Sun 10 Oct 00:05:15.413542 2021
Authorization
సదానందయ్య కుమారుడు గోపాలునికి తన ఇంటిలో ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న గోవు అంటే ఎంతో ప్రీతి. ఆ గోవుపాలు తాగి, పెరుగు తిని ఇంతటి వాడయ్యాడు. ఆ గోవుకు పుట్టిన దూడలన్నింటిని సదానందయ్య అమ్ముకుని చక్కటి ఇల్లు, పొలం కొనుక్కొని జీవనం సాగిస్తున్నాడు. ఇన్నాళ్ళు ఆ ఇంటి కల్పతరువుగా ఉన్న ఆ గోవు వట్టిపోయింది, ముసలితనం వచ్చేసింది. ఇక దీని పోషణ భారం కష్టం అనుకుని సదానందం ఆ గోవును కటిక శాలకు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం గోపాలునికి తెలిస్తే భాధపడతాడని కటికశాల నిర్వాహకులతో డబ్బు కూడా తీసుకున్నాడు. వారితో '' రేపు నేనే దీన్ని మీ దగ్గరకు తీసుకు వస్తాను'' అని చెప్పాడు. మరుసటి రోజు తెల్లవారుజామున గోపాలుడు లేవక ముందే దాన్ని తొలుకు పోయాడు. దారిలో ఇద్దరు దొంగలు కత్తులు తీసి ''మర్యాదగా ఈ ఆవును మాకు అప్పగించు లేకపోతే నీ ప్రాణాలు పోతాయి'' అని బెదిరించారు.ఆ మాటలు అన్ని ఆ గోవు వింది. సదానందయ్య ఆ గోవును అప్పగిస్తుండగా మా యజమానునినే భయపెడతారా! అనుకుని అమాంతంగా ఇద్దరిని తన కొమ్ములతో గాల్లోకి లేపేసింది.అల్లంత దూరంగా పడిన వారు మళ్ళీ లేవలేదు. ఆ గోవును చూడగానే సదానందయ్య దాని మెడ నిమురుతూ ''సమయానికి నా ప్రాణాలు కాపాడావు. నన్ను క్షమించు. నీ మీద దయ చూపక నిన్ను కటికశాలకు అప్పగించాలనుకున్న'' అన్నాడు. దానికి గోవు తల ఊపుతూ '' సదానందయ్య ఇంటి దగ్గర నీ కుమారుడు నేను కనపడక పోయేసరికి కంగారు పడుతున్నాడు పద'' అంది. సదానందయ్య గోవును ఇంటికి తీసుకెళ్లాడు.గోవు గోపాలుని చూడగానే తోక ఊపుతూ గోపాలుని ఒళ్ళు నాక సాగింది.గోపాలుడు సంతోషం తో ''వచ్చావా!'' అని గోవు తలను తన గుండెలకు ఆనించు కున్నాడు. ''చూశావా నాన్న మన ఆవు మంచి తనం. దీని మేలు మరువలేం. ఈ రోజు నీ ప్రాణాలు కాపాడింది. ''అన్నాడు. సదానందయ్య కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
''అవును నాది తప్పు ఇంతకాలం ఇది ఎంతో ఉపకారంగా ఉంది. ఇక ఈ ఆవు ఎప్పటికీ మన ఇంటిలోనే ఉంటుంది.మనం ఈ మాత్రం ఈ స్థాయిలో ఉన్నామంటే అంతా ఈ గోమాత చలువే'' అన్నాడు సదానందయ్య. ఆమాటకు గోపాలుడు సంతోషించి గంగడోలు నిమురుతూ ''మా మంచి గోవు'' అని ముద్దు పెట్టుకున్నాడు.
- కనుమ ఎల్లారెడ్డి ,
93915 23027.