Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లాక్ డే విజయవంతం
- సత్యం కోసం మాతో సహకరించండి: రెజ్లర్లు
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎస్కేఎం లేఖ
- సీఐటీయూ కార్యకర్తల మద్దతు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న ఆందోళన 20వ రోజుకు చేరుకుంది. ఈ ప్రక్రియలో జాప్యాన్ని నిరసిస్తూ క్రీడాకారులు గురువారం బ్లాక్ డే పాటించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్లాక్ డేని నిర్వహించారు. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్లో సహా అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. మల్లయోధులే చేతికి, తలకి నల్ల బ్యాండ్ కట్టుకుని ధర్నాకు కూర్చున్నారు. రాత్రి, పగలు జరుగుతున్న ఆందోళనకు వందలాది మంది రైతులు, కార్మికులు మద్దతుగా నిలిచారు. పోలీసులు భద్రతను పెంచి అప్రమత్తంగా ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) లేఖ రాసింది. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకొని, ఆడపిల్లలను రక్షించాలని డిమాండ్ చేసింది. సీఐటీయూ ఆద్వర్యంలో హర్యానా నుంచి 200 మంది కార్మికులు జంతర్ మంతర్ లో రెజ్లర్లకు మద్దతు తెలిపారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ గా బ్లాక్ డే
రెజ్లర్ల ఈ తరహా నిరసన ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో రెజ్లర్లకు మద్దతుగా ప్రజల ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. మల్లయోధులకు అనుకూలంగా ప్రజలు తమ అభిప్రాయాలను తమదైన రీతిలో వ్యక్తం చేస్తున్నారు.
బ్లాక్ డేకు మద్దతుగా ప్రజలు ముందుకు రావాలని రెజ్లర్లు కూడా విజ్ఞప్తి చేశారు. రెజ్లర్ల ఈ ఆకర్షణ ప్రభావం ట్విట్టర్లో కూడా కనిపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో బ్లాక్ డే వైరల్గా మారింది. అంతర్జాతీయ రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు కూడా బ్లాక్ డే ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు.