Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని అస్త్రాలూ ప్రయోగించిన బీజేపీ
- అయినా ప్రజల్లో చల్లారని అసంతృప్తి
- రేపు కర్నాటక ఫలితాలు
కర్నాటకలో మరోసారి అధికారాన్ని దక్కించుకొని, తద్వారా దక్షిణాదిలో బలపడాలని కలలు కంటున్న బీజేపీ భవితవ్యం రేపటితో తేలిపోతుంది. దక్షిణాదిన పాగా వేయాలన్న ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటకలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్ల దృష్టిని సమస్యల నుండి మళ్లించేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అక్కడ మీడియా కూడా తన వంతు పాత్ర పోషించి మోడీ ప్రచారానికి విశేష ప్రాధాన్యత కల్పించింది. మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించకపోతే మీడియా దృష్టి మొత్తం స్థానిక అంశాలపై కేంద్రీకృతమై ఉండేది.
బెంగళూరు : ఓ వైపు మోడీ, ఇతర బీజేపీ నేతలు సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని హోరెత్తించినా కార్మికులు, రైతులు, యువకులు మాత్రం తమ సమస్యలను, ఇబ్బందులను మరచిపోలేదు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని కవిత అనే దినసరి కార్మికురాలు ప్రశ్నించారు. బియ్యం, పప్పులు, నూనెలు, సబ్బులు, షాంపూలు, వంటగ్యాస్...ఒకటేమిటి ? అన్నింటి ధరలూ పెరిగాయని ఆమె వాపోయారు. మోడీ పువ్వుల సువాసనలు ఆస్వాదిస్తూ స్నానం చేస్తారని, ఖరీదైన కొత్త బట్టలు కట్టుకుంటారని, అయితే దానివల్ల ఎవరికి ప్రయోజనమని నిలదీశారు. బీజేపీ హయాంలో ఉద్యోగాలు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం రేషన్ అయినా లభించేదని ఇపుడు మోడీ రోడ్‌షోలతో కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు. మాండ్యా ప్రాంతంలో శ్రీనివాస్ అనే ఆటోవాలా కూడా మోడీపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు అన్నింటిపైనా పన్నులు వేస్తున్నారని, తాగునీటికి కూడా మీటర్లు బిగించారని చెప్పారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే తాము పీల్చే గాలిపై కూడా పన్ను వేస్తుందేమోనని ఎద్దేవా చేశారు. 'మోడీ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే. జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవమని చెప్పారు. అయినా బ్యాంకులు ఐదు వందల రూపాయలు వసూలు చేశాయి. ఖాతా తెరిచినా ఒక్క రూపాయి కూడా అందులో పడలేదు. పైగా సంవత్సరం తిరిగే సరికి సర్వీస్ ట్యాక్స్ కింద నా ఖాతా నుండి కొంత మొత్తం కట్ చేశారు. కడుపు నిండిన వారికి, వ్యాపారులకు మాత్రమే మోడీ దేవుడు' అని ఆయన మండిపడ్డారు. మోడీ మద్దతుదారులు మాత్రం ఈ వాదనలను ఖండిస్తున్నారు. అయితే ఈసారి మోడీ గ్రాఫ్ కొంచెం పడిపోయిందని బీజేపీ మద్దతుదారు అనుపమ అంగీకరించారు.
అయితే మోడీ మాత్రం ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు కొనసాగించారు. ఆయన కేవలం 'హిందూత్వ' ప్రచారానికే పరిమితం కాలేదు. తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యక్తిగత విమర్శలను ప్రస్తావిస్తూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. బజరంగ్దళ్, పీఎఫ్ఐల నిషేధంపై కాంగ్రెస్ మాట్లాడగానే బజరంగ్‌బలిపై నిషేధం గురించి మోడీ ప్రస్తావించారు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు 'జై బజరంగబలి' అని నినదించాలంటూ పిలుపునిచ్చి ప్రజలలో భావోద్వేగాలు రేకెత్తించారు. ఆ విధంగా అందివచ్చిన అవకాశాలన్నింటినీ ఎన్నికల ప్రయోజనం కోసం బీజేపీ వాడుకుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే తన ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్ని దేవాలయాలనూ సందర్శించి హిందూ కార్డును ప్రయోగించారు. తెలంగాణకు చెందిన రాజాసింగ్ సైతం ముస్లింలపై విషం చిమ్మారు. తామేమీ తక్కువ తినలేదన్నట్లు కర్నాటక బీజేపీ నేతలు అగ్నికి ఆజ్యం పోశారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఏ ఒక్క అంశానికో పరిమితం కాలేదు. విజయం కోసం అనేక అడ్డదారులు తొక్కింది.
ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ 400 ర్యాలీలు, 130 రోడ్‌షోలు నిర్వహించింది. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. నేతలపై పూల వర్షం కురిపించడానికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. మోడీ సైతం 19 బహిరంగ సభలలో ప్రసంగించారు. ఆరు రోడ్‌షోలు నిర్వహించారు. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్న విషయం ఒకటి ఉంది. రాష్ట్రంలో కుల పరంగా నాయకులు బలోపేతం కావడం వారికి సుతరామూ ఇష్టం లేదు. అందుకే లింగాయత్ నేత యడియూరప్పకు ఈసారి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కుర్బుల నాయకుడు ఈశ్వరప్పను పక్కన పెట్టారు. బీఎస్ సంతోష్, ప్రహ్లాద్ జోషీ వాంటి వారే అంతా తామై నడిపించారు. ఈ వైఖరి పార్టీకి నష్టదాయకమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా రేపు ఈవీఎంలు తెరచినప్పుడు అన్ని సందేహాలు పటాపంచలు అవుతాయి.