Sat 05 Jun 20:49:05.083979 2021
Authorization
ఒక గ్రామాధికారి చెరువులో స్నానం చేస్తుండగా అతని ఉంగరం జారి నీటిలో పడిపోయింది. ఆ గ్రామాధికారి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆ ఉంగరం తన తండ్రి తనకు ఇచ్చిన అపురూపమైన వారసత్వ కానుక. ఎంతో పవిత్రంగా దానిని తాను చూసుకుంటున్నాడు. అతడు తర్వాత అది తన వేలుకు లేకపోవడం గమనించి మరునాడు అక్కడి జాలర్లకు ఈ సంగతిని చెప్పాడు. వారు వెంటనే వలలు తీసుకొని ఉంగరం కొరకు ఎంతో వెతికారు. కానీ చెరువు అంతా గాలించినా వారికి ఆ ఉంగరం దొరకనే లేదు.
ఇలా ఉండగా ఆ చెరువులోని చేపలను జాలర్లు ఒక్కొక్కరు ఒక రోజు వల వేసి పట్టాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారంగా ఆ చేపలను వారు పట్టుకొని సంతలో అమ్ముకోసాగారు. ఇంకెవరైనా చేపలు పడితే వారిని శిక్షించేటట్టు ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే ఆ సంగతి ఇతరులు ఎవరికి తెలియదు.
ఒకరోజు రామన్న అను ఒక పేదవాడు గ్రామాధికారి వద్దకు వచ్చి ఒక ఉంగరం ఎవరిదో తనకు దొరికిందని అతనికి దానిని ఇచ్చాడు. గ్రామాధికారి ఆ ఉంగరం తనదేనని గుర్తించి ఎంతో సంతోషించాడు. ఈ ఉంగరం ఎలా దొరికిందని గ్రామాధికారి ప్రశ్నించగా అతడు తాను ఒక చేపను కోసినప్పుడు దాని కడుపులో ఈ ఉంగరం దొరికిందని తెలిపాడు. గ్రామాధికారి సంతోషించి అతనికి బహుమానం ఇవ్వబోతే అతడు తనకు ఆ బహుమతి వద్దని తన ధర్మం తాను నెరవేర్చానని, తనది కాని సొమ్మును తాను తీసుకోనని వెళ్ళిపోయాడు.
కొన్ని రోజులకు అక్కడి జాలర్లు ఒక వ్యక్తిని పట్టుకుని గ్రామాధికారి వద్దకు వచ్చి అతడు దొంగతనంగా చేపలు పడుతున్నాడని అతడిని శిక్షించాలని అన్నారు. గ్రామాధికారి ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అతడు తనకు ఉంగరం తెచ్చి ఇచ్చిన రామన్ననే.
అప్పుడు గ్రామాధికారి సంకటంలో పడ్డాడు. రామన్న తాను ఇచ్చే బహుమానం తీసుకోకుండా ఆ రోజు వెళ్ళిపోయాడు. ఇతని మంచితనం తనకు తెలుసు. కానీ జాలర్లు అతనిని శిక్షించమని అంటున్నారు. అతనికి రామన్నను శిక్షించాలని లేదు. కానీ తప్పదు. శిక్షించకుండా ఉంటే జాలర్లకు అన్యాయం చేసినట్లు అవుతుంది. శిక్షిద్దామని అంటే ఆ ఒప్పందం సంగతి తనకు తెలియదని రామన్న అంటున్నాడు .మరుసటి రోజు తాను తీర్పును చెబుతానని గ్రామాధికారి వారితో చెప్పాడు.
ఆ రోజు రాత్రి గ్రామాధికారి బాగా ఆలోచించి ఏది ఏమైనా రామన్న చేసింది తప్పే అని నిర్ధారణకు వచ్చాడు. ''ఈ ఒప్పందం సంగతి తెలియకున్నా ఆ చెరువులో ఎవ్వరిని అడగకుండా చేపలు పట్టడం రామన్న తప్పని భావించాడు.. అందువలన అతనికి శిక్ష విధించడం సబబే'' అని గ్రామాధికారి నిర్దారణకు వచ్చాడు.
మరుసటి రోజు గ్రామాధికారి రామన్నను, జాలర్లను పిలిపించి ఐదువేల రూపాయల జరిమానాను రామన్నకు విధించాడు. తన దగ్గర అంత డబ్బు లేదని, తాను చాలా పేద వాడినని రామన్న కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అప్పుడు గ్రామాధికారి తానే ఐదు వేల రూపాయలు చెల్లించి రామన్న పట్ల తన కతజ్ఞతను చాటుకొని ఇరువురికీ న్యాయం చేశాడు. అంతేకాదు, వారికి రామన్న మంచితనం గురించి తెలిపి అతనికి తన ఇంట్లోనే ఉద్యోగం ఇచ్చాడు.
- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య
9908554535