Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర గవర్నర్, స్పీకర్ చర్యలు సరైనవి కావు
- అయినా ఉద్ధవ్‌ను సీఎంగా చేయలేం : శివసేన కేసులో సుప్రీం ఏకగ్రీవ తీర్పు
న్యూఢిల్లీ : చట్టానికి అనుగుణంగా మహారాష్ట్ర గవర్నర్, అసెంబ్లీ స్పీకర్ వ్యవహరించలేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అయినా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పునరుద్ధరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. శివసేనను వీడుతూ ఏక్నాథ్ శిండే తీసుకున్న నిర్ణయం, పార్టీ చీలిక నేపథ్యంలో బలపరీక్షకు వెళ్లకుండానే ఉద్ధవ్ రాజీనామా చేశారని అందువల్ల ఆయన రాజీనామాను రద్దు చేసి, మళ్లీ ముఖ్యమంత్రిగా చేయలేమని పేర్కొంది. రాజీనామా చేయకుండా థాకరే సంయమనం పాటించి వుంటే ఆయన్ని తిరిగి సీఎం గద్దెపై కూర్చోబెట్టవచ్చని పేర్కొంది. రాజీనామా కారణంగా బలపరీక్ష జరగనందున ఈ అవకాశమే తలెత్తదని బెంచ్ పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కొహ్లి, జస్టిస్ పి.ఎస్.నరసింహాలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. పార్టీ అంతర్గత వివాదాలను పరిష్కరించడానికి బల పరీక్ష నిర్వహించాలని గవర్నర్ నిర్ణయం తీసుకోవడం తప్పని బెంచ్ పేర్కొంది. ఏక్నాథ్ శిండే వర్గం నుంచి పార్టీ విప్‌ను నియమించడం స్పీకర్ చేసిన తప్పని పేర్కొంది. ''రాజకీయ రంగంలోకి ప్రవేశించేందుకు, పార్టీలో, పార్టీల మధ్య వివాదాల్లో పాత్ర పోషించేందుకు అటు రాజ్యాంగం గానీ ఇటు చట్టం గానీ గవర్నర్‌కు అధికారం కల్పించడం లేదు.'' అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గవర్నర్ కోషియారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన రాజ్యాంగ పరిధులు దాటి ఆయన వ్యవహరించారని తీర్పు వ్యాఖ్యానించింది. మహావికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం మెజారిటీని, సభా విశ్వాసాన్ని కోల్పోయిందన్న తన అనుమానానికి మద్దతుగా ఎలాటి స్పష్టమైన ఆధారాలు లేకుండానే విశ్వాస పరీక్షకు పిలుపునివ్వడం ద్వారా ఆయన రాజకీయ రంగంలోకి దూకారని వ్యాఖ్యానించింది. ''అసంతృప్తిగా వున్న ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని భావించినట్టు గవర్నర్ ఆధారపడిన ఏ కమ్యూనికేషన్లోనూ సూచించలేదు.'' అని చంద్రచూడ్ అన్నారు. శిండే వర్గానికి చెందిన భరత్‌షెట్ గాగ్వాలెను పార్టీ విప్‌గా నియమించడం కూడా చట్టవిరుద్ధమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
శిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ, పార్టీ చిహ్నం విల్లు, బాణం గుర్తును ఇస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పునరాలోచన ప్రభావాన్ని కలిగి లేదని సుప్రీంతీర్పు వ్యాఖ్యానించింది. పైగా ఇది, పార్టీ 2018 నిబంధనావళిలో, పార్టీ అంతర్గత ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకోవడమే కాగలదని పేర్కొంది.
ఎన్నికల కమిషన్ శిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం వెలువరించే వరకు శిండే, ఇతర ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లను స్పీకర్ రాహుల్ నర్వాకర్ తన వద్ద అట్టిపెట్టుకోరాదని కోర్టు అభిప్రాయపడింది. జూన్ 25న పార్టీ ఫిరాయించినందుకు గానూ అప్పటి డిప్యూటీ స్పీకర్ నరహరి జరివాల్ మాత్రం షిండేతో సహా 39మంది ఎమ్మెల్యేలపై అనర్హత నోటీసులు జారీ చేశారు.
శిండే ప్రభుత్వం తాత్కాలికంగా కొనసాగినప్పటికీ, పార్టీని చీల్చానని, అంతేకానీ పార్టీ నుంచి ఫిరాయించలేదని ముఖ్యమంత్రి ఇప్పటివరకు చేస్తూ వస్తున్న వాదనను సుప్రీం తీర్పు తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
అక్రమాలు జరిగాయని కోర్టు భావిస్తోంది, కానీ ఫలితాన్ని మార్చడానికి మాత్రం తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. జర్నలిస్టు సుహాస్ పాల్షికర్ మాట్లాడుతూ, ''చాలా కచ్చితంగా మాట్లాడాలంటే, శిండే ప్రభుత్వ ఏర్పాటుకు చట్టబద్ధమైన ప్రాతిపదిక లేదని సుప్రీం కోర్టు నిజానికి చెప్పలేదా? ప్రభుత్వాన్ని తొలగించాలని ఆదేశించకపోవచ్చు, కానీ ఒకసారి చట్టబద్ధత అంటూ పోయిన తర్వాత ప్రభుత్వం కూడా తొలగాల్సిందే.'' అని వ్యాఖ్యానించారు.
సభలో మెజారిటీకి అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు తన వైపు లేరని భావించిన ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసేసినందున తిరిగి ఆయనను ముఖ్యమంత్రిగా నియమించేందుకు ఆచరణాత్మకంగా గల మార్గాలను సుప్రీంకోర్టు బెంచ్ గతంలో ఎనిమిది సార్లు కేసు విచారణ జరిగిన సందర్భాల్లోనూ పరిశీలించింది.
గతేడాది జూన్‌లో ఏక్నాథ్ శిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు థాకరేపై తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకోవాలన్న థాకరే నిర్ణయం పార్టీ హిందూత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొంటూ శిండే వర్గం తిరుగుబాటుకు పాల్పడింది. బిజెపి నియమించిన గవర్నర్ మద్దతుతో రెబెల్ ఎమ్మెల్యేలు విశ్వాస పరీక్షకు పిలుస్తారని తేలినపుడు అప్పటి డిప్యూటీ స్పీకర్ నుంచి శిండేకు అనర్హతా నోటీసులు వచ్చాయి.
రెబెల్స్‌ను అనర్హులుగా ప్రకటించాలా లేదా అనే అంశాన్ని పరిశీలించేందుకు ఈ విషయం మొత్తం సుప్రీంకోర్టుకు చేరింది. అదే ఏడాది జూన్ 27న శిండేకు సుప్రీం కోర్టు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించింది. అనర్హతా నోటీసులకు తమ స్పందనలను దాఖలు చేసేందుకు గడువును పొడిగించింది. తర్వాత, జూన్ 29న గవర్నర్ బలపరీక్షకు అనుమతినిచ్చింది. ఆ రోజునే థాకరే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జూన్ 30న బలపరీక్షకు గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వడానికి సుప్రీం తిరస్కరించడంతో గంటల వ్యవధిలోనే మహా వికాస్ అగాఢి (ఎంవీఏ) ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా శిండేను గవర్నర్ ఆహ్వానించారు.