Sun 25 Jul 05:31:43.271362 2021
Authorization
పూర్వం బండి ఎల్లయ్య అనే రైతు ఉండేవాడు. బండి ఎల్లయ్య చదువురాని వాడు. వ్యవసాయం తప్ప ఏమాత్రం లోక జ్ఞానం లేని అమాయకుడు. బండి ఎల్లయ్యకు రంగయ్య శెట్టి అనే మిత్రుడు ఉండేవాడు. రంగయ్య శెట్టి, బండి ఎల్లయ్య ఇరుగు పొరుగు ఇళ్ళల్లో వుండేవారు. ఎల్లయ్య వ్యవసాయం మీద వచ్చిన సంపాదనను దాచి భద్రంగా ఉంచమని, పొరుగునున్న రంగయ్య శెట్టికి ఇచ్చేవాడు. రంగయ్య శెట్టి మొదట్లో ఎల్లయ్యకు తన మీద వున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా ఖచ్చితంగా లెక్కలు చెప్పేవాడు, అంతే కాదు తన దగ్గర ఎల్లయ్య సంపాదనంతా వుంచినందుకు కొంత మొత్తాన్ని అదనంగా వడ్డీ కింద ఇచ్చి ఎల్లయ్య సంపాదనను పెంచేవాడు.
సంపాదనైతే పెరుగుతుంది కానీ దాన్ని ఎప్పుడూ వినియోగించుకునే వాడు కాదు ఎల్లయ్య. ''నీ సంపాదన లెక్కకు మించి ఎక్కువ అయిపోయింది, ఇప్పటికైనా దాన్ని తీసుకొని వినియోగించుకో, రేపు నీవు ముసలివాడివి అయిపోతే, అప్పుడు నువ్వు సరదాగా ఖర్చు చేద్దామనుకున్నా నీకు ఓపిక ఉండదు'' అని హిత భోద చేసేవాడు రంగయ్య శెట్టి.
''నేను నా సంపాదన అంతా నా పిల్లలకోసం దాచి పొదుపుగా వుంచుకుంటున్నాను. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నీ దగ్గర వున్న నా సంపాదన అంతా ఇద్దువుగానిలే నీ మీద నాకు పూర్తి నమ్మకం వుంది. అందుకే నా కష్టార్జిత సొత్తు నీ దగ్గర దాచుకుంటున్నాను'' అని రంగయ్యశెట్టి మీద పూర్తి నమ్మకంతో అనేవాడు ఎల్లయ్య.
ఎల్లయ్య మాటలకు రంగయ్య శెట్టి పగలబడి నవ్వుతూ ''పిచ్చి వాడా! నీకు ఇంకా పెళ్ళే కాలేదు, పిల్లలంటావు, వాళ్లకు నీ సంపాదన ఇస్తానంటావు, అంతా విచిత్రంగా వుంది, నీ వెర్రిగానీ లేని పిల్లలకు నీ సంపాదన ఇవ్వడమేంటి! నీ చాదస్తం కాకపొతే'' అని హేళన చేసే వాడు. రంగయ్యశెట్టి మాటలకు తాను ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక ఎల్లయ్య అమాయకంగా చిరునవ్వునే సమాధానంగా ఇచ్చేవాడు.
కొన్నాళ్ళకు ఎల్లయ్య సంపాదనను మోసంతో తానే కైవసం చేసుకోవాలన్న దుర్భుద్ధి పుట్టింది రంగయ్యశెట్టికి. ఎల్లయ్యకు పెళ్లి జరిగి పిల్లలు పుడితే అతని సంపాదన అంతా తీసుకుంటాడని దూరాలోచనతో, ఎల్లయ్యకు నచ్చచెప్పి ''నీకు ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయింది, ఇక నీకు పెళ్లి జరిగినా పిల్లలు పుట్టరు, అందుకే నాకున్న ఇద్దరు కొడుకుల్లో ఒకడ్ని నీకు దత్తత ఇస్తాను పెంచుకో'' అని సూచన చేసాడు.
అమాయకుడైన ఎల్లయ్య రంగయ్య శెట్టి చిన్న కొడుకుని పెంచుకున్నాడు. రంగయ్యశెట్టి కొడుకుని పెంచి పెద్దచేసిన ఎల్లయ్య, తాను సంపాదించిన ఆస్తి మొత్తం తన పెంపుడు కొడుక్కి ఇచ్చేయమని అడిగాడు రంగయ్యశెట్టిని.
రంగయ్యశెట్టి అధిక తెలివితో ఆలోచించి ఎల్లయ్యను ఇంకా ఎక్కువ కాలం కష్టపడేటట్లు చేసి, ఎక్కవ సంపాదన కూడబెట్టించి, తన చిన్నకొడుక్కి ఎక్కువ ఆస్తిని సమకూర్చిపెట్టి, ఎల్లయ్య మరణ అనంతరం దాన్ని తన ఇద్దరు కొడుకులకూ పంచి పెట్టాలని చూసి, ''ఎల్లయ్యా నీకు చెప్పడం మర్చిపోయాను, నీ సంపాదన అంతా మా ఇంటి పెరడులో గోయ్యతీసి దాచి పెట్టేవాడిని, ఆ గొయ్యకి ఆకలి ఎక్కువై నీ ఆస్తిని తినేసింది, జరిగినదేదో జరిగిపోయింది ఇంకా నీకు వయసు, కండబలం వుంది కాబట్టి ఇకపై సంపాదన నాకు ఇస్తే నా అటకుమీద పెట్టి భూమి నోటికి అందకుండా జాగ్రత్తగా ఉంచుతాను, నీ పెంపుడు కొడుకు కోసం ఇకపై కూడా బాగా కష్టపడు'' అన్నాడు నక్క వినయాలు నటిస్తూ.
భూమి పుత్రుడైన రైతు ఎల్లయ్యకు భూమి సంపాదనను మింగేస్తుందో, ఇస్తుందో బాగా తెలిసినవాడు కాబట్టి, రంగయ్యశెట్టి దుర్భుద్ధికి తగిన గుణపాఠం నేర్పాలని, ఒకరోజు తన పెంపుడు కొడుకు అనిపించుకునే, రంగయ్యశెట్టి చిన్నకొడుకుని పొరుగు వూరు తీసుకొని వెళ్తానని తీసుకుపోయి, వారం రోజులు తరువాత ఒంటరిగా ఇంటికి వచ్చి, రంగయ్య శెట్టి ముందు బోరున ఏడ్చాడు.
ఏమైందని రంగయ్యశెట్టి అడ గగా..''ఏమి చెప్పమంటావు రంగయ్యా! నా పెంపుడు కొడుకుని ఆకాశం ఎత్తుకుపోయింది, దానికి పది కోట్ల రూపాయలు ఇస్తే తప్ప వాడిని వదిలి పెట్టనని భీష్మించుకొని కూర్చుంది'' అని నెత్తీ నోరూ భాదుకున్నట్లు నటించాడు.
''అమ్మో డబ్బుకోసం ఆశపడితే చివరకు నా చిన్న కొడుకే నాకు దక్కేటట్లు లేడు. ఎల్లయ్య అమాయ కుడు కాదు, మహా దేశ ముదురు'' అని అనుకుంటూ ''అయితే ఎల్లయ్యా! ఆ ఆకాశాన్ని తొందరపడి మనవాడికి కీడు చెయ్యవద్దని చెప్పు. నేను భూమిని ఒప్పించి నీ ఆస్తిని కక్కించి నీకు తెచ్చి ఇస్తాను''అని రెండు రోజులు తరువాత ఎల్లయ్య ఆస్తిని నయాపైసలుతో సహా లెక్కించి ఇచ్చేసాడు రంగయ్య.
ఎల్లయ్య కూడా రంగయ్యశెట్టి చిన్నకొడుకుని బంధువులు ఇంటి నుండి తీసుకొచ్చి అతనికి అప్పగించి, ''ఇదిగో నీకొడుకు, ఆకాశం చెర నుండి విడిపించి తెచ్చాను, ఇప్పుడు నీకే అప్పగిస్తున్నాను, నాకు వయసు అయిపోయింది, నా ఆస్తిని అనాధ శరణాలయానికి ఇస్తున్నాను, నేను శేష జీవితాన్ని ఆ శరణాలయంలోనే గడిపేస్తాను'' అని చెప్పి అక్కడ నుండి అనాధ ఆశ్రమం వైపు వెళ్ళాడు.
తన పొలముని, ఆస్తిని అనాధ శరణాలయానికి దారాదత్తం చేసి, ఓపిక ఉన్నంత వరకూ పొలంలో కష్టపడి, శేష జీవితాన్ని అనాధ పిల్లల మధ్య గడిపేయాలని నిర్ణయించుకున్నాడు ఎల్లయ్య.
- ఎం వి స్వామి, 9441571505