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.