Sat 31 Jul 21:35:01.863763 2021
Authorization
రామాపురం అనే గ్రామంలో రామయ్య నివసించేవాడు, ఊరూరు తిరిగి బట్టల వ్యాపారం చేస్తూ, కుటుంబాన్ని పోషించుకునే వాడు. భార్య పేరు లక్ష్మి. వీరికి పెళ్ళై ఆరు సంవత్సరాలైనా సంతానం కాలేదు. ఎన్నో పూజలు చేసారు, సంతానం కలగలేదనే బాధతో రామయ్యకు నిద్రపట్టేది కాదు, కొద్ది రోజుల తర్వాత దైవ కటాక్షంతో, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మి,
లేక లేక కలిగిన సంతానం కావడంతో, ఇంటి కులదైవం పేరుతో, ఈశ్వరయ్య అని నామకరణం చేశారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగారు. కొడుకు పెద్దవాడయ్యాక ఉన్నతమైన చదువులు చదివించి, మంచి ప్రయోజకుణ్ణి చేయాలని రామయ్య తపన. ఊర్లో గల సర్కారు బడిలో చేర్పించాడు. ఈశ్వరయ్య రోజు స్కూలుకు వెళ్లే క్రమంలో, సుధాకర్ అనే స్నేహితుడు తోడయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం బలపడింది,
సుధాకర్ పేదింటి అబ్బాయి కావడంతో, ఈశ్వరయ్య తను తెచ్చిన భోజనంలో సగం సుధాకర్‌కు పెట్టేవాడు. ఇది రామయ్యకు సరిపోయేది కాదు, ''వాళ్ళు పేదవాళ్ళు, మనం ధనవంతులం, వాడు సరిగా స్నానం కూడా చేయడు. మంచి బట్టలు వేసుకోడు, అలాంటి వాడితో స్నేహం చేయొద్దు. మనకు కూడా అలాంటి అలవాట్లే వస్తాయి'' అని కొడుకుని దండిస్తుండేవాడు రామయ్య. తండ్రి మాట జవదాటే వాడు కాదు ఈశ్వరయ్య. ఆ రోజు నుంచి సుధాకర్‌తో స్నేహం మానేసాడు. తను ధనవంతుల అబ్బాయిననే గర్వం ఈశ్వరయ్యలో బాగా పెరిగిపోయింది. సాటి విద్యార్థులను ఎవరినీ లెక్క చేసేవాడు కాదు, హేళన చేసేవాడు.
ఎక్కాలు సరిగా చెప్పలేదని, ఉపాధ్యాయుడైన రఘు రామయ్య ఒకరోజు ఈశ్వరయ్యని ఘాటుగా దండించిన సంగతి రామయ్యకు తెలిసి గొడవకు దిగాడు. ''నేనే నా కొడుకుని కొట్టను, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం, కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చారు, ఇంకోసారి ఇలా జరిగితే మర్యాదగా ఉండదు'' అంటూ ఉపాధ్యాయున్ని తీవ్రంగా మందలించాడు రామయ్య. ఆ రోజు నుంచి ఈశ్వరయ్య బడిలో మరింత ఎక్కువగా అల్లరి చేయసాగాడు. ఉపాద్యాయులు ఏమీ మాట్లాడేవాళ్ళు కాదు.
ఒకసారి తన స్నేహితుడు సుధాకర్‌ని, పాఠం ఒప్పజెప్ప లేదని, వాళ్ళ నాన్న రంగయ్య ముందరే ఉపాధ్యాయుడు తీవ్రంగా మందలించాడు, ''ఇంకా బాగా కొట్టండి గురువుగారు, భయం ఉంటే గానీ చదువు రాదు, కొట్టినందుకు నేనేమి అనుకోను'' అని రంగయ్య ఉపాధ్యాయునికి చెప్పి వెళుతుంటే, సుధాకర్‌ని చూసి ఈశ్వరయ్య గట్టిగా నవ్వేశాడు. '' మీ నాన్నకు నీపై కొంచెం కూడా ప్రేమ లేదు, నిన్ను బాగా కొట్టమని చెబుతున్నాడు'' అంటూ గట్టిగా హేళనగా నవ్వాడు ఈశ్వరయ్య. సుధాకర్ మౌనంగా ఉండిపోయాడు.
ఒకరోజు పక్క పిల్లాడితో గొడవపడి గాయపరిచాడని, ఉపాధ్యాయుడు ఈశ్వరయ్యను కొట్టాడు, ఇది తెలుసుకున్న రామయ్య ఉపాధ్యాయుడైన రఘురామయ్య పైకి దాడికి దిగి, కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు, ఇలా కొంత కాలం జరిగిన తర్వాత, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఒక రోజు రఘు రామయ్య వీధిలో నడుస్తూ వెళుతుండగా రామయ్య కనిపించాడు, ''రామయ్య ఎలా ఉన్నారు. కొడుకు బాగున్నాడా'' అని అడిగాడు. ఆ మాటతో రామయ్య బోరున ఏడ్చేసాడు. ''ఒక్కగానొక్క కొడుకు కదాని గారాబంగా పెంచాను, వాడు ఏ తప్పు చేసినా వెనక్కి వేసుకొచ్చాను. గారాబమే నా కొంప ముంచింది, వాడికి చదువు అబ్బలేదు, అల్లరిగా తిరుగుతూ రౌడీలా మారిపోయాడు, ఉద్యోగం సంపాదించి దర్జాగా ఉండాల్సిన వాడు, జైలులో నాలుగు గోడల మధ్య ఉన్నాడయ్యా'' అంటూ రఘురామయ్య పాదాలపై పడి, క్షమించమని వేడుకున్నాడు రామయ్య,
రామయ్యని పైకి లేపి ఓదార్చాడు ఉపాధ్యాయుడు ''మీ పిల్లవాడి జతలో సుధాకర్ అనే అబ్బాయి ఉండాలి కదా, అతను ఎక్కడున్నాడు, పాపం చాలా పేదవాడు అతను'' అడిగాడు ఉపాధ్యాయుడు. ''ఆ పిల్లవాడిని ఒకప్పుడు పేదవాడని హేళన చేశాను, కానీ వాడు బాగా కషి చేసి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, నా కొడుకుని అరెస్టు చేసి జైల్లో పెట్టింది కూడా అతనే'' అనగానే ఆశ్చర్యపోయాడు ఉపాధ్యాయుడు రఘురామయ్య ''అతి గారాబమే నిన్ను ముంచింది, చిన్న పెద్ద అనే తేడా గల నీ అహంకారమే నీ పతనానికి దారి తీసింది, తల్లిదండ్రుల తర్వాత గురువులే పిల్లల్ని సరైన మార్గంలో పెట్టేది, అలాంటి గురువునే నువ్వు ధూషించావు. ఇప్పటికైనా మారు'' అంటూ వెళ్లిపోయాడు రఘురామయ్య.
''బాగా బుద్ధి వచ్చింది'' అంటూ రెండు చేతులెత్తి నమస్కరించాడు రామయ్య.
- నరెద్దుల రాజారెడ్డి, 9666016636