Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాపై పెరిగిన సర్కారు పెత్తనం
- మోడీ సేవలో తరిస్తున్న కార్పొరేట్ మీడియా
- పీపుల్స్ డెమొక్రసీ సంపాదకీయంలో సీపీఐ (ఎం) ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులను సీపీఐ (ఎం) తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ అణచివేత చర్యలు, భయపెట్టే చర్యలు పత్రికా స్వేచ్ఛకు పెనుముప్పు కలిగిస్తున్నా యని ఆందోళన వ్యక్తం చేసింది. పాత్రికేయులపై జరుగుతున్న హింసను ప్రస్తావిస్తూ పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డెమొక్రసీ తాజా సంచికలో సంపాదకీయం ప్రచురితమైంది. పాత్రికేయులపై రాజద్రోహం సహా పలు చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆ వ్యాసంలో సీపీఐ (ఎం) విమర్శించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పత్రికలలో వార్తలు ప్రచురించిన ప్రతి సందర్భంలోనూ ఈ విధమైన కేసులు పెడుతున్నారని గుర్తు చేసింది. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ఈ నెల 3న విడుదలైన సూచికలో భారత్ 180 దేశాలలో 161 స్థానంలో నిలిచిందని సంపాదకీయం తెలిపింది. రత్నగిరిలో జరిగిన శశికాంత్ విరిషే ఉదంతాన్ని ప్రస్తావిస్తూ నేరపూరిత, మాఫియా కార్యకలాపాలను బయటపెట్టినందుకు జర్నలిస్టులను పొట్టన పెట్టుకుంటున్నారని పేర్కొంది.
'దేశంలో పాత్రికేయుల పరిస్థితి ఇలా ఉన్నందునే సూచికలో చివరి స్థానాలలో నిలిచాం. మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు, స్వతంత్ర మీడియా సంస్థలను, పాత్రికేయులను అణచివేసేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ దృష్టి ఇప్పుడు చిన్న చిన్న స్వతంత్ర వార్తా వెబ్సైట్లు, డిజిటల్ మీడియా పైన కూడా పడింది. వెబ్సైట్లను, సోషల్ మీడియాను నియంత్రించేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు అధికారం అప్పగిస్తూ ఐటీ చట్టంలో నిబంధనలు రూపొందించారు. ప్రభుత్వ సంబంధమైన వార్తలలో అసత్యాలు ఏమైనా ఉన్నాయా అని నిర్ధారించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కింద ఏర్పాటు చేసిన కమిటీకి అధికారాలు కట్టబెట్టారు. దీంతో వార్తల ప్రచురణ, ప్రసారంపై ప్రభుత్వ పెత్తనం మరింత పెరిగింది.' అపి సీపీఐ (ఎం) విమర్శించింది. మీడియా యాజమాన్యాలు కొన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లడం పత్రికా స్వేచ్ఛకు మరో పెద్ద ముప్పు అని సీపీఐ (ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై ఆధిపత్యం చెలాయిస్తున్న కార్పొరేట్ సంస్థలు మోడీ పాలనను ఆకాశానికి ఎత్తుతూ ప్రచారం నిర్వహిస్తున్నాయని, అలాగే టీవీ ఛానల్స్ కూడా మోడీ ప్రభుత్వాన్ని, హిందూత్వ రాజకీయాలను పొగడ్తలతో ముంచెత్తుతున్నాయని పేర్కొంది. స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఛానల్స్‌పై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని అంటూ కొన్ని ఛానల్స్‌ను మోడీ భజనపరులైన కార్పొరేట్ దిగ్గజాలు కొనుగోలు చేశారని వివరించింది. ఈ సందర్భంగా ఎన్డీటీవీని అదానీ కైవసం చేసుకోవడాన్ని ప్రస్తావించింది. 'స్వతంత్ర జర్నలిజానికి, పరిశోధనాత్మక జర్నలిజానికి మీడియాలో తగిన స్థానం లభించడం లేదు. ప్రజాస్వామ్యం పైన, ప్రజాస్వామిక హక్కుల పైన మోడీ ప్రభుత్వం జరుపుతున్న దాడిలో భాగంగానే పత్రికా స్వేచ్ఛ అణచివేతను చూడాల్సి ఉంటుంది. మీడియాలో ఏ వార్తలను ప్రచురించాలో, వేటిని తొలగించాలో నిర్దేశించే స్థాయికి చేరుకున్నామని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్ని నిర్బంధాల నడుమ ధైర్యంతో తమ విధులు నిర్వర్తిస్తున్న పాత్రికేయులు అభినందనీయులు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి చేస్తున్న పోరాటంలో పత్రికా స్వేచ్ఛ కోసం జరిపే పోరు కూడా ఒక భాగమే' అని పీపుల్స్ డెమొక్రసీ సంపాదకీయంలో సీపీఐ (ఎం) వివరించింది.