Sun 29 Aug 00:50:54.842818 2021
Authorization
అనగనగా ఒక గ్రామంలో రంగయ్య నివసిస్తుండేవాడు. ఇతనికి ఒక్కగానొక్క కొడుకు శీను. రంగయ్య చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి బట్టల వ్యాపారం చేసేవాడు. కొడుకును బాగా చదివించాలని రంగయ్య పట్టుదల. సాధు జంతువులంటే శీనుకి చాలా ఇష్టం. పావురాళ్ళను సాకడం, కోడి పిల్లల్ని పెంపు చేయడం, చదువుపై గల శ్రద్ధకంటే వీటిపైనే ఎక్కువ శ్రద్ధ చూపేవాడు, ఈమధ్యనే ఇంటి ముందు ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. ''చదవడం మానేసి, ఇలాంటి పనులు చేయకు, చదువు లేకపోతే జీవితంలో పనికిరావు'' అంటూ రంగయ్య శీనుని దండించేవాడు, ఐనా కూడా శీను ప్రవర్తనలో మార్పు వచ్చేది కాదు.
''కోడి, కుక్క, ఇవన్నీ సాధు జంతువులే కదండి, వీటిని పోషించడంలో తప్పు లేదు, అవి మన మధ్య తిరిగేవి కాబట్టి, వాటి ఆలనా పాలన మనిషే చూడాలి, అది సహజ ధర్మం కూడాను'' అంటూ మధ్యలో కల్పించుకుంది రంగయ్య భార్య పార్వతి, ''నువ్వు ఇలా వెనకేసుకురాబట్టే వాడు చెడిపోతు న్నాడు'' అంటూ భార్యపై కోప్పడేవాడు రంగయ్య, కోడిపుంజు, కుక్కను ఎంతో అల్లారుముద్దుగా పెంచుతున్నాడు శీను.
ప్రతిరోజూ కుక్కకు తను తినే ముద్దలో సగం వేసేవాడు శీను, ఇది గమనించిన రంగయ్య ''బియ్యం ఊరకే రావు, ఎంత కష్టపడితేనో ఒక ముద్ద నోట్లోకి వెళుతోంది, రేపటి నుండి కుక్కకు అన్నం వేసావో కాళ్ళు విరగ్గొడతా'' అంటూ కోప్పడ్డాడు రంగయ్య, అతను చాలా పట్టుదల గల వ్యక్తి ''కుక్క విశ్వాసం కలది, మనుషుల్లాగా తిన్నింటి వాసాలు లెక్కించే గుణం కాదు'' అంది భార్య పార్వతి ''ఇలా రోజూ వేస్తుంటే మనం చివరికి అడుక్కుతినాలి'' అంటూ కసురుకున్నాడు రంగయ్య, ''కుక్క ఇంటి ముందు వుండడం మనకే మంచిది, కాపలా కాస్తుంది'' అంటూ శీను తరపున వాదించింది పార్వతి.
ఐనా కూడా వినలేదు రంగయ్య.. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయాక, కుక్కను దూరంగా వదిలేసొచ్చాడు రంగయ్య. ఉదయం కుక్క కనపడకపోయే సరికి, శీను చాలా బాధ పడ్డాడు, ''నాన్నా.. కుక్క కనపడలేదు'' అన్నాడు, ''పీడ విరగడైంది, రోజూ సగం ముద్ద మిగిలిపోతుంది'' అన్నాడు రంగయ్య, ''సగం ముద్దకోసం, ఎంతో విశ్వాసంగా ఇంటికి కాపలా కాస్తున్న కుక్కను పోగొట్టుకుంటామా'' అంటూ అంగలార్చింది పార్వతి, ''కుక్క లేకపోతే మనకు వచ్చిన నష్టమేమి లేదు'' అంటూ బయటికి నడిచాడు రంగయ్య.
ఒకరోజు రాత్రి రంగయ్య, భార్య, కుమారుడు, మేడపై నిద్రిస్తున్నారు, సుమారు పొద్దు పోయాక ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు, దొరికినవన్నీ దోచుకుని వెళ్ళిపోయారు, ఉదయం లేచి చూస్తే తెరచిన తలుపులు తెరచినట్లే వున్నాయి, ఇంట్లో నగదు. నగలు అన్ని పోయాయి, రంగయ్య చాలా బాధపడ్డాడు, ''ఇప్పటికైనా తెలిసిందా. కుక్క గేటు దగ్గర కాపలా వుండి వుంటే, దొంగల్ని రానిచ్చేది కాదు, సగం ముద్ద కోసం కక్కుర్తి పడి, ఎన్నో ఏళ్లుగా కష్టపడి దాచిపెట్టుకున్న సొమ్మంతా పోగొట్టుకున్నాం'' అంటూ పార్వతి రంగయ్యపై మండిపడింది.
శీనుకి ఇక మిగిలింది ఒక్క కోడిపుంజు మాత్రమే.. దానికి గింజలు వేస్తూ పెంచుకుంటున్నాడు, కొద్ది రోజులు పోయిన తర్వాత, రంగయ్యకు వ్యాపారంలో నష్టం వచ్చింది. ఇచ్చిన బాకీలు వెనక్కి రాలేదు. వ్యాపారం మానేసి ఏదైనా పనికి ఒకచోట కుదరాలనే ఆలోచన వచ్చింది. ఏదైనా పని కోసం వెతకడం మొదలు పెట్టాడు. ఒకచోట పని కుదిరింది. రేపు ఉదయం ఏడింటికే రమ్మన్నారు. ఏమాత్రం ఆలస్యమైనా ఇక ఆ పనిపై ఆశలు వదులుకోవాల్సిందే. ఎలాగైనా వెళ్ళాలనుకున్నాడు.
ఇంటికి వచ్చిన రంగయ్యకు, కోడిపుంజుకు గింజలు పెడుతూ కనిపించాడు శీను, రంగయ్యలో కోపం కట్టలు తెంచుకుంది, శీను చెంప పగులగొట్టాడు, ''నీకసలు బుద్దుందా.. అసలే పనిపాటు లేక నానాగడ్డి తింటున్నాం. ఉన్న నాలుగు గింజలు కోడికి పెట్టేస్తే.. మనం ఏం తినాలి, వయసు పెరిగే కొద్ది బుద్ధి పెరగాలి'' అంటూ దండించాడు రంగయ్య. శీను ఎంత బతిమలాడిన వినకుండా కోడిని అమ్మకానికి పెట్టాడు. ''వద్దండి.. ఆ కోడిని అమ్మేయకండి. ఈ వీధిలో అందర్ని తెల్లవారుజామున నిద్ర లేపేది మన కోడేనండి, చాలా మంది దాని కూత కోసమే ఎదురు చూస్తార'' అంది భార్య. ''నువ్వింకా పాత కాలంలోనే వున్నావు. నిద్ర లేవడానికి సవాలక్ష మార్గాలున్నాయి. దానికి గింజలు వేయక్కరలేదు'' వెటకారంగా అంటూ కోడిని అమ్మేసాడు.
పగలు పని కోసం బాగా తిరిగి అలసిపోయిన రంగయ్య, ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేచాడు. పనికి వెళ్ళాల్సిన సమయం మించిపోవడంతో మంచి ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఒకసారి ఆలోచించాడు. ''కుక్కను వెలేసిన తప్పుకు నగలు, నగదు పోగొట్టుకున్నాను. కోడిని అమ్మేసిన తప్పుకు చేతికొచ్చిన పనిని జారవిడుచుకున్నాను. అందుకే సాధు జంతువులని ప్రేమించాలన్నారు. మనిషికి తోడుగా వుంటాయి. వాటిని పోగొట్టుకొని చాలా పెద్ద తప్పు చేసాను'' అంటూ చాలా బాధ పడ్డాడు. భార్యకి, కొడుకు శీనుకి క్షమాపణ చెప్పి పశ్చాత్తాపం పడ్డాడు రంగయ్య.
- నరెద్దుల రాజారెడ్డి, 9666016636