Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు ప్రముఖుల బహిరంగ లేఖ
- సత్వరమే కేసును విచారించాలని వినతి
న్యూఢిల్లీ : గత ఇరవై సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థపై నమ్మకంతో పోరాడుతున్న బిల్కిస్ బానోకు వేలాది మంది బాసటగా నిలుస్తున్నారు. తాజాగా మూడున్నర వేల మంది మహిళలు, పౌరులు, మేధావులు ఆమెకు మద్దతు తెలుపుతూ సుప్రీంకోర్టుకు బహిరంగ లేఖ రాశారు. బానో కేసు విచారణలో జరుగుతున్న జాప్యంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. బానోపై లైంగిక దాడికి పాల్పడి, జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న 11 మంది కామాంధులకు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసిందే. వీరి విడుదలను వ్యతిరేకిస్తూ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కేసు విచారణలో జరుగుతున్న జాప్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి కేసులను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించని పక్షంలో బాధిత మహిళలు ఎవరిని ఆశ్రయించాలంటూ బహిరంగ లేఖలో మహిళలు, పౌరులు ప్రశ్నించారు.
బహిరంగ లేఖపై రచయిత సయేదా హమీద్, చరిత్రకారులు ఉమా చక్రవర్తి, ఇర్ఫాన్ హబీబ్, పీయూసీఎల్ అధ్యక్షులు కవితా శ్రీవాత్సవ, కళాకారుడు మాయా కృష్ణారావు, సామాజిక కార్యకర్త అంజలీ భరద్వాజ్, సహేలీ ఉమెన్స్ రిసోర్స్ సెంటర్ ప్రతినిధి వాణీ సుబ్రమణ్యం, జేఎన్యూ ఫ్రొఫెసర్ నివేదితా మీనన్, భారతీయ మహిళల జాతీయ సమాఖ్య అధ్యక్షురాలు అన్నే రాజా తదితర ప్రముఖులు సంతకాలు చేశారు. బానో అభ్యర్థనను వెంటనే పరిశీలించాలని ఇప్పటివరకూ ఆరు వేల మంది పౌరులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖలు రాశారు. విచారణను అడ్డుకునేందుకు, పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది తమకు ఆందోళన కలిగిస్తోందని బహిరంగ లేఖలో రచయితలు, మేధావులు, చరిత్రకారులు తెలిపారు.
'దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభించకుండా చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. బిల్కిస్ బానో ఇప్పటికీ న్యాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఆమెకు న్యాయం జరుగుతుందని మేము ఇంకా ఆశాభావంతోనే ఉన్నాం' అని వారు ఆ లేఖలో తెలియజేశారు. బానోకు వారంతా సంఘీభావం ప్రకటించారు. లైంగిక దాడికి గురై న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. బానో ఇప్పటికే 20 సంవత్సరాలు న్యాయపోరాటం చేశారని, ఇకనైనా ఎటువంటి జాప్యం లేకుండా ఆమె అభ్యర్థనను మన్నించాలని వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.